ఆస్కార్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సరిహద్దుల్లో ఒక అద్భుతమైన దృశ్యానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీతో కలిసి ఆయన అట్టారీ-వాఘా సరిహద్దును సందర్శించారు. అక్కడ దేశాన్ని రక్షించే వీర సైనికులకు గౌరవ సూచకంగా ‘జై హో - ఏ మ్యూజికల్ సెల్యూట్ టు ది బ్రేవ్‌హార్ట్స్’ అనే ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజూ అత్యంత ఘనంగా జరిగే బీటింగ్ రిట్రీట్ సెర్మనీ సమయంలో రెహమాన్ ఇలా సరిహద్దు వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ వినూత్న కార్యక్రమం కేవలం సాధారణ ఈవెంట్ మాత్రమే కాదు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మై వాపస్ ఆవూంగా’ ప్రమోషన్స్‌లో భాగంగా దీనిని ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించే బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ జవాన్ల త్యాగాలకు కృతజ్ఞతగా ఈ నివాళి అర్పించినట్లు తెలిపారు. దేశ విభజన నేపథ్యంలో సాగే హృదయ విదారక ప్రేమకథతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, సరిహద్దులు ఎందరో హృదయాలను ముక్కలు చేసినా అంతిమంగా ప్రేమే అందరినీ కలుపుతుందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.ఈ సంగీత సాయంత్రం రెహమాన్ తన అద్భుత స్వరంతో ‘చందా సూరజ్ లాఖోం తారే’ అనే గీతాన్ని ఆలపించడంతో ప్రారంభమైంది.
ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన ప్రముఖ గాయకులు మోహిత్ చౌహాన్, నీలాంజనా ఘోష్, పూజా తివారీలతో పాటు ఈ చిత్రంలో నటిస్తున్న యువ హీరో వేదాంగ్ రైనా కూడా గొంతు కలిపి ప్రేక్షకులను అలరించారు. చివరగా రెహమాన్ తన ఐకానిక్ దేశభక్తి గీతం ‘మా తుఝే సలాం’ పాడుతుంటే అక్కడ చేరిన వేలాది మంది ప్రేక్షకులు, సైనికులు దేశభక్తిలో మునిగితేలారు.
ఈ చిత్ర విశేషాల్లోకి వెళితే.. 1947 భారత్-పాక్ విభజన కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఇంతియాజ్ అలీ మార్క్ ఎమోషన్స్‌తో ఈ ప్రాజెక్ట్ సిద్ధమైంది. చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ దిల్జిత్ దోసాంజ్, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, శర్వరీ వాఘ్ మరియు వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చగా, ఇర్షాద్ కమిల్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
సరిహద్దుల్లో జరిగిన ఈ చారిత్రాత్మక సంగీత విభావరికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు, సినీ లవర్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు సైతం ఈ వినూత్న ప్రమోషన్ స్ట్రాటజీని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామా ‘మై వాపస్ ఆవూంగా’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.





