బాలీవుడ్ నటి నోరా ఫతేహీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే కోట్లాది రూపాయల మనీలాండరింగ్, మోసం కేసులో విచారణను ఎదుర్కొన్న ఆమెకు తాజాగా ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. రూ.200 కోట్ల వసూళ్ల కేసులో సాక్షిగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌తో నోరాకు ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆమె వాంగ్మూలం కీలకంగా మారనుంది. నవంబర్ 2న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
అసలు ఈ రూ.200 కోట్ల కేసు విషయానికి వస్తే.. ఢిల్లీ రోహిణి జైలులో ఉన్న సమయంలో సుకేశ్ చంద్రశేఖర్ ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి 2020-21 మధ్య కాలంలో ఈ డబ్బులు తీసుకున్నట్లు కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ జరిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఇక ఈ కేసుకు సంబంధించి గతంలోనే నోరా ఫతేహీని పోలీసులు విచారించారు. సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనా మరియా పాల్‌తో ఆమెకు ఉన్న పరిచయాల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుకేశ్‌తో తనకు నేరుగా కాకుండా అతని భార్య ద్వారానే పరిచయం ఏర్పడిందని నోరా విచారణలో తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా 2020 డిసెంబర్లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరైన విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు. అప్పట్లో ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
తాజాగా దాఖలైన మూడో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో నోరా ఫతేహీని లిస్టెడ్ విట్నెస్ (LW-3)గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ప్రాసిక్యూషన్ తరఫు సాక్షిగా కోర్టుకు పిలిచారు. అయితే ఈ కేసులో నోరా ఫతేహీ నిందితురాలు కాదు.. సాక్షిగా మాత్రమే హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆమె ప్రతినిధులు అక్రమ కార్యకలాపాలతో నోరాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరి నవంబర్ 2న కోర్టులో ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
[Nora Fatehi, Nora Fatehi Summons, Sukesh Chandrashekhar Case, 200 Crore Extortion Case, Nora Fatehi Court News, Bollywood News, Jacqueline Fernandez]




