బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుటుంబంలో ఊహించని విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆమె నమ్మిన వ్యక్తే భారీ మోసానికి పాల్పడటంతో టాండన్ ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. రవీనా టాండన్ వృద్ధురాలైన తల్లి వీనా టాండన్ సంరక్షణ చూసుకునేందుకు నియమించిన ఓ కేర్‌టేకర్, నమ్మకంగా ఉంటూనే ఇంట్లోని విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలను దొంగిలించింది. దాదాపు 25 లక్షల రూపాయల విలువైన సొత్తుతో పాటు ఖరీదైన వాచీలను కూడా ఆమె కాజేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన రాశి ఛాబ్రియా అనే 47 ఏళ్ల మహిళ గత కొన్ని సంవత్సరాలుగా రవీనా టాండన్ సోదరుడు, చిత్ర నిర్మాత అయిన రాజీవ్ టాండన్ నివాసానికి వస్తూ ఉండేది. కుటుంబంలో జరిగిన కొన్ని విషాదాల వల్ల ఒంటరిగా మారిన ఆమెను టాండన్ కుటుంబ సభ్యులు చేరదీసి, తమ ఇంట్లో ఒకరిగా చూసుకున్నారు. 86 ఏళ్ల వీనా టాండన్ ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యతను కూడా ఆమెకే అప్పగించారు. దీంతో ఆ నివాసంలోని రెండో అంతస్తుకు వెళ్లే పూర్తి స్వేచ్ఛ ఆమెకు లభించింది.
అయితే, గత ఏడాది ఆగస్టులో రాజీవ్ టాండన్ ఇంట్లో కొన్ని మరమ్మతు పనులు జరిగాయి. ఆ సమయంలో తల్లికి సంబంధించిన విలువైన బంగారు గాజులు, నెక్లెస్‌లు, హారాలు, వజ్రాల మంగళసూత్రం వంటి ఆభరణాలను బెడ్‌రూమ్‌కు అటాచ్ అయి ఉన్న ఒక లాకర్‌లో భద్రపరిచారు. దసరా పండుగ పూజల కోసం గతేడాది అక్టోబర్ 2న ఆ లాకర్ తెరిచి చూడగా, అది పగలగొట్టి ఉంది. అందులోని రూ. 25 లక్షల విలువైన ఆభరణాలతో పాటు రెండు లగ్జరీ రిస్ట్ వాచీలు మాయమైనట్లు గుర్తించారు.
మొదట నిందితురాలిని రాజీవ్ టాండన్ ప్రశ్నించగా తాను తీయలేదని బుకాయించింది. కానీ పోలీసులకు చెబుతామని హెచ్చరించడంతో తనే దొంగిలించినట్లు ఒప్పుకుంది. దొంగిలించిన రెండు వాచీలను తిరిగి ఇచ్చేసినప్పటికీ, నగలను మాత్రం జగదీష్ అనే వ్యక్తికి ఇచ్చానని త్వరలోనే ఇప్పిస్తానని కాలయాపన చేసింది. అంతేకాకుండా, ఒత్తిడి తెస్తే రాజీవ్‌ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తామంటూ ఒక నకిలీ పోలీస్ ఇన్‌ఫార్మర్‌తో బెదిరింపులకు కూడా పాల్పడింది. నగలు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో రాజీవ్ టాండన్ జుహూ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మే 21న రాశి ఛాబ్రియాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.





