భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ 'రామాయణ పార్ట్ 1'. నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచిన ఈ సినిమాను రాబోయే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ, త్వరలోనే ఒక సాలిడ్ టీజర్‌తో విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే, గత కొన్ని వారాలుగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది.
మొదట్లో ఈ సినిమా మొదటి భాగం కేవలం హిందీ బెల్ట్, థియేట్రికల్ హక్కుల ద్వారా ఏకంగా 500 కోట్ల రూపాయల దాకా బిజినెస్ చేస్తుందని ముంబై ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా ఆశించాయి. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, సమీకరణాల నేపథ్యంలో అందులో సగం మొత్తమే దక్కినట్లు లేటెస్ట్ అప్‌డేట్ స్పష్టం చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ధర్మా ప్రొడక్షన్స్ అధిపతి కరణ్ జోహార్ ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇండియా రైట్స్‌ను 250 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. మొదట అనుకున్న 500 కోట్లతో పోలిస్తే ఇది సగం మొత్తమే అయినప్పటికీ, ఒక హిందీ సినిమాకు ఈ స్థాయి రేటు పలకడం సాధారణ విషయం కాదనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి, 'పుష్ప' రేంజ్‌లో వేల కోట్ల వసూళ్లు కురిపిస్తే, ఇప్పుడు అంగీకరించిన మొత్తంలో స్వల్ప మార్పులు చేసుకునేలా ఇరువర్గాల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కూడా జరిగిందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు, ప్రమోషన్స్ విషయంలో రణ్‌బీర్ కపూర్ అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. జూలై నెల వచ్చినా ప్రమోషన్ల వేగం పెంచకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ చిత్రంలో రావణాసురుడిగా నటిస్తున్న కన్నడ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ఆగస్ట్ 26న రిలీజ్ కానుంది. ఆ సినిమా థియేటర్లలో రన్ ముగిసిన తర్వాతే 'రామాయణ' పబ్లిసిటీని ఫుల్ స్వింగ్‌లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ రావడంతోనే చిత్ర యూనిట్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించిన సుమారు అరగంట నిడివి గల ఫుటేజీని పరిశ్రమలోని కొందరు ప్రముఖులకు చూపించగా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ భారీ ప్రశంసలు దక్కాయి. గతంలో వచ్చిన టీజర్‌కు కాస్త మిశ్రమ స్పందన రావడంతో, ఈసారి రాబోయే ట్రైలర్ విషయంలో దర్శకుడు నితేశ్ తివారి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయిపల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పైనే మిగతా ప్యాన్ ఇండియా సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Ranbir Kapoor, Ramayana, Karan Johar, Sai Pallavi, Yash





