బాలీవుడ్ స్టార్ హీరో, భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన జీవితంలో అత్యంత వివాదాస్పదమైన కృష్ణజింకల వేట (బ్లాక్‌బక్ కేసు) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక బాలీవుడ్ చిత్రంపై ఆయన లీగల్ టీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'కాలా హిరణ్: ది బాటిల్ ఫర్ లెగసీ' అనే పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్, విడుదలను తక్షణమే నిలిపివేయాలంటూ చిత్ర యూనిట్‌కు సల్మాన్ లీగల్ నోటీసులు పంపడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఈ నోటీసుల ప్రకారం, సల్మాన్ ఖాన్ అనుమతి లేకుండా ఆయన పేరును, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంఘటనలను ఈ సినిమాలో వాడుకుంటున్నారని లీగల్ టీమ్ ఆరోపించింది. కోర్టులో ఇంకా విచారణ దశలో ఉన్న ఒక సున్నితమైన కేసును ఇలా కమర్షియల్ సినిమాగా చూపించడం వల్ల సల్మాన్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని లాయర్లు స్పష్టం చేశారు. కేవలం సల్మాన్ క్రేజ్‌ను వాడుకుని లాభపడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారని వారు మండిపడ్డారు.
సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలను సామాజిక మాధ్యమాల నుంచి వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో కోర్టు ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సల్మాన్ తరపు న్యాయవాదులు హెచ్చరించారు. ఈ చిత్రంలో కథానాయకుడి లుక్, ఆయన ధరించిన బ్రాస్‌లెట్ కూడా సల్మాన్ ఖాన్ నిజజీవిత శైలిని పోలి ఉండటంతో వివాదం మరింత ముదిరింది.
ఈ చిత్రానికి భరత్ ఎస్. శ్రీనాథ్ దర్శకత్వం వహిస్తుండగా, వివాదాస్పద చిత్రాల నిర్మాతగా పేరొందిన అమిత్ జానీ నిర్మిస్తున్నారు. గతంలో కన్హయ్య లాల్ హత్య ఉదంతంపై కూడా సినిమా తీసి వార్తల్లో నిలిచారు అమిత్ జానీ. తాజా లీగల్ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. ఇది తమను భయపెట్టే ప్రయత్నమని, ఈ సినిమా ఎవరి బయోపిక్ కాదని, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న విషయాల ఆధారంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్ట్‌రూమ్ డ్రామాగా నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఈ వివాదం సోషల్ మీడియాలో బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తుండగా, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న పాత వివాదాలను కూడా ఇందులో చూపించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ 20న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేయగా, ప్రస్తుత లీగల్ వివాదంతో ఈ ప్రాజెక్ట్ భవితవ్యంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.





