ENGLISH | TELUGU  

దేశం కోసం అమ‌రుడైన తెలంగాణ వీరుడిగా సల్మాన్.. సినిమా రిలీజ్ అవుతుందా?

on Feb 9, 2026

కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు రొటీన్ సినిమాలకు భిన్నంగా తమ సినిమాలు ఉండాలని భావిస్తారు. దాని కోసం విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వారు ఎంపిక చేసుకున్న కథాంశం వల్ల సినిమా రిలీజ్‌కి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇప్పటివరకు అలా సెన్సార్‌లో చిక్కుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు. తాజాగా అలాంటి సమస్య సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ సినిమాకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

2020 జూన్ 15న లడాక్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సంతోష్‌బాబు నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో ఆయన అమరవీరుడయ్యారు. మరణం తర్వాత సంతోష్‌కు పరమవీర చక్ర పురస్కారం లభించింది. ఈ యుద్ధంలో చైనాకు చెందిన సైనికులు కూడా చనిపోయారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన సినిమాయే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’. కల్నల్ సంతోష్‌బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించారు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్.

 

‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్ అవ్వడం అంత సులభం కాదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. థియేటర్లలో సినిమాను విడుదల చేసుకోవచ్చు. కానీ, ఆ సినిమా వల్ల సమాజానికి, దేశ భద్రతకు నష్టం వాటిల్లుతుందని సెన్సార్ భావిస్తే క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చెయ్యదు. అలాంటి సమయంలో ఆ చిత్ర నిర్మాతలు కోర్టు పరిధికి వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ విషయానికి వస్తే.. ఇందులో రక్షణ శాఖ కూడా ఇన్‌వాల్వ్ అవనుందని తెలుస్తోంది. 

 

ఇప్పటికే ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రంపై చైనాలోని సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవాలను తారుమారు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారని తమ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇండియాలోని సోషల్ మీడియాలో కూడా సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ అవ్వడం అంత ఈజీ కాదు అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్‌తోపాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. 

 

గతంలో యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. మరి ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే.. గాల్వానా లోయలో జరిగన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యంపై చైనా జవాన్లు మెరుపు దాడికి దిగడంతో భారత సైనికులు ప్రతి దాడికి దిగి వారిపై వీరోచితంగా పోరాడారు. అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబుతోపాటు 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఈ పోరాటంలో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో భారత్, చైనా మధ్య సత్సంబంధాలు లేకపోయినా.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. అయినప్పటికీ రక్షణ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్‌కి మార్గం సుగమం అవుతుంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.