Read more!

English | Telugu

బుర్రా వెంక‌టేశం 'జీవ‌న ధన్య' శ‌త‌కాన్ని ఆవిష్క‌రించిన డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

 

తెలుగువ‌న్ డాట్ కామ్‌, అక్ష‌ర‌యాన్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంక‌టేశం ర‌చించిన 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కాన్ని ఈ రోజు (మే 22) సాయంత్రం జూమ్ స‌మావేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న పుస్త‌కావిష్క‌ర‌ణ చేసిన అనంత‌రం మాట్లాడుతూ, వ్య‌క్తిగ‌తంగా ఈ కార్య‌క్ర‌మంలో భాగం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. బుర్రా వెంక‌టేశం, తాను ఒకే స్కూల్ నుంచి వ‌చ్చామ‌ని తెలిపారు. సాహిత్యంలో ఆయ‌న‌కు ఇంత అభిరుచి, అభినివేశం ఉంద‌నే విష‌యం ఇటీవ‌లే త‌న‌కు తెలిసింద‌న్నారు. త‌ను రాసిన‌వి అప్పుడ‌ప్పుడు వాట్స‌ప్ ద్వారా పంపిస్తున్నార‌ని తెలిపారు. వెంక‌టేశం ఒక క‌విగా మార‌డం ఆనందంగా ఉంద‌న్నారు. జీవ‌న ధ‌న్య‌లోని 103 క‌విత‌ల్లో అంద‌ర్నీ ఆలోచింప‌జేసే విష‌యాలున్నాయ‌నీ, జీవితం గురించిన మంచి విష‌యాలు ఉన్నాయ‌నీ అన్నారు. స‌మాజం డివైడ్ కాకుండా యునైటెడ్‌గా ఉండాల‌నేది వెంక‌టేశం ఆకాంక్ష అని చెప్పారు. తాను డిగ్రీకి వ‌చ్చేంత‌వ‌ర‌కూ తెలుగు మీడియంలోనే చ‌దువుకున్నాన‌ని తెలిపారు. క‌ఠిన ఛంద‌స్సుతో కాకుండా స‌ర‌ళ‌మైన భాష‌లో, అంద‌రికీ అర్థ‌మ‌య్యే రీతిలో ఈ శ‌త‌కాన్ని వెంక‌టేశం రాశారు. ఇలాంటి సాహిత్యాన్ని ఆయ‌న మ‌రింత‌గా సృజించాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

సుప్రసిద్ధ క‌వి ఆచార్య ఎన్‌. గోపి మాట్లాడుతూ, "ఐఏఎస్‌లు కానీ, ఐపీఎస్‌లు కానీ సాహిత్యంలోకి వ‌స్తే ఆ జాతికి ఎంతో మేలు జ‌రుగుతుంది. సాహిత్యం హృద‌యాన్ని మెత్త‌బ‌రుస్తుంది. మాన‌వ‌త్వాన్ని పెంచుతుంది. తాను 2011లో నంది అవార్డుల క‌మిటీకి ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన‌ప్పుడు బుర్రా వెంక‌టేశం ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా, ఐఅండ్‌పీఆర్ క‌మిష‌న‌ర్‌గా ఉన్నారు. అప్పుడు ఆయ‌న‌తో ప‌రిచ‌యం జ‌రిగింది. అప్పుడే ఆయ‌న అంటే ఆత్మీయ భావం ఏర్ప‌డింది. ఆయ‌న మ‌ట్టిలో పుట్టిన మాణిక్యం. ఆయ‌న ఉన్న ఊరు నుంచి ఐఏఎస్ కావ‌డం చిన్న విష‌యం కాదు. తెలుగుకు ప్రాచీన హోదా రావ‌డంలో ఆయ‌న కృషి చాలా ఉంది. అందుకు తెలుగువారంతా ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉన్నారు. మెత్త‌టి మ‌నిషి కాబ‌ట్టే సాహిత్యంలోకి ఆయ‌న వ‌చ్చాడు. జీవ‌నం అంటే బ్ర‌తుకు తెరువు. ధ‌న్యుడంటే స‌క్సెస్‌ఫుల్ కావ‌డం. జీవ‌నంలో విజ‌యం సాధించ‌డం జీవ‌న ధ‌న్య‌. వేమ‌న ఇప్పుడు పుట్టి ఉంటే బుర్రా వెంక‌టేశంలా రాసి ఉండేవాడంటాను. చాలా ఫ్రెష్‌గా ఆయ‌న క‌విత్వం ఉంది." అని చెప్పారు. శ‌త‌కంలో వెంక‌టేశం స్పృశించిన విష‌యాల‌ను విశ‌దీక‌రించారు. జ‌నాన్ని ప్రేమించ‌లేనివాడు మంచి క‌విత్వం రాయ‌లేడ‌నీ, ఇంత బాగా రాశారు కాబ‌ట్టి ఆయ‌న జ‌నాన్ని బాగా ప్రేమించార‌ని తెలుస్తోంద‌న్నారు.

