
కంగనా రనౌత్ వన్ ఉమెన్ షో 'క్వీన్' మూవీ సాధించిన విజయం తెలిసిందే. వాస్తవం మాట్లాడుకుంటే కంగనా రనౌత్ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం కూడా. ఫాంటమ్ స్టూడియోస్ నిర్మించగా విడుదలై దాదాపు 13 ఏళ్లు పూర్తి కావస్తోంది. దీంతో సీక్వెల్‌గా వస్తున్న ‘క్వీన్ 2’ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న క్వీన్ కి ఊహించని షాక్ తగిలింది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ స్టూడియోస్ జియోస్టార్‌పై బాంబే హైకోర్టులో ఏకంగా 250 కోట్ల భారీ దావా వేసింది. ఈ వివాదం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అసలు కథ ఏమిటంటే, మొదటి భాగమైన ‘క్వీన్’ చిత్రానికి సంబంధించిన రచనా హక్కులలో (IP Rights) తమకి 50 శాతం వాటా ఉందని ఫాంటమ్ స్టూడియోస్ కోర్టులో వాదిస్తోంది. భవిష్యత్తులో ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ నిర్మించాలన్నా తమ భాగస్వామ్యం, ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా ‘క్వీన్ 2’ చిత్రాన్ని నిర్మించారని వారు ఆరోపిస్తున్నారు.
Also read: వాడి కోసమే నా రూల్స్ అన్నీ మార్చేసుకున్నా... స్టోరీ సెలక్షన్స్‌పై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లే ముందే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఫాంటమ్ స్టూడియోస్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ మేరకు ఏప్రిల్‌లోనే వారు ఒక బహిరంగ ప్రకటనని విడుదల చేశారు. ఆ తర్వాత జియోస్టార్ సంస్థతో పాటు, దర్శకుడు వికాస్ బహ్ల్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా తెలిసిన వెంటనే, వారు బాంబే హైకోర్టును ఆశ్రయించి 250 కోట్ల నష్టపరిహార దావా వేశారు. విడుదలకు ముందే ఇంతటి భారీ వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్ ‘క్వీన్ 2’ రాబోయే రోజుల్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వికాస్ బహ్ల్ దర్శకుడు కాగా క్వీన్ 2 ని జియోస్టార్ నిర్మిస్తుంది. రిలీజ్ డేట్ పై ఇంకా అధికార ప్రకటన మాత్రం రాలేదు.





