ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలను వెండితెరపై చూపించాలంటే.. ఆ వ్యక్తి ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, పోరాటాలను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలి. అయితే బయోపిక్‌లలో వాస్తవాలను ఎంతవరకు చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటాయి. తాజాగా ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎదురైన అసలైన సంఘర్షణను సినిమాలో పూర్తిగా చూపించలేదని, అందులో తన కష్టాన్ని కేవలం 10 శాతం మాత్రమే చూపించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
2014లో విడుదలైన ‘మేరీ కోమ్’ సినిమాలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మేరీ కోమ్ జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగిన మేరీ కోమ్ కథను ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో పాటు, ప్రియాంక చోప్రా నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. అయితే సినిమా విడుదలైన దాదాపు 12 ఏళ్ల తర్వాత మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ కోమ్.. తన బయోపిక్ వాస్తవ జీవితానికి చాలా దూరంగా ఉందని పేర్కొన్నారు. సినిమాలో చూపించిన దానికంటే తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సంఘర్షణలు చాలా ఎక్కువని తెలిపారు. తన అసలైన జీవిత పోరాటం, కఠోర శ్రమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తన ఆత్మకథ ‘అన్బ్రేకబుల్’ చదవాలని సూచించారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను వెండితెరపై చూపించిన తీరు పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఈ బయోపిక్‌ను వార్తల్లో నిలిపాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందా? అని అడిగిన ప్రశ్నకు మేరీ కోమ్ స్పందిస్తూ, ప్రస్తుతం సీక్వెల్ అవసరం లేదని స్పష్టం చేశారు. తన కథ, తన ప్రయాణం గురించి ఇప్పటికే చాలామందికి తెలుసని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, గతంలో ప్రియాంక చోప్రా కూడా మేరీ కోమ్ పాత్రను ఈశాన్య భారతదేశానికి చెందిన నటితో చేయించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఒక నటిగా ఆ పాత్రను పోషించాలనే ఆసక్తితో తాను అంగీకరించానని, అందుకోసం నెలల తరబడి బాక్సింగ్ శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఇలా సినిమా విజయవంతమైనప్పటికీ, అందులో చూపించిన వాస్తవాలపై స్వయంగా మేరీ కోమ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
[Mary Kom Biopic, Mary Kom Latest Comments, Priyanka Chopra Mary Kom, Mary Kom Unbreakable Book, Mary Kom Biopic Controversy, Mary Kom Real Story, Mary Kom Movie Review]




