భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చూడని స్థాయిలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. అదే నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి తెలిసిన తర్వాత మాత్రం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు భాగాలకు కలిపి సుమారు రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఐదు దేశాల వార్షిక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువ కావడం విశేషం.
సాధారణంగా భారీ సినిమాల బడ్జెట్ వందల కోట్లలో ఉంటుంటుంది. కానీ ‘రామాయణ’ విషయంలో లెక్క ఏకంగా వేల కోట్లకు చేరింది. అయితే ఈ రూ.4,000 కోట్లు కేవలం సినిమా నిర్మాణానికి మాత్రమే కేటాయించిన మొత్తం కాదు. రెండు భాగాల నిర్మాణంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి, మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను కూడా ఇందులో కలిపారు. ఈ విషయాన్ని రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని హాలీవుడ్ సినిమాల తరహాలో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ బడ్జెట్ ఎంత భారీదో అర్థం చేసుకోవాలంటే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూడాలి. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని తువాలు దేశ వార్షిక జీడీపీ సుమారు రూ.750 కోట్లు కాగా, నౌరు జీడీపీ దాదాపు రూ.1,764 కోట్లు. మార్షల్ ఐలాండ్స్ జీడీపీ సుమారు రూ.3,078 కోట్లు, పలావు జీడీపీ దాదాపు రూ.3,357 కోట్లు, కిరిబాటి జీడీపీ సుమారు రూ.3,618 కోట్లుగా అంచనా. అంటే ఈ ఐదు దేశాల్లో ఒక్క ఏడాదిలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ కంటే ‘రామాయణ’ రెండు భాగాల బడ్జెట్ ఎక్కువన్నమాట. అయితే ఇవి 2026 సంవత్సరానికి సంబంధించిన అంచనా గణాంకాలు మాత్రమే.
ఇక భారతీయ సినిమాల బడ్జెట్లతో పోల్చినా ‘రామాయణ’ ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’, ‘2.0’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆదిపురుష్’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి భారీ చిత్రాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ రెండు భాగాలు, ప్రపంచవ్యాప్త విడుదల, ప్రచార వ్యయాలను కలిపి చూస్తే ‘రామాయణ’ బడ్జెట్ వాటన్నింటినీ మించిపోతోంది. ఒక సినిమా బడ్జెట్‌ను ఒక దేశం ఏడాది ఆర్థిక ఉత్పత్తితో పోల్చుకునే స్థాయికి ఈ ప్రాజెక్ట్ చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఇంత భారీ పెట్టుబడితో రూపొందుతున్న ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
[Ramayana Movie Budget, Ramayana 4000 Crore Budget, Ranbir Kapoor Ramayana, Yash Ravana, Nitesh Tiwari Ramayana, Most Expensive Indian Movie, Ramayana Two Parts, Indian Cinema News]





