Jyothi Lakshmi Movie Review
Updated : Jun 12, 2015
వేశ్య కథంటే... గ్లామర్, మాస్, బోల్డ్‌నెస్, కొన్ని భావోద్వేగాలు, కావల్సినన్ని బాధలు, కన్నీళ్లు... ఇంతే! ఏ సినిమా తీసుకొన్నా ఇవే కనిపిస్తాయి. అయితే ఎప్పుడైతే పూరి జగన్నాథ్ అనే దర్శకుడు ఈ కథని టేకప్ చేశాడో... అప్పుడు ఇంకేదో కొత్త ఎలిమెంట్ మిక్స్ అవుతుందని జనం ఊహించారు. జ్యోతిలక్ష్మి అనే పేరు, పోస్టరుపై ఛార్మి హొయలు.. ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మూస వేశ్య కథలకు విరుద్ధంగా పూరి కొత్తగా ఏదో చెబుతాడన్న నమ్మకం కలిగింది. అయితే పూరి.. ఏం చేశాడు. రొటీన్ కథకు పూరి మార్క్ ట్రీట్‌మెంట్ ఎంత వరకూ యాడ్ అయ్యింది. దానికి ఛార్మి ఎంత వరకూ సాయం చేసింది. జ్యోతిలక్ష్మి మూస కథ, లేదంటే.. మసాలా కథ. చూద్దాం.. రండి.
జ్యోతిలక్ష్మి (ఛార్మి) ఓ వేశ్య. కాకపోతే చాలా కాస్ట్లీ. సత్య (సత్య) జ్యోతిలక్ష్మిని ప్రేమిస్తాడు. ప్రతిరోజూ రాత్రి.. జ్యోతిలక్ష్మిని బుక్ చేసుకొంటాడు. అయితే శారీరక సుఖం కోసం కాదు. జ్యోతిలక్ష్మిని కళ్లారా చూడ్డానికి. నిన్ను ప్రేమిస్తున్నా.. మనం పెళ్లి చేసుకొందాం అంటుంటాడు. అయితే జ్యోతిలక్ష్మి మాత్రం సత్యని లైట్ తీసుకొంటుంటుంది. ఇదంతా నామీద మోజే అంటుంది. కానీ సత్య మాత్రం సిన్సియర్ గానే జ్యోతిలతక్ష్మిని ప్రేమిస్తాడు. జ్యోతిలక్ష్మికోసం వ్యభిచార రాకెట్ ముఠాని ఎదుర్కొంటాడు. చివరికి పెళ్లి చేసుకొంటాడు. కానీ జ్యోతిలక్ష్మి తాళికి విలువ ఇవ్వదు. మరోవైపు జ్యోతిలక్ష్మి ని మళ్లీ రొంపిలోకి దింపడానికి వ్యభిచార రాకెట్ తీవ్రంగా కృషిచేస్తుంటుంది. ఓ దశలో ఆ ముఠా చేతిలో సత్య చావుదెబ్బలు తింటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి ఏం చేసింది..? సత్య ప్రేమని ఎలా అర్థం చేసుకొంది? ఆడదాని శక్తి ఎలా చూపించింది అనేదే కథ.
ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన మిసెస్ పరాంకుశం నవల ఈ చిత్రానికి ఆధారం. అయితే ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు పూరి కథని తనదైన స్టైల్ లో రాసుకొన్నాడు. వేశ్యని ఓ అబ్బాయి సిన్సియర్‌గా ప్రేమించడం. పెళ్లి చేసుకోవడం అన్నది పాత పాయింటే. ఒక విధంగా చెప్పాలంటే `నాయకుడు` సినిమా నాటి కథ. అదే ఆడది.. ఈ సమాజంపై, వ్యభిచార ముఠాపై తిరగబడడం, తాను అనుకొన్న లక్ష్యం సాధించిడం అనేది పక్కా పూరి ట్రీట్‌మెంట్. వేశ్య కథంటే ఒకటి తీస్తే గ్లామర్‌గా తీయాలి, లేదంటే ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా కళాత్మకంగా చెక్కాలి. పూరి మొదటి రకాన్నే ఎంచుకొన్నాడు. ఎందుకంటే తనకు వచ్చింది అదే కాబట్టి. ఫస్టాఫ్ మొత్తం అలానే గ్లామర్‌తోనే లాగించేశాడు కూడా. అయితే సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా తడబడ్డాడు. క్లాసులు పీకడాల గోల ఎక్కువైంది. ఛార్మిలో హీరోయిజం బయటకు తెచ్చే ఉద్దేశంతో కథని ఎలా పడితే అలా నడిపాడు. చివర్లో స్పై కామెరాలంటూ.. టెక్నాలజీ వాడుకొని బడాబాబుల్ని బయటకు లాగాడు. అయితే ఆ ముగింపు పక్కాసినిమాటిక్‌గా సాగింది. అసలు పూరి ఈ సినిమా ఎందుకోసం తీశాడు, ఎవరి తరుపున వకాల్తా పుచ్చుకోవడానికి తీశాడు అనేది అర్థం కాలేదు. ఓ లవ్ స్టోరీగా మొదలై, ఎమోషనల్ టచ్ ఇచ్చి, చివరికి ఉద్యమం అంటూ ఉధృతం చేసి... ఓ సోషల్ మెసేజ్‌తో ఈ సినిమాని ముగిద్దామనుకొన్నాడు పూరి. తన ప్రయత్నం మంచిదే. కానీ.. అన్నీ సగం సగం టచ్ చేశాడు. ప్రేమలోని ప్యూరిటీ ఓ వైపు నుంచే చూపించాడు. అదీ సత్య కోణం నుంచే. ఓ వేశ్య తిరిగి ప్రేమిస్తే ఎలా ఉంటుందో టచ్ చేస్తే... ఈ సినిమా మరో విధంగా ఉండేదేమో.