తెలుగు యూనివ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఎస్వీ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, "తెలుగు విశ్వ‌విద్యాల‌యం ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా త‌న వంతు చేయూత‌నందించారు బుర్రా వెంక‌టేశం. ఆయ‌న వ్య‌క్తిత్వంలోనే ఆత్మీయ‌తా భావం ఉంది. ఆయ‌న సెల్ఫ్ వ్యూ స‌క్సెస్‌తో ఒక రికార్డ్ సృష్టిస్తే, ఈ 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కంతో ఇంకో రికార్డ్ సృష్టించారు. శ‌త‌కంలో సాధారణంగా క‌వులు త‌మ పేరును మ‌కుటంగా పెట్టుకుంటారు. కానీ వెంక‌టేశం 'స‌త్య‌మిదే తెలుసుకో మిత్ర‌మా!' అనే సంబోధ‌న‌తో మ‌కుటం పెట్టుకున్నారు. 'మిత్ర‌మా' అనేది హృద‌యం నుంచి వ‌చ్చే ఒక గొప్ప మాట‌. అపార‌మైన జీవితానుభ‌వం, మాన‌వ సంబంధాలు, మాన‌వ విలువ‌లు, సుఖ‌దుఃఖాలు, క‌లిమిలేములు, గెలుపుపై ఒక దృక్ప‌థం వంటివ‌న్నీ ఈ శ‌త‌కంలో అడుగ‌డుగునా క‌న‌ప‌డ‌తాయ్‌. జీవ‌న సంబంధాల‌పై క‌వికి ఉన్న అవ‌గాహ‌న, సార్వ‌కాలిక‌మైన జీవ‌న విలువ‌ల ప్ర‌తిపాద‌న క‌నప‌డ‌తాయ్‌. వీటిని వ‌చ‌న ప‌ద్యాలు అన‌వ‌చ్చు. కోట‌బుల్ కోట్స్ లాంటివెన్నో ఇందులో క‌న‌ప‌డ‌తాయ్‌. విజ‌యానికి మూడే మెట్లు అని ఈ ప‌ద్యాల ద్వారా వెంక‌టేశం చెబుతున్నారు. ఒక‌టి శిక్ష‌ణ‌, రెండోది క్ర‌మ‌శిక్ష‌ణ‌, మూడోది ఆత్మ‌విశ్వాసం." అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌వులు డా. మంగ‌ళ మ‌క్క‌పాటి, దాస్యం సేనాధిప‌తి, అమ్మంగి వేణుగోపాల్‌, కోట్ల వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి, వ‌డ్డేప‌ల్లి కృష్ణ, చిల్ల‌ర భ‌వానీదేవి, బీవీఎన్ స్వామి, జె. చెన్న‌య్య‌, సిహెచ్‌. రాంబాబు, భార‌తీమూర్తి, వెలుగొండ వెంక‌టేశ్వ‌ర‌రావు, చివుకుల శ్రీ‌ల‌క్ష్మి, ర‌ఘు, రామ‌కృష్ణారావు, ర‌మాదేవి కుల‌క‌ర్ణి, డాక్ట‌ర్ బండారు సుజాత శేఖ‌ర్ త‌దిత‌రులు 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కంపై అభిప్రాయాలు తెలియ‌జేశారు.

