ENGLISH | TELUGU  

తనని అవహేళన చేసిన వారితోనే శభాష్‌ చెప్పించుకున్న మహానటుడు డా.అక్కినేని!

on Sep 20, 2024

అక్కినేని నాగేశ్వరరావు.. నటనకు పెద్ద బాలశిక్ష లాంటివారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి అనుకునే వారెవరైనా ఆయన నటించిన సినిమాలు చూస్తూ నటన నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు. తన కెరీర్‌లో అక్కినేని పోషించని పాత్ర లేదు. తను చేసిన ప్రతి పాత్రలోనూ జీవించి ప్రేక్షకుల దృష్టిలో ఆయా పాత్రలని సజీవంగా నిలిచేలా చెయ్యడం అక్కినేని ప్రత్యేకత. మరి అలాంటి అక్కినేని  సాంఘిక చిత్రాల్లో నటించడానికి పనికిరాడు అన్నవారూ ఉన్నారు. ఇది నిజం..నాగేశ్వరరావు అసలు సోషల్‌ సినిమాలకి పనికి రాడు అన్నారు. ఆ మాటలని పట్టుదలగా  తీసుకొని తన మొదటి సాంఘిక చిత్రంలో అత్యద్భుతంగా నటించడమే కాకుండా ఆ సినిమాలో తను స్టైల్‌గా ధరించిన కళ్ళజోడుకే వన్నె తెచ్చారు. తద్వారా కొన్ని వేల మంది ఆ కళ్లజోడు కొనేలా చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. సెప్టెంబర్‌ 20 నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన తొలి సాంఘిక సినిమా సంసారం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. 

నాగేశ్వరరావు తన కెరీర్‌ తొలినాళ్లలో జానపద, పౌరాణిక చిత్రాలల్లోనే నటించారు. ఆయన తెలుగు చిత్ర సీమకి పరిచయమయ్యింది కూడా పౌరాణిక చిత్రం ద్వారానే. అలా అక్కినేని  అంటే కేవలం పౌరాణిక, జానపద చిత్రాల హీరోనే అనే ఒక ముద్ర ప్రేక్షకుల దృష్టిలో, ఇండస్ట్రీ దృష్టిలో ఉండిపోయింది. కాలం తనకి కావలసింది తానే సృష్టించుకుంటుంది అనేలా ఏఎన్‌ఆర్‌కి ఎల్‌ వి ప్రసాద్‌ డైరక్షన్‌లో సంసారం అనే మూవీలో తొలిసారిగా సాంఘిక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఎల్‌ వి ప్రసాద్‌తో చాలా మంది మీ సినిమాలో నాగేశ్వరరావుని తీసుకున్నారేంటి అతను సోషల్‌ సినిమాలకి పనికి రాడని అన్నారు. కానీ ఎల్‌ వి ప్రసాద్‌ ఎవరెన్ని చెప్పినా వినకుండా అక్కినేని మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు. 

అలా సంసారం మూవీ స్టార్ట్‌ అయ్యింది. ఏఎన్‌ఆర్‌  తన మీద వస్తున్న విమర్శలకి చెక్‌ పెట్టి తానంటే ఏంటో నిరూపించుకోవాలని సినిమాలోని తన పాత్ర కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఒక దశలో జానపదాల నటుడికి ప్యాంటు,  షర్ట్‌ ఏంటి అని ఎగతాళి చేసిన వాళ్లూ లేకపోలేదు. సంసారం సినిమాలో అక్కినేని వేణు అనే ఒక  పల్లెటూరి యువకుడి క్యారెక్టర్లో  ఫస్ట్‌ ఆఫ్‌లో అమాయకంగా కొంచెం మొరటుగా కనపడతాడు. అదే క్యారెక్టర్‌ సెకండ్‌ ఆఫ్‌ వచ్చే సరికి పూర్తిగా మారిపోతుంది. వేష భాషలతో పాటు ముఖ కవళికలు కూడా మారిపోయి పూర్తి క్లాస్‌గా మారిపోతుంది. అలాంటి వేణు క్యారెక్టర్‌కి అక్కినేని నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసారు. 

అంతే కాకుండా సెకండ్‌ ఆఫ్‌లో వచ్చే  కల నిజామాయేగా కోరిక తీరేగా అనే పాటని  ఏఎన్‌ఆర్‌ మీద చిత్రకరించడానికి మేకర్స్‌ సిద్ధం అవుతున్నారు. పైగా ఈ పాటలో అక్కినేని చాలా గ్లామరస్‌గా కనిపించాలి. వెంటనే అక్కినేని తనే సొంతంగా మద్రాస్‌లోని మౌంట్‌ రోడ్‌లో ఉన్న మయో ఆప్టికల్స్‌కి వెళ్లారు. అప్పటి వరకు అందరూ గుండ్రని అద్దాలున్న కళ్ళజోడునే వాడేవారు. దానికి భిన్నంగా అప్పటివరకు ఎవరూ వాడని కళ్లజోడు తీసుకున్నారు. తన ముఖకవళికలకు సరిపోయేలా నలుచదరంగా కళ్ళద్దాలని నాగేశ్వరరావు ఎంపిక చేసుకొని తన మీద చిత్రీకరించిన పాటలో ధరించారు.

ఇక అంతే.. సంసారం సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అక్కినేని ధరించిన కళ్ళజోడు బాగా ఫేమస్‌ అయిపోయింది. ఆ తర్వాత చాలామంది అక్కినేని ఆ కళ్ళజోడు మయో ఆప్టికల్స్‌లో కొన్నాడని తెలుసుకొని అక్కినేనిలా స్టైల్‌గా ఉండాలని ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆ తరహా కళ్ళజోళ్ళు అప్పట్లోనే దాదాపు 5000 వరకు అమ్మారంటే దానికి ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కినేని తెలుగు సినిమాకి స్టైల్‌ నేర్పిన హీరో అని ఆయన అభిమానులు ఇప్పటికీ అంటూ ఉంటారు. సంసారం సినిమా వల్ల తమ ఆప్టికల్‌ షాప్‌ అంత బిజీ అవ్వడానికి, వేల సంఖ్యలో కళ్ళజోళ్ళు అమ్ముడుపోవడానికి కారణమైన అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా.. కొన్ని సంవత్సరాల పాటు మయో ఆప్టికల్స్‌లో వచ్చే కొత్త మోడల్‌ గ్లాసెస్‌ పంపించారు. 

సంసారం చిత్రంతో పౌరాణిక, జానపద చిత్రాలకు తప్ప సాంఘిక చిత్రాలకు పనికి రాడని అవహేళన చేసిన వాళ్ళ నోళ్ళు మూయించారు అక్కినేని. ఆ తర్వాత అక్కినేని చేసిన సాంఘిక చిత్రాలు ఎలాంటి చరిత్ర సృష్టించాయో అందరికీ తెలిసిందే. సంసారం చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో నటించినందుకుగాను అక్కినేని ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్‌ తీసుకోలేదు. దటీజ్‌ అక్కినేని. తను సాంఘిక చిత్రాలకు పనికాడు అనేదాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని కృషి, పట్టుదలతో ఆ పాత్రలో అందర్నీ మెప్పించిన నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సెప్టెంబర్‌ 20. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది తెలుగువన్‌.  

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.