
బాలీవుడ్లో ప్రముఖ నటుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన అభిమానులను కలిసే విషయంలోనూ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం అభిమానులను పలకరించిన ఆయన.. ఈసారి మాత్రం బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నిలబడి అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వద్ద ప్రతి ఆదివారం అమితాబ్ అభిమానులను పలకరించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఆయనను చూడాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు అక్కడికి చేరుకుంటుంటారు. సాధారణంగా ఇంటి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేసే బిగ్ బీ.. ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ షీల్డ్ లోపల నుంచి వారిని పలకరించారు.
అమితాబ్ అభిమానులను కలుస్తున్న సమయంలో కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా అక్కడే ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీంతో ఈసారి బిగ్ బీ ఆదివారం దర్శనం గతంలో కంటే భిన్నంగా కనిపించింది.

అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో దుండగులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నివాసాల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమితాబ్ నివాసం వద్ద భద్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది. అభిమానులను కలిసే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ గ్లాస్ షీల్డ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: జిమ్ జిమ్ తార సింగర్ వార్నింగ్.. పాట తీసేయకపోతే ఆదర్శ కుటుంబం టీమ్‌పై కేసు.!
[Amitabh Bachchan Bulletproof Glass Shield, Amitabh Bachchan Security, Amitabh Bachchan House, Tiger Shroff Firing, Amitabh Bachchan, Abhishek Bachchan, Telugu Film News]




