Home

»

Bollywood News

ప్రసవ వేదనలోనూ నాట్యం ఆపని కళాకారిణి.. ఆమె కథలో శ్రద్ధా కపూర్!

Oct 30, 2026 7:00PM

బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తమ ప్రతిభతో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ‘ఛావా’ వంటి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మరో ఆసక్తికరమైన బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ‘ఈఠా’. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణీ, తమాషా కళాకారిణి వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ట్రైలర్‌లో శ్రద్ధా కపూర్ లావణీ నృత్యకారిణిగా అద్భుతంగా కనిపించారు. సంప్రదాయ మరాఠీ వస్త్రధారణలో వేదికపై నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే వేదికపై చప్పట్లు, ప్రశంసలు అందుకునే కళాకారిణి వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొందనే విషయాన్ని కూడా ఇందులో చూపించారు. నమ్మినవారి వల్ల ఎదురైన మోసం, వ్యక్తిగత జీవితంలోని బాధలు, కళాకారిణిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె చేసిన పోరాటం ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ఒక సందర్భంలో తన నమ్మకమే తన గర్వమని, అది దెబ్బతిన్నప్పుడు అంతా కూలిపోయిందని శ్రద్ధా చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురిచేస్తుంది. మరోవైపు నాట్యం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని తెలిపే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ మహారాష్ట్రలో ఎంతో పేరుపొందిన లావణీ నృత్యకారిణి, తమాషా కళాకారిణి. చిన్న వయసు నుంచే కళారంగంలో అడుగుపెట్టిన ఆమె తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వేదికపై ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ప్రసవ వేదన మొదలైనా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ప్రదర్శన కొనసాగించేందుకు సిద్ధమైన సంఘటన ఆమె కళ పట్ల చూపిన అంకితభావానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. ఆమెను మహారాష్ట్ర ప్రజలు ‘తమాషా సామ్రాజ్ఞి’గా గుర్తించారు. కళాకారిణిగా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమాషా కళాకారుల సంక్షేమం కోసం కూడా ఆమె కృషి చేశారు. అలాంటి అరుదైన కళాకారిణి జీవితాన్ని ‘ఈఠా’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణ్‌దీప్ హుడా, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, నానా పటేకర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. మాడాక్ ఫిలింస్, కత్‌పుత్లీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘ఛావా’తో చారిత్రక కథను అద్భుతంగా తెరకెక్కించిన లక్ష్మణ్ ఉటేకర్.. ఇప్పుడు మహారాష్ట్ర జానపద కళా ప్రపంచాన్ని, ఒక గొప్ప కళాకారిణి జీవితాన్ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

 

 

[Shraddha Kapoor, Eetha Trailer, Laxman Utekar, Vithabai Narayangaonkar, Chhaava Director, Eetha Movie, Lavani Dance, Randeep Hooda]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com