
హిందీ ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. యాక్టర్స్ చట్టపరమైన చిక్కుల్లో పడి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవలే చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష పడటం సంచలనం సృష్టించింది. అది మరువకముందే, ఇప్పుడు మరొక టీవీ నటుడు వేధింపుల కేసులో అరెస్ట్ కావడం ఇండస్ట్రీని మరోసారి షాక్‌కు గురిచేసింది. ఆయన మరెవరో కాదు, హిందీ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోహిత్ చందేల్.
'కాశీబాయి బాజీరావు బల్లాల్', 'పాండ్యా స్టోర్', 'సైరాబ్' వంటి పాపులర్ టీవీ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రోహిత్ చందేల్. అయితే, కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు, ఇప్పుడు అనూహ్యంగా 'పోక్సో' యాక్ట్ కింద చిక్కుల్లో పడ్డాడు. ఒక మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడనే తీవ్రమైన ఆరోపణలతో ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటనలో బాధితురాలికి, నటుడు రోహిత్‌కు గతంలోనే పరిచయం ఉంది. అయితే, ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని రోహిత్ వేధింపులకు పాల్పడ్డాడని ముంబై ఈస్ట్ శివారు ప్రాంతానికి చెందిన సదరు మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మొబైల్‌కు తరచూ వివిధ ఫోన్ నంబర్ల నుంచి రోహిత్ ఫోన్లు చేసేవాడని, వద్దని ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడేవాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా, జూలై 5న బాలిక ఇంటి దగ్గర వెంబడించి, దారికి అడ్డుపడి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, భౌతికంగా కూడా దాడికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు.
ఈ ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన పోలీసులు, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం ముంబైలోని దహిసర్ ప్రాంతంలో గల రోహిత్ చందేల్ నివాసానికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని స్పెషల్ పోక్సో కోర్టులో హాజరుపరచగా, కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఒకవైపు ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని ప్రయత్నిస్తూనే, మరోవైపు నటుడిగా ఎదిగిన రోహిత్ చందేల్, ఇటువంటి అనాగరిక చర్యల వల్ల ఇప్పుడు జైలు గడప తొక్కాల్సి వచ్చింది.
Rohit Chandel, Arrest, POCSO Act, Bollywood, TeluguOne





