Updated : Aug 24, 2022
విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించిన 'లైగర్' మూవీ రేపు గురువారం (ఆగస్ట్ 25)న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌కు వచ్చిన క్రేజ్ చూసి, దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అమితాశ్చర్యానికి గురవుతోంది. హిందీలో కరణ్ జోహార్ నిర్మించడం వల్లనే లైగర్‌కు ఆకాశాన్నంటిన క్రేజ్ వచ్చిందని చాలామంది భావిస్తున్నారు. అయితే లైగర్‌కు బీభత్సమైన క్రేజ్ రావడానికి కరణ్ జోహార్ ఒక్కడే కారణం కాదు, విజయ్ దేవరకొండ ఇమేజ్ కూడా కారణమే. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఎక్కడకు వెళ్లినా రౌడీ హీరోకు ప్రజల నుంచి లభించిన ఆదరణ అసామాన్యం. అతను కూడా తన సినిమా కోసం దాదాపు దేశం మొత్తం చుట్టేశాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, కేరళ, ముంబై, ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించిన ప్రతిచోటా విజయ్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. అతని వ్యవహార శైలిని కొంతమంది తప్పుపడుతున్నా, జనం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు. అతని ప్రతి మాటా, ప్రతి చేష్టా యువతని వెర్రెత్తిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ దేశం మొత్తానికి యూత్ ఐకాన్‌గా కనిపిస్తున్నాడు. ఒక సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా ఓ యంగ్ స్టార్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్ రావడం ఇటీవల కాలంలో మనం చూడలేదు. హైదరాబాద్‌లో దాదాపు ప్రతి స్క్రీన్‌లోనూ గురువారం 'లైగర్'ను ప్రదర్శిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తెగుతున్న టికెట్లను చూస్తుంటే టాలీవుడ్ టాప్ స్టార్ రేంజ్‌లో ఓపెనింగ్స్ రావడం ఖాయం.
ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్', 'సర్కారువారి పాట' సినిమాలకు వచ్చిన రేంజ్‌లో 'లైగర్'కు ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యు.ఎస్.లోనూ క్రేజ్ ఇదే తరహాలో ఉంది. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే 3 వేలకు పైగా స్క్రీన్స్‌లో 'లైగర్' రిలీజవుతోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా నిలుస్తాడని విశ్లేషకులు అంటున్నారు. అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన 'లైగర్' మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, విష్ కీలక పాత్రలు పోషించారు.
