English | Telugu
ప్రేక్షకులకు నిజమైన రామాయణాన్ని అందిస్తా: ‘రామాయణ’ డైరెక్టర్!
Updated : Oct 3, 2025
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై అనేక మార్లు, అనేక రకాలుగా రామాయణ గాధను ఆవిష్కరించారు. అలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా రామాయణం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. తాజాగా అలాంటి ప్రయత్నం చేస్తున్న నితిశ్ తివారి.. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా రామాయణాన్ని చూపించబోతున్నారట. రాముడుగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులోని పాత్రల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
దీని గురించి దర్శకుడు నితిశ్ తివారిని ప్రశ్నించగా.. ‘రామాయణంలోని ప్రతి పాత్ర నాకు ఇష్టమైనదే. ఎలా చూసినా ఇది ఒక దృశ్యకావ్యంగా కనిపిస్తుంది. రామాయణంపై నేను కోర్సులు కూడా చేశాను. ఈ ఇతిహాసాన్ని ఎంతో మంది రచించారు. వాటిని పరిగణనలోకి తీసుకొని నిజమైన రామాయణాన్ని మీకు అందిస్తున్నాను’ అని చెప్పారు. ఈ సినిమా కథను ఎక్కువ భాగం వాల్మీకి రామాయణం నుంచే తీసుకున్నారు. ఇందులోని మరి కొన్ని పాత్రల కోసం వేరే రామాయణ కథలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.