వేశ్య కథలంటే మాస్ కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడరు. దానికి తగ్గట్టే ఇంట్రవెల్ బ్యాంగ్ రోత పుట్టించాడు పూరి. కండోమ్ వాడాలని భార్య, వద్దు అని మొగుడు కొట్టుకోవడం ఏమిటో? ఆ గొడవకు జ్యోతిలక్ష్మి తాళి తెంపేయడం ఏమిటో? అక్కడ ఇంట్రవెల్ బ్యాంగ్ వేయడం ఏమిటో..?? ఈ సీన్‌ని మరోలా కూడా ట్రీట్ చేయొచ్చు. కానీ `కండోమ్` అంటే మాస్.. పడిపోతారనుకొన్నాడు పూరి. లేదంటే జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ రేంజ్‌ని మరీ అలా చూపిస్తే తప్ప.. జనానికి నచ్చదనుకొన్నాడేమో. ఫ్యామిలీ ఆడియన్స్ భరించలేని క్యారెక్టరైజేషన్ ఛార్మిది. సెకండాఫ్‌లో లెక్చర్లు, ఆ టార్చర్లు బీసీ ఆడియన్స్‌కి కూడా నచ్చదు. సో.. రెండిటీ చెడ్డ రేవడిలా ఈ సినిమాని వదిలేశాడు పూరి. క్లైమాక్స్‌కీ ఎవ్వరూ కనెక్ట్ కాలేకపోయాడు. దాంతో పూరి ఈ సినిమాని సగం వండిన కిచిడీ చేశాడు.
ఛార్మి బాగానే నటించింది. వేశ్యగా ఆమె బాడీ లాంగ్వేజ్ తప్పకుండా విస్మయ పరుస్తుంది. ఎమోషన్ సీన్స్‌లో కంటే, గ్లామర్ సీన్స్‌లోనే బాగా చేసింది. అఫ్ కోర్స్... తన స్కూల్ అదే కాబట్టి ఈజీగా పండించగలిగింది. అయితే ఆహో. ఓహో అనేంత గొప్ప నటన అయితే కాదు. సత్య పాత్ర ఆకట్టుకొంటుంది. తను డీసెంట్‌గా నటించాడు. హీరో ప్రెండ్ క్యారెక్టర్ కూడా ఓకే. మిగిలిన వాళ్లలో చాలామందివి తెలిసీ తెలియని ఫేసులే. బ్రహ్మానందం పాత్ర శుద్ధ వేస్ట్. ఆయన నవ్వించలేకపోయాడు. సంపూ చివర్లో వచ్చాడు. ఆ పాత్రనీ సరిగా మలచుకోలేకపోయాడు పూరి. క్లైమాక్స్ నానాగందరగోళంగా తయారైంది. అందులో కనిపించిన పాత్రలకూ పెద్దగా వాల్యూ లేదు. సునీల్ కాశ్యప్ పాటల్లో టైటిల్ సాంగ్ మాంచి ఊపు తెచ్చింది. ఆడాళ్లం.. ఆడాళ్లం పాట కూడా ఓకే. విందా కెమెరాపనితనం బాగుంది. పూరి డైలాగుల్లో డెప్త్ అంతగా కనిపించలేదు. దేవుళ్లకూ మామీద చిన్నచూపే. అందుకే వాళ్లకు ఆడపిల్లలు లేరు.. అనే డైలాగ్ ఒక్కటే బాగున్నా.. ఉన్నారా, లేరా? అనే డిబేట్ మొదలెట్టేలా చేసింది.
మిసెస్ పరాంకుశం నవలను ఏదేదో చేసేద్దామనుకొన్నాడు పూరి. కాకపోతే... ఓ చిన్న సర్కిల్ గీసుకొని, అందులోనే చక్కర్లు కొట్టి.. ఏమీ చేయలేకపోయాడు. పూరి తీసిన చెత్త సినిమాల్లో ఇది చేరకపోవచ్చుగానీ, బెటర్ సినిమాల్లో మాత్రం జ్యోతిలక్ష్మి ఉండదు.
