Home

»

Bollywood News

12 అవార్డులతో సత్తా చాటిన ‘ధురంధర్’.. ఐఫాలో రణవీర్ సింగ్ హవా.!

Oct 31, 2026 4:19PM

ప్రతిష్టాత్మక ఐఫా అవార్డ్స్-2026 విజేతల జాబితా విడుదలైంది. ఈసారి అవార్డుల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా సత్తా చాటింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 12 అవార్డులను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది. ముఖ్యంగా ఉత్తమ నటుడిగా రణ్‌వీర్ సింగ్ అవార్డు అందుకోగా.. ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా కూడా ‘ధురంధర్’ నిలవడం విశేషం.

ఐఫా ప్రధాన అవార్డుల విషయానికి వస్తే.. ‘సైయారా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనీత్ పడ్డా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘ధురంధర్’లో ప్రతినాయకుడిగా మెప్పించిన అక్షయ్ ఖన్నా ఉత్తమ నెగెటివ్ రోల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదే సినిమాలో నటించిన సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ చిత్రానికి గాను హ్యూమా ఖురేషి ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్, ఉత్తమ గీత రచయితగా ఇర్షాద్ కామిల్, ఉత్తమ గాయకుడిగా ఫహీమ్ అబ్దుల్లా, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్ అవార్డులు దక్కించుకున్నారు.

సాంకేతిక విభాగాల్లోనూ ‘ధురంధర్’ హవా కొనసాగింది. ఉత్తమ ఒరిజినల్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వంటి విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. మరోవైపు ‘ఛావా’ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. ‘వార్ 2’ సినిమాలోని ‘ఆవాన్ జావాన్’ పాటకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు దక్కింది. ఇక ‘ఆజాద్’ సినిమాతో పరిచయమైన రాషా తడానీ ఉత్తమ తొలి సినిమా నటిగా, ‘సైయారా’ హీరో అహాన్ పాండే ఉత్తమ తొలి సినిమా నటుడిగా ఎంపికయ్యారు.

ఇక ఐఫా డిజిటల్ అవార్డుల్లోనూ పలువురు విజేతలుగా నిలిచారు. ‘బారాముల్లా’ ఉత్తమ చిత్రంగా నిలవగా.. ‘స్టోలెన్’ సినిమాకు దర్శకత్వం వహించిన కరణ్ తేజ్‌పాల్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ‘స్టోలెన్’లో నటించిన అభిషేక్ బెనర్జీ ఉత్తమ నటుడిగా, ‘మిసెస్’ చిత్రానికి సన్యా మల్హోత్రా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఉత్తమ వెబ్ సిరీస్‌గా నిలవడంతో పాటు ఆయనకు ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడి అవార్డు కూడా దక్కింది. ఇలా సినిమా, డిజిటల్ విభాగాల్లో పలువురు ప్రతిభావంతులను ఐఫా-2026 అవార్డులు వరించాయి.

 

 

[IIFA Awards 2026, Dhurandhar Movie, Ranveer Singh Best Actor, IIFA Winners List 2026, Aditya Dhar, Aneet Padda, Akshaye Khanna, Aryan Khan, Bollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com