Home » Articles » మనసంతా నువ్వే

వాలెంటైన్స్ డే అనగానే... ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. అలా ప్రేమ గురించి మాట్లాడుకునే ప్రతీసారీ నాకో కథ గుర్తుకొస్తుంది. కథలాసాగే నిజంగా జరిగిన ఓ ప్రేమ ప్రయాణం అది. ఓ కథలా నాలుగు మాటల్లో చెప్పాలంటే...


 

అనగనగా సిరి అనే ఓ అమ్మాయి. చక్కగా చదువుకుంది,మంచి ఉద్యోగం. అమ్మ నాన్నలకి గారాల పట్టి. చాలా మంచి అమ్మాయి.సంగీతం నేర్చుకుంటూ, బొమ్మలు వేస్తూ క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. సిరిని ఎంతో ఇష్టపడే రాహుల్ అనే అబ్బాయి ఎప్పటి నుంచో పెళ్ళిచేసుకోమని అడుగుతుంటాడు. కానీ కుదరదంటే కుదరదని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అయిన రాహుల్ ఊరుకోకుండా.. పెద్దవాళ్ళతో మాట్లాడించి చివరికి ఎలాగయితేనేమి సిరితో కూడా 'yes' అనిపించుకుంటాడు. రెండు కుటుంబాలు వీళ్ళిద్దరి నిశితార్ధాన్ని పెద్ద వేడుకలా చేస్తారు. రాహుల్ కూడా మంచి చదువు, ఉద్యోగం, ఆస్థి అన్నీ ఉన్న కుర్రాడు. ఇంకో రెండు నెలల్లో పెళ్ళి ముహూర్తం ఉందనగా రాహుల్ ని ఆఫీసు వాళ్ళు ఎదో ముఖ్యమైన ప్రాజెక్ట్ పని మీద ఫారిన్ వెళ్ళమంటారు. ఒకటిన్నర సంవత్సరం పాటు అక్కడే ఉండాలి. ఆ ప్రాజెక్ట్ చేస్తే ఇతనికి పేరు, ఉద్యోగంలో హోదా వస్తాయి. ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతాడు. అందరూ వెళ్లొద్దు అని అంటే, సిరి మాత్రం తప్పకుండా వెళ్ళు.. వెళ్లి వచ్చాకే పెళ్ళి చేసుకుందాం అని చెబుతుంది. చివరికి రాహుల్ప్రాజెక్ట్ పనిమీద ఫారిన్ వెళతాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫోన్ లు ,ఈ-మెయిల్స్ నడుస్తాయి. ఈ దూరం కూడా బావుంది అనుకుంటారు ఇద్దరు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ బంధానికి ఒక బ్రేక్ ఏర్పడుతుంది.



 

ఇంతకీ ఆ బ్రేక్ ఏమిటంటే... సిరి ఆఫీస్ నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అమ్మ నాన్న ఉంటారు. ఏమైంది నాకు అని అడుగుతుంది. కానీ ఎలాంటి శబ్దము రాదు. ఆశ్చర్యంగా అమ్మ నాన్నల వైపు చూస్తుంది. వాళ్ళు ఏదో చెబుతారు.. కానీ సిరికి వినిపించదు. అప్పుడు తనకు అర్ధమవుతుంది. ఇక తనకి వినిపించదని, మాట్లాడలేదని. అంతేకాకుండా ఆ యాక్సిడెంట్ లో ఒక కాలు కూడా పోయింది. తన పరిస్థితిని చూసి బాధపడుతున్న అమ్మ నాన్నలకి ధైర్యం చెబుతుంది. కానీ సిరి కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది.ఆ తరువాత తేరుకొని అమ్మ నాన్నలతో ఒక్కటే చెబుతుంది. ఎట్టి పరిస్థితిలోను ఈ విషయాలేమి ఫారిన్ లో ఉన్న రాహుల్ కి తెలియకూడదు అని. దానికి వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఒప్పుకుంటారు.


 
 

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఈ ఊరు నుంచి దూరంగా వెళ్లిపోదాం అని అడుగుతుంది సిరి. సరేనంటారు వాళ్ళ అమ్మ నాన్నలు. ఈ మధ్యకాలంలో రాహుల్ ఫోన్ లు చేసిన మెయిల్స్ ఇచ్చిన జవాబు ఇవ్వదు సిరి. తన ఫ్రెండ్స్ కి కూడా తాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోతారు సిరి కుటుంబం. ఇక అక్కడ కూడా తనకి తానుగా ధైర్యం చెప్పుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంది సిరి. కానీ.. ఆ డిప్రేషన్ లోంచి బయటకు రాలేక, మానసిక వ్యధతో ఒకదాని తరువాత ఒకటిగా అనారోగ్యం తనని బాధపెడుతుంటుంది. సిరి ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి రాహుల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒకరోజు సిరి ఫ్రెండ్ వచ్చి.."నీ గురించి రాహుల్ కి తెలిసింది. కానీ తిరిగి మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోయాడు" అని చెబుతుంది. అది విని సిరి ఇంకా బాధపడుతుంది. "ఇంతేనా ప్రేమ అంటే" అని అనుకుంటుంది.

ఒకరోజు సిరి నిద్రలేచేసరికి ఎదురుగా తనకి ఇష్టమైన పువ్వుల బోకే ఉంటుంది. ఆ పక్కనే రాహుల్ నిలబడి ఉంటాడు. ఆశ్చర్యంగా చూసిన తనకి ఈరోజు మనం మన ఇంటికి వెల్లబోతున్నాం అని పేపర్ మీద రాసి చూపిస్తాడు. సిరిని తీసుకొని వెళ్తాడు. ఆ ఇల్లు సిరి విల్ చైర్ అన్ని చోట్లకి వెళ్ళగలిగేల అన్నిఏర్పాట్లుతో తనకి ఇష్టమైన కలర్స్ తో చక్కగా కట్టి ఉంటుంది.



 

అలాగే వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉంటారు. పెళ్లి మండపం, సిద్దంగా ఉంటుంది. సిరిని రెండు చేతులతో ఎత్తుకెళ్ళి మండపంలో కూర్చొబెడతాడు రాహుల్. సిరి ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే పెళ్లి అయిపోతుంది. జరిగిందంతా కల లేక నిజమా? అని అనుకుంటుంది. ఆ తర్వాత సిరికి ఓ లెటర్ ఇస్తాడు రాహుల్. "నేను నిన్ను కలిసి, ఒప్పించి, నమ్మకం కలిగించటం నువ్వున్నా పరిస్థితిలో కష్టమని తెలుసు. అందుకే నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నవో ఎప్పటికప్పుడు మీ అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. ఇలా నిన్ను మా ఇంట్లోకి తీసుకువచ్చి నీ బాధ పోయేలా చేయాలని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను" అని రాసి ఉంటుంది. సిరి మనసులోని శూన్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. జీవితం అందంగా,ఆనందంగా కనిపిస్తుంది.

 

ప్రేమంటే నీకు నేనున్నాను అంటూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా... ఎప్పుడైనా... నీకోసం నేను అనే భరోసానివ్వాలి. భాధ్యతగా నిలవాలి. బంధంగా మలుచుకున్న ప్రేమని గుండెల్లో పొదువుకొని కాపాడుకోవాలి.