బాలీవుడ్ డ్రామా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ ఎప్పుడు మాట్లాడినా సంచలనమే. వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ నటి, తాజాగా తన కెరీర్‌లోని అతిపెద్ద మైలురాయి అయిన 'రాఖీ కా స్వయంవరం' రియాలిటీ షో వెనుక ఉన్న అసలు సత్యాన్ని బయటపెట్టారు. ప్రేమ లేదా భర్త కోసం ఆ షో చేయలేదని బాహాటంగా ఒప్పేసుకున్నారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ మాట్లాడుతుంటూ.. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన తనకు ముంబైలో స్వంత ఇల్లు కొనాలనే బలమైన కోరిక ఉండేదని తెలిపారు. ఆ సమయంలో తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని, ముంబైలోని లోకండ్వాలా ప్రాంతంలో సొంతిల్లు కొనుగోలు చేయడానికి భారీగా డబ్బు అవసరమైందని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఖాతాలో డబ్బులు పడాలనే ఏకైక ఉద్దేశంతోనే 'రాఖీ కా స్వయంవరం' షోకి సైన్ చేశానని, అందులో నిజమైన ప్రేమ గానీ, పెళ్లి చేసుకునే ఉద్దేశం గానీ లేవని స్పష్టం చేశారు. "నాకు డబ్బులు కావాలి, గ్రీన్ నోట్లు ముఖ్యం. అందుకే దర్శకనిర్మాతలు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు కూడా నేను అసలు వినలేదు.. ఎంత ఇస్తున్నారో మాత్రమే చూశాను" అంటూ రాఖీ సంచలన నిజాలు వెల్లడించారు.
ఆ షో పూర్తిగా ఫేక్ అని, అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన స్ట్రగ్లర్స్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. రామ్ కపూర్ హోస్ట్ చేసిన ఆ షో ముగింపులో కెనడా వ్యాపారవేత్త ఎలేష్ పరుజన్‌వాలాను ఎంచుకుని నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించి విడిపోయిన సంగతి తెలిసిందే.
గతంలో అనేక ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ల వివాదాలతో వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్, ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్లు ప్రకటించారు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల పురుషులపై, ప్రేమపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
[Rakhi Sawant, Rakhi Ka Swayamwar, Bollywood Controversies, Celebrity Interview Highlights, Bollywood News Updates]




