
ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తోన్న కె.వి. రమణాచారి ఎంతటి సహృదయులో, ఎంతటి పరోపకారో ఆయన గురించి ఎరిగిన వారు చెబుతుంటారు. పైగా ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, తాను చేయగలిగిన సాయం చేస్తుంటారు. ఇప్పుడు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ అనేక రంగాలకు చెందినవారు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కళాకారులకైతే పనులు లేక పస్తులు ఉంటున్నారు.
అలాంటి వారిలో హరికథా భాగవతార్లు (హరిదాసులు) కూడా ఉన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ నుంచే వాళ్లకు ఉపాధి కరువైంది. వారి ఇక్కట్లు తెలుసుకున్న కె.వి. రమణాచారి.. కేవలం తెలంగాణలోని వారినే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హరికథా భాగవతార్లను గుర్తించి, రెండు రోజుల క్రితం ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,500 జమ చేయించిన విషయం తెలిసింది. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మద్దాలి రఘురామ్ సహకారంతో 30 మంది హరిదాసుల బ్యాంకు ఖాతాల్లో ఆయన స్వయంగా ఆ డబ్బును వేయించారు. ఆపద కాలంలో సరిగ్గా అవసరమయిన సమయంలో ఆర్ధిక చేయూత అందించారంటూ హరిదాసులు కృతఙ్ఞతలు తెలిపారని, తాను కేవలం వారధి మాత్రమే అని, అంతా పెద్దలు డాక్టర్ కె.వి.రమణాచారి గారి దయా హృదయం అని మద్దాలి రఘురాం తెలిపారు.
ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా రమణాచారి ఇలా పలువురిని ఆదుకున్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కళాకారులకు కేవీఆర్ (కేవీ రమణాచారి) కిట్స్ పేరిట ప్రతి నెలా నిత్యావసర వస్తువులు అందిస్తూనే ఉన్నారు. అన్ని రంగాల కళాకారులకు నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు.






