
'రామాయణ' సినిమాపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. “ఈ సినిమాకి గనుక ఆస్కార్ రాకపోతే.. అకాడమీ అవార్డ్స్ జ్యూరీ పట్ల నేను తీవ్రంగా నిరాశ చెందుతాను.” అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మన భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ గురించి ఫడ్నవీస్ ఏమన్నారంటే.. “ఇది కేవలం ఒక దశాబ్దపు సినిమా కాదు. రాబోయే వేల సంవత్సరాలకు గుర్తుండిపోయే చిత్రం” అని కొనియాడారు.
ఇటీవల ముంబైలో నమిత్ మల్హోత్రాకి చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియో’ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన భారతదేశంలో వేల సంవత్సరాల నాటి గొప్ప కథలు, నాటకాలు, సంగీత పరంపర ఉన్నాయి. కానీ వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కావలసింది సరికొత్త సాంకేతికత మాత్రమే. ఆ పనినే ఈ రామాయణం టీమ్ చేస్తోందని ఆయన కొనియాడారు. గతంలో వేవ్స్ సమ్మిట్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఈ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రైమ్ ఫోకస్ వర్క్ చూసి తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని ఫడ్నవీస్ గుర్తు చేసుకున్నారు. మన భవిష్యత్తు తరాలకు మన పురాణ కథలను ఎలా అందించాలో ఈ సినిమా ప్రపంచానికి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Ramayana, Oscar, Maharashtra CM, Devendra Fadnavis





