హారర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇష్టపడేవారికి ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘అంజాన్ సాయే’. క్షుద్రపూజలు, నరబలులు, మాంత్రికుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. బెంగాలీ భాషలో ‘నిఖోష్ ఛాయా’ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ రెండు సీజన్లను ఇప్పుడు తెలుగులోనూ చూసే అవకాశం ఉంది.
నవీన్ కార్తీక్‌కి కొన్నేళ్లుగా క్షుద్రవిద్యలపై అవగాహన ఉంటుంది. దుష్ట ప్రయోగాల బారిన పడినవారిని ఆయన దైవబలంతో రక్షిస్తూ ఉంటాడు. క్షుద్రవిద్యలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు కూడా ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో ఓ క్షుద్రమాంత్రికుడు నరబలులు ఇస్తున్నాడనే వార్తలు కలకలం రేపుతాయి. వరుసగా ముగ్గురు యువతులు బలికావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతారు. పోలీస్ ఆఫీసర్ అభిషేక్‌తో కలిసి నవీన్ కార్తీక్ ఈ కేసును పరిశోధించడం మొదలుపెడతాడు.
చంద్రగ్రహణం సమీపిస్తుండటంతో తన శక్తులను పెంచుకోవడానికి క్షుద్రమాంత్రికుడు ఈ నరబలులు ఇస్తున్నాడని నవీన్ కార్తీక్ గుర్తిస్తాడు. అయినా కానిస్టేబుల్ బాబు కూతురు సునీత కనిపించకుండా పోతుంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే పోలీస్ ఆఫీసర్ అభిషేక్ భార్య రీతూ కూడా అదృశ్యమవుతుంది. ఈ ఇద్దరినీ మాంత్రికుడి బారి నుంచి కాపాడగలిగారా? ఆ మాంత్రికుడు ఎవరు? అతని గతం ఏమిటి? అన్నది మిగతా కథ. మాంత్రికుడి ఫ్లాష్‌బ్యాక్, రెండు సీజన్ల క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటాయి.
క్షుద్రపూజలు, నరబలులకు సంబంధించిన సన్నివేశాలు ఈ సిరీస్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాన్ని చూపించిన విధానం కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కథకు బలాన్ని ఇచ్చాయి. అయితే ఇలాంటి కథలు గతంలోనూ చాలానే రావడంతో కొత్తదనం పెద్దగా కనిపించదు. నరబలులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. మొత్తం 12 ఎపిసోడ్లు అందుబాటులో ఉండగా, ఒక్కో ఎపిసోడ్ నిడివి తక్కువగా ఉండటం వల్ల పెద్దగా బోర్ కొట్టదు.
[Anjaan Saaye Review, Anjaan Saaye Telugu, Anjaan Saaye Netflix, Anjaan Saaye Web Series, Horror Thriller Series, Netflix Telugu Dubbed Series, Black Magic Thriller, Anjaan Saaye Rating]




