ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత, చిత్రంలోని పాత్రల కాస్ట్యూమ్స్ పై సోషల్ మీడియాలో చర్చతో పాటు తీవ్రంగా ట్రోలింగ్ సాగుతోంది.
ముఖ్యంగా సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవి బ్లౌజ్ డిజైన్, కైకేయి పాత్రలో కనిపిస్తున్న లారా దత్తా కాస్ట్యూమ్స్ ఆధునిక శైలిలో, టీవీ సీరియళ్లను పోలి ఉన్నాయంటూ నెటిజన్లు మీమ్స్ వేస్తూ విమర్శలు గుప్పించారు. త్రేతా యుగానికి చెందిన ఇతిహాసంలో మోడ్రన్ టచ్ ఎక్కువగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ విమర్శలు, ట్రోలింగ్ పై 'రామాయణ' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్న రింపుల్, హర్‌ప్రీత్ నరులా స్పందించారు. నెటిజన్ల వ్యాఖ్యలకు శాస్త్రీయంగా, భక్తి పూర్వకంగా గట్టి వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రామాయణం లాంటి పవిత్ర కావ్యాన్ని నిర్మించేటప్పుడు విమర్శలు రావడం సహజమేనని, తాము ఇప్పటికే వీటిని ఊహించామని వారు తెలిపారు.
త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఈ డిజైనర్ జంట మాట్లాడుతూ.. త్రేతా యుగానికి చెందిన బట్టల పురావస్తు ఆధారాలు ఏవీ నేడు అందుబాటులో లేవని స్పష్టం చేశారు. "మా ఇంట్లోని పూజ గదిలోని అమ్మవారి రూపం, ఆలయ శిల్పాలు, క్యాలెండర్ ఆర్ట్, ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన వర్ణచిత్రాల ఆధారంగానే ఎంతో భక్తితో, కళాత్మకంగా ఈ దుస్తులను రూపకల్పన చేశాం" అని రింపుల్ వివరించారు.
ఇక కైకేయి పాత్రధారి లారా దత్తా దుస్తుల వర్ణాలపై వస్తున్న కామెంట్లకు హర్‌ప్రీత్ నరులా స్పందిస్తూ.. "కైకేయి కాస్ట్యూమ్‌లోని ఆకుపచ్చ రంగు మాతృత్వానికి ప్రతీక కాగా, మెరూన్ రంగు ఆమెలోని భావోద్వేగ తీవ్రతను ప్రతిబింబిస్తుంది. ప్రతి రంగు ఎంపిక వెనుక ఒక బలమైన కారణం ఉంది. కేవలం కొన్ని లీక్డ్ పిక్స్ లేదా ట్రైలర్ క్లిప్స్ చూసి ఒక నిర్ధారణకు రావడం సరికాదు" అని విజ్ఞప్తి చేశారు.
గతంలో 'ఆదిపురుష్' చిత్రం మోడ్రనైజేషన్ పేరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో, 'రామాయణ' చిత్రబృందం కూడా కాస్ట్యూమ్స్ విషయంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో డిజైనర్లు ఇచ్చిన ఈ వివరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు డిజైనర్ల విజన్‌ను సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం బిగ్ స్క్రీన్ పై చూశాకే కామెంట్ చేస్తామని అంటున్నారు.





