భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ సూచించకుండా యు సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో అన్ని వయసుల ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి అవకాశం కలిగింది.
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎగ్జామినింగ్ కమిటీ ఈ సినిమాను పరిశీలించి ఒక్క ఆడియో లేదా విజువల్ కట్ కూడా సూచించలేదు. అంతేకాదు, సాధారణంగా కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు సూచించే అదనపు మార్పులు కూడా ఈ చిత్రానికి అవసరం కాలేదని సమాచారం. అక్టోబర్ 30న చిత్ర నిర్మాతలకు సెన్సార్ సర్టిఫికెట్ అందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యు సర్టిఫికెట్ రావడం మరో ప్రత్యేకత. సాధారణంగా భారీ యాక్షన్, యుద్ధ సన్నివేశాలు ఉండే సినిమాలకు యు/ఎ సర్టిఫికెట్ రావడం చూస్తుంటాం. కానీ రామాయణం కథను అన్ని వయసుల వారు చూడగలిగేలా యు సర్టిఫికెట్ ఇవ్వడం విశేషంగా మారింది.
ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. మొత్తం 195 నిమిషాలు అంటే 3 గంటల 15 నిమిషాలుగా సెన్సార్ సర్టిఫికెట్‌లో నమోదైంది. ఇంతటి భారీ నిడివితో సినిమా రావడం కూడా ఆసక్తికరంగా మారింది. రామాయణంలోని ప్రధాన పాత్రలు, వాటి నేపథ్యాలు, అరణ్యవాసం, సీతాపహరణం వంటి కీలక ఘట్టాలను ఎంత విస్తృతంగా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, తొలి భాగంలో రాముడి ప్రయాణం, రావణుడితో సంఘర్షణకు దారితీసే పరిణామాలు ప్రధానంగా ఉండనున్నాయి.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అరుణ్ గోవిల్ దశరథుడిగా, లారా దత్త కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతటి భారీ తారాగణం, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.
[Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Ramayana Censor Report, Ramayana Runtime, Nitesh Tiwari, Ramayana Release Date]