క‌వ‌యిత్రి శ్రీ‌ల‌క్ష్మి అయినంపూడి స‌భాధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించగా, శ‌త‌క‌క‌ర్త బుర్రా వెంక‌టేశం మాట్లాడుతూ క‌రోనా త‌న‌ను కూడా ఇటీవ‌ల క‌ర‌చాల‌నం చేసి వెళ్లిందనీ, ఆ టైమ్‌లో తాను ఎక్కువ‌గా రాశాన‌ని అన్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో డీజీపీ గారికి ప‌ని ఒత్తిడి ఉన్నా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న తండ్రి బుర్రా నారాయ‌ణ స్మార‌కార్థం 2022 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే 22న‌ స‌ర‌ళ శ‌త‌కాల్లో ఉత్త‌మ‌మైన దానికి బుర్రా నారాయ‌ణ స్మార‌క‌ అవార్డు ఇస్తామ‌ని బుర్రా వెంక‌టేశం ప్ర‌క‌టించారు. ఆ శ‌త‌కం స‌మాజ హితం కోస‌మై ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

'తెలుగువ‌న్ డాట్ కామ్' అధినేత‌ కంఠంనేని ర‌విశంక‌ర్ ఈ కార్య‌క్ర‌మానికి త‌మ శుభాకాంక్ష‌లు అంద‌జేస్తూ, "ఇంత‌మంది క‌వులు, ర‌చ‌యిత‌లు, పండితుల్ని ఒక వేదిక మీద చూడ్డం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన బుర్రా వెంక‌టేశం గారి స్ఫూర్తితో మ‌రెన్నో కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నాం. అక్ష‌ర‌యాన్ ద్వారా ఈమ‌ధ్యే ఉగాది పుర‌స్కారాలు ఇవ్వ‌డం అనే ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టాం. నేను క‌విని కానీ, ర‌చ‌యిత‌ని కానీ కాను. ఒక భాషా ప్రేమికుడ్ని మాత్ర‌మే. ఉత్త‌ర భార‌త‌దేశంలో చ‌దువుకోవ‌డం మూలంగా 70, 80ల‌లో తెలుగు అంటే అక్క‌డ ఎంత అవ‌మాన‌క‌రంగా మాట్లాడేవారో చూసి, అది మ‌న‌సులో నాటుకుపోయి, తెలుగుకు ఏదైనా చెయ్యాల‌నే ఉద్దేశంతోనే మా 'తెలుగువ‌న్‌'ను ప్రారంభించాం. తెలుగువాళ్లంద‌రూ ఒక‌టో స్థానంలో ఉండాలి, తెలుగువాళ్లంద‌రూ ఒక‌టిగా ఉండాల‌నే ఉద్దేశంతో మా వెబ్‌సైట్‌కు, చాన‌ల్‌కు 'తెలుగువ‌న్' అని పెట్టాం. తెలుగువ‌న్ డాట్ కామ్‌లో ఉన్న 'గ్రంథాల‌యం' అనే డిజిట‌ల్ లైబ్ర‌రీని, 'తెలుగువ‌న్ రేడియో ఆన్ ఇంట‌ర్నెట్' (టోరి)ని ర‌చ‌యిత‌లు, క‌వులు ఉప‌యోగించుకోవాల‌ని కోరుతున్నాం. బుర్రా వెంక‌టేశం గారి నుంచి మ‌రెన్నో మంచి ర‌చ‌న‌లు రావాల‌ని ఆకాంక్షిస్తున్నాం. ఆరేళ్ల వ‌య‌సు వారు కూడా తెలుగు భాష రాయ‌డం, చ‌ద‌వ‌డం చేసేలా కృషి చేయాలి. అందుకు తెలుగువ‌న్ ఎప్పుడూ ముందుంటుంది." అని చెప్పారు.