Home

»

Bollywood News

కూతురి కల కోసం ఉద్యోగమే వదిలేసిన తండ్రి.. హేతల్‌ డేవ్‌ కథ తెలిస్తే కన్నీళ్లే!

Oct 30, 2026 10:50AM

సాధారణంగా అమ్మాయిలు లావుగా ఉంటే సమాజం నుంచి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పెళ్లి, అందం అంటూ రకరకాల మాటలతో వారిని బాధపెడుతుంటారు. కానీ అలాంటి విమర్శలనే తన బలంగా మార్చుకుని అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చుకున్న మహిళ హేతల్‌ డేవ్‌. భారత్‌కు చెందిన తొలి ప్రొఫెషనల్‌ మహిళా సుమో రెజ్లర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆమె జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిన ‘సుమో దిది’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ముంబైకి చెందిన హేతల్‌ చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. ఐదేళ్ల వయసులోనే జూడో శిక్షణ ప్రారంభించారు. అయితే ఆమె శరీరాకృతిపై చాలామంది విమర్శలు చేసేవారు. బరువు తగ్గాలని, లేదంటే పెళ్లి కాదని, పిల్లలు పుట్టరని కూడా కొందరు అవమానించేవారు. కానీ హేతల్‌ వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చిన క్రీడలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి సుమో రెజ్లింగ్‌ పోటీని ప్రత్యక్షంగా చూసిన ఆమెకు ఆ క్రీడపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సుమో గురించి తెలుసుకునేందుకు సైబర్‌ కేఫ్‌లకు వెళ్లి వివరాలు సేకరించేవారు.

అయితే భారత్‌లో అప్పట్లో మహిళల సుమో రెజ్లింగ్‌కు సరైన శిక్షణ సదుపాయాలు, కోచ్‌లు అందుబాటులో లేవు. దీంతో హేతల్‌ తన తమ్ముడితో కలిసి ముంబైలోని ఓవల్‌ మైదానంలో ప్రాక్టీస్‌ చేసేవారు. ఆమె తండ్రి కూడా కుమార్తె కలను నిజం చేసేందుకు ఉద్యోగాన్ని వదిలి మరీ అండగా నిలిచారు. 2008లో ఎస్టోనియాలో జరిగిన ప్రపంచ సుమో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు ప్రయాణ ఖర్చులకు స్పాన్సర్‌ దొరకడం పెద్ద సమస్యగా మారింది. అవసరమైతే పెళ్లి కోసం దాచిన నగలను అమ్మి అయినా పంపిస్తానని తండ్రి చెప్పడం ఆమె కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహానికి నిదర్శనం. చివరకు స్పాన్సర్‌ లభించడంతో పోటీల్లో పాల్గొన్న హేతల్‌ తన విభాగంలో టాప్‌ 8లో నిలిచారు. అదే ఏడాది భారత తొలి మహిళా సుమో రెజ్లర్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

హేతల్‌ జీవిత ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘సుమో దిది’ సినిమాలో శ్రియమ్‌ భగ్నాని ప్రధాన పాత్ర పోషించారు. జయంత్‌ రోహత్గి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ పాత్ర కోసం శ్రియమ్‌ నెలల తరబడి శిక్షణ తీసుకోగా, హేతల్‌ స్వయంగా జూడో, సుమోలో ఆమెకు మెళకువలు నేర్పించారు. కేవలం ఒక క్రీడాకారిణి విజయగాథ మాత్రమే కాకుండా, శరీరాకృతిపై వివక్ష, మహిళల కలలు, కుటుంబ ప్రోత్సాహం వంటి అంశాలను కూడా ఈ సినిమా స్పృశిస్తుంది. అయితే హేతల్‌ తన క్రీడా జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు సినిమా కథకే పరిమితం కాలేదు. స్పాన్సర్లు, గుర్తింపు లేకపోవడంతో 2012లో ఆమె పోటీలకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె ప్రయాణం ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చే కథగా నిలిచింది.

 

 

Sumo Didi, Hetal Dave, India's First Female Sumo Wrestler, Sumo Didi Real Story, Shriyam Bhagnani, Sumo Didi ZEE5, Women Empowerment, Indian Women Athletes, Hetal Dave Biography

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com