Updated : Aug 16, 2023
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు తన విశ్వ విద్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తికి సమీపంలో ఉండే తన స్వగ్రామం మోదుగుల పాలెం వచ్చారు. అక్కడ గ్రామస్థులతో సరదాగా గడిపారు. మొక్కలను నాటారు. ఈ నేపథ్యంలో ఆయన కుల వివక్షపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘‘ఒకప్పుడు కూడా మన దగ్గర కుల వ్యవస్థ ఉండేది. అయినా అత్త, మామ, అక్క, బావ అంటూ పిలుచుకునేవారు.. సరదాగా కలిసి మెలిసి ఉండేవారు. నా చిన్నతనంలో నాతోటి వ్యక్తిని మరొకతను అంటరానివాడంటూ దూషిస్తే.. చెప్పుతో కొడతానని అన్నాను.అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కులం పేరుతో దూషిస్తున్నారు. అసలు ఈ కులాలనో ఎవరు కనిపెట్టారో తెలియటం లేదు. నాకు కులాలంటే అసహ్యం’’ అన్నారు మోహన్ బాబు. ఇదే సందర్భంలో తన ఎదుగులకు కారణమైన తల్లిదండ్రులు, ఆప్తులు, గ్రామస్థులను మరచిపోనని ఆయన పేర్కొన్నారు.
మోహన్ బాబు ఇప్పుడు సినిమాలను ఎక్కువగా చేయటం లేదు. చాలా సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు ఎక్కువగా తిరుపతిలోనే ఉంటున్నారు. అక్కడ మోహన్‌బాబు యూనివర్సిటీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నట వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు సినీ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. కుమార్తె లక్ష్మీ మంచుతో కలిసి తొలిసారి అగ్ని నక్షత్రం అనే సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా విడుదల త్వరలోనే ఉంటుంది.
