Home

»

Featured News

హాస్య నట శిఖరం పద్మనాభం.. నాటి తరం నవ్వులరేడు జ్ఞాపకాలు!

Aug 20, 2026 4:28PM

(ఆగ‌స్ట్ 20 ప‌ద్మ‌నాభం జ‌యంతి సంద‌ర్భంగా..)

తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తనదైన హాస్యచతురత, అమాయకత్వంతో కూడిన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత బి.వి. పద్మనాభరావు (పద్మనాభం) జయంతి నేడు. 1931 ఆగస్టు 20న వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం గ్రామంలో జన్మించిన ఆయన, పసి వయసులోనే నాటకాల ద్వారా కళారంగంలోకి అడుగుపెట్టారు.

చిన్నతనం నుంచే పద్యాలు, పాటల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న పద్మనాభం, కేవలం ఐదేళ్ల వయసులోనే 'చింతామణి' నాటకంలో కృష్ణుడి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఆపై కళలపై ఉన్న మక్కువతో చెన్నై చేరుకుని రాజరాజేశ్వరి కంపెనీలో చేరారు. అక్కడ తన గాత్రంతో, నటనతో మెప్పించి నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే వెండితెర ప్రవేశానికి బాటలు వేసుకున్నారు.

1945లో 'మాయలోకం' చిత్రం ద్వారా కోరస్ గాయకుడిగా, నటుడిగా వెండితెరకు పరిచయమైన పద్మనాభం, ఆ తర్వాత 'త్యాగయ్య', 'యోగి వేమన', 'రాధిక' వంటి చిత్రాల్లో నటించారు. లెజెండరీ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంలో పోలయ్య పాత్ర ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత విజయవాహిని నిర్మించిన క్లాసిక్ 'పాతాళభైరవి'లో సదాజపుడిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

నటుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నారదుడి పాత్రలకు పద్మనాభం జీవం పోశారు. 'సతీ అనసూయ', 'ప్రమీలార్జునీయం' వంటి పౌరాణిక చిత్రాలలో ఆయన వేసిన నారద పాత్రలు విశేష ప్రజాదరణ పొందాయి. నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించిన ఆయన, 'రేఖా అండ్ మురళి ఆర్ట్స్' పతాకంపై 'దేవత', 'పొట్టి ప్లీడర్', 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. 'మర్యాద రామన్న' చిత్రం ద్వారానే గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యాన్ని గాయకుడిగా వెండితెరకు పరిచయం చేయడం విశేషం.

1970లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కథానాయిక మొల్ల' చిత్రం నంది అవార్డును సొంతం చేసుకుంది. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి.

తన నటనతో ఎన్నో తరాలను అలరించిన పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన హాస్య పాత్రలు తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com