జమున బ్యాన్ విషయంలో ఎన్టీఆర్ అమాయకుడు.. సూత్రధారి ఎఎన్నారే!
on Apr 22, 2025
ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు అని చెప్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. ఎఎన్నార్ కంటే ఎన్టీఆర్ నాలుగు నెలలు పెద్దవారు. ఆ విధంగా ఎఎన్నార్‌ని తమ్ముడిలా భావించేవారు ఎన్టీఆర్. ఎలాంటి భేషజాలకు పోకుండా సినిమాలో తన పాత్ర ప్రాధాన్యం ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. ఒకరి మాట ఒకరు వినేవారు, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునేవారు. వీరిద్దరి స్నేహం దాదాపు పాతిక సంవత్సరాలపాటు నిరాటంకంగా కొనసాగింది. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జునయుద్ధం తర్వాత కొన్ని కారణాల వల్ల 14 సంవత్సరాలపాటు ఇద్దరూ కలిసి నటించలేదు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలోనే వచ్చిన చాణక్య చంద్రగుప్త చిత్రంతో ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరూ స్నేహంగా ఉండే రోజుల్లో అక్కినేని చెప్పిన ఒక మాట విని ముందు వెనకా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్. ఇకపై జమునతో కలిసి నటించకూడదన్న అక్కినేని నిర్ణయాన్ని సమర్థించిన ఎన్టీఆర్ తను కూడా ఆమెను దూరం పెట్టారు. అసలు అక్కినేని, జమునల మధ్య వివాదం ఎందుకొచ్చింది? విషయం తెలుసుకోకుండా ఎఎన్నార్‌ని సపోర్ట్ చెయ్యడం వల్ల ఎన్టీఆర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.
అక్కినేని నాగేశ్వరరావు, జమున జంటగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ఇల్లరికం’ చిత్రాన్ని నిర్మించారు ఎ.వి.సుబ్బారావు. 1959 మే 1న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మ్యూజికల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో జమునతో అక్కినేని.. కాస్త ఎక్కువ చనువు తీసుకొని ప్రవర్తించారట. దానికి హర్ట్ అయిన జమున ఆ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పారు. ఆ విషయాన్ని పెద్దది చేయడం ఎందుకని.. ఆమెకు వారు ఏదో సర్ది చెప్పి పంపించారు. తనపై అలా ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకున్న ఎఎన్నార్ జమున గురించి దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సీనియర్ ఆర్టిస్టులను గౌరవించదనీ, అమర్యాదగా మాట్లాడుతుందనీ నలుగురికీ చెప్పారు. అంతే కాదు, పెద్ద వారి ముందు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుందని ప్రచారం చేశారు.
విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా సోదరుడైన ఎన్.టి.ఆర్. చెవిలో కూడా ఊదారు. జమునను హీరోయిన్‌గా తీసుకోవద్దని తన నిర్మాతలకు చెప్పాననీ, మీరు కూడా ఆమెతో కలిసి చెయ్యొద్దని చెప్పారు అక్కినేని. దానికి ఎన్టీఆర్ ‘మీరు చేయకపోతే నేను మాత్రం ఎందుకు చేస్తాను’ అన్నారు. తను చేసే సినిమాల నిర్మాతలకు తాము జమునను బ్యాన్ చేసిన విషయాన్ని చెప్పారు ఎన్టీఆర్. ఇండస్ట్రీలో టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఎఎన్నార్ తమ సినిమాల్లో జమున ఉండకుండా చూసుకున్నారు. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. కన్నడలో బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘మానె తుంబిద హెన్ను’ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో రీమేక్ చెయ్యడానికి విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ కన్నడ సినిమా అక్కడ ఫ్లాప్. దానిలోని మెయిన్ థీమ్‌ని తీసుకొని డి.వి.నరసరాజు సహకారంతో ఒక కొత్త కథని సిద్ధం చేసుకున్నారు చక్రపాణి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సావిత్రిని ఓకే చేశారు. ఎఎన్నార్ సరసన జమునను తీసుకోవాలనుకున్నారు. దానికి ఎఎన్నార్ అభ్యంతరం చెప్పారు. తాను, ఎన్టీఆర్.. జమునతో సినిమాలు చేయడం లేదని చెప్పారు. అప్పటివరకు ఈ విషయం తెలియని చక్రపాణి షాక్ అయ్యారు. సరోజ పాత్రకు జమున అయితేనే బాగుంటుందని భావించిన చక్రపాణి విషయాన్ని దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడాయన ఎన్టీఆర్, ఎఎన్నార్, జమునలను పిలిపించారు. ‘మూడు సంవత్సరాలుగా జమునను మీరు బ్యాన్ చేశారని తెలిసింది. అంటే.. ఇండస్ట్రీని శాసించాలనుకుంటున్నారా’ అని సీరియస్ అయ్యారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. ఇకపై జమునతో సినిమాలు చెయ్యాలని ఎన్టీఆర్, ఎఎన్నార్‌లకు నచ్చజెప్పారు. అలా వారి మధ్య వివాదం సమసిపోయింది.
జమున జీవించి ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనను బ్యాన్ చేసిన విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్, ఎఎన్నార్ తనను బ్యాన్ చెయ్యడం వల్ల మూడు సంవత్సరాలు వారితో కలిసి సినిమాలు చేయని మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే ఈ వివాదానికి సూత్రధారి ఎఎన్నారేనని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అందర్నీ గౌరవించేవారని చెప్పారు. ఒక విధంగా ఆయన అమాయకుడని, ఎఎన్నార్ చెప్పిన మాటలు విని ఆయన అలా ప్రవర్తించారు తప్ప నిజానికి ఆయన దేవుడులాంటి మనిషి అన్నారు. ఆ సందర్భంలోనే మరో విషయాన్ని కూడా జమున ప్రస్తావించారు. తన జీవితంలో తన భర్తకి, ఎన్.టి.రామారావుకు తప్ప ఎంత గొప్పవారైనా మరొకరికి పాదాభివందనం చేయలేదని స్పష్టం చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
