తెలుగు సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. 1953లో వచ్చిన ‘బ్రతుకు తెరువు’ చిత్రంలో తొలిసారి ఈ జంట నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం సావిత్రితో కలిసి నటించనని అక్కినేని చెప్పారు.
1961లో శివాజీ గణేశన్, సావిత్రి, జెమిని గణేశన్ ప్రధాన పాత్రల్లో ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వంలో ‘పాశమలర్’ అనే తమిళ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. 1962లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో సుందర్‌లాల్ నహతా, డూండీ ‘రక్తసంబంధం’ పేరుతో ఆ చిత్రాన్ని రీమేక్ చేశారు.
ఈ సినిమాలో నటించాల్సిందిగా మొదట అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించారు నిర్మాతలు. కానీ, ఆ సినిమా చేసేందుకు అక్కినేని ఒప్పుకోలేదు. అది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సంబంధించి కథ. తను, సావిత్రి కలిసి ‘దేవదాసు’ వంటి ప్రేమకావ్యంలో నటించామని, ఈ సినిమాలో తామిద్దరూ అన్నా చెల్లెళ్లు అంటే ప్రేక్షకులు ఒప్పుకోరని, సినిమా ఫ్లాప్ అవుతుందని అక్కినేని చెప్పారు.
దాంతో ఎన్టీఆర్‌ను సంప్రదించగా ఆయన అంగీకరించారు. అంతకుముందు ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలుగా ఎన్నో సినిమాల్లో నటించారు. అయినా ప్రేక్షకులు వీరిద్దర్నీ అన్నాచెల్లెళ్లుగా అంగీకరించారు. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటన్నింటికీ ‘రక్తసంబంధం’ సినిమా రిఫరెన్స్‌గా నిలిచింది.
[anr no to savitri, akkineni nageswara rao jayanthi, anr jayanthi on sept 20, nt ramarao and savitri, raktha sambandham movie]




