Home » Articles » మా అమ్మ బంగారు తల్లి!

మా అమ్మ బంగారు తల్లి!

 

ఎవరి మాట వింటే మనసులో ఆనందం తాండవిస్తుందో.. ఎవరిని తలచుకుంటే గుండెల్లో ధైర్యం పొంగుకొస్తుందో.. ఎవరి చేతి స్పర్శ అనంతమైన భరోసా ఇస్తుందో ఆ వ్యక్తి, శక్తి అమ్మ. అమ్మ మాత్రమే. అందుకే ‘అమ్మంటే?’ అని ప్రశ్నిస్తే మనసు లోపలి చెమ్మ ఆనందబాష్పాలుగా బయటపడుతుంది. మాటలు మూగబోయి పసిపిల్లలా బేలగా నిల్చుంటారు ఎంతటివారైనా. అమ్మకి అర్థం.. అమ్మకి పరిచయం.. ఆమె ప్రేమ కొలత సాధ్యం కాని విషయాలు. ఒక్కసారిగా అమ్మని వాటేసుకుని, కొంగుచాటున ముఖం దాచుకుని ‘‘అమ్మ నా సొంతం’’ అనుకోవటంలోని ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ సొంతం చేసుకోవాలి.. శాశ్వతం చేసుకోవాలి అనిపిస్తుంది. అమ్మని గట్టిగా వాటేసుకుని ‘‘నువ్వంటే నాకిష్టం’’ అని చెప్పాలనిపిస్తుంది. పసిపాపాయిల్లా మారిపోయి మళ్ళీ మరోసారి అమ్మ చేతి గోరుముద్దలు తినాలనిపిస్తుంది. పోలిక కానీ, ప్రత్యామ్నాయం కానీ లేని ‘అమ్మ ప్రేమ’కి ఏమిచ్చి బదులు తీర్చుకోగలం? మరోసారి మన బాల్యాన్ని ఆమెకి బహుమతిగా ఇవ్వడం తప్ప. అమ్మలందరికీ జేజేలు చెప్పే మాతృదినోత్సవం రోజున ఇంద్రధనుస్సు లాంటి అమ్మ ప్రేమలోని కొన్ని రంగులు మీకోసం....



మా అమ్మ ప్రోత్సాహం చాలా గొప్పది: కాజల్

 


మా అమ్మ నాకు అమ్మ మాత్రమే కాదు.. నన్ను నడిపించే నా స్నేహితురాలు కూడా. నన్ను ఎంత గారాబంగా చూసుకుంటుందో, నేనేదైనా పొరపాటు చేస్తే దానికి తగిన పనిష్మెంట్ మాటల రూపంలోనే ఇచ్చేస్తుంది. అదికూడా ఆ పొరపాటు మరోసారి చేయనంత స్ట్రాంగ్‌గా ఇస్తుంది. బాగా నటిస్తే ప్రోత్సహిస్తుంది. బాగా నటించలేదని ఆమెకి అనిపించినా, సునిశితంగా నా పొరపాట్లు చెబుతూనే నువ్వు బాగా నటించగలవని ప్రోత్సహిస్తుంది.



అమ్మ ప్రోత్సాహంతోనే ఇంత దాన్నయ్యా: హన్సిక

 


మా అమ్మ గురించి నన్ను మాట్లాడమంటే ఎన్ని గంటలైనా అలా మాట్లాడుతూనే వుంటా. మా అమ్మ ఎప్పుడూ నాకు నీడలా వుంటుంది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఆమె నాతో వుంటే నేను చాలా సెక్యూర్డ్ గా వున్న ఫీల్ కలుగుతూ వుంటుంది. చిన్నప్పటి నుంచీ నన్ను మా అమ్మ ‘లేదు’ అనే మాట చెప్పకుండా పెంచింది. నేను ఏది అడిగినా వెంటనే కొని తెచ్చేది. నేనీరోజు హీరోయిన్‌గా రాణిస్తున్నానంటే దానికి కారణం అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే. అమ్మ మంచి ప్లానర్. నా కెరీర్‌ని పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. నేను ఇంత అందంగా కనిపిస్తూ వుండటానికి కూడా మా అమ్మే కారణం.. ఎందుకంటే మా అమ్మ మంచి బ్యూటీషియన్.



మా అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్: త్రిష

 


నాకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారు. అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే నేను మా అమ్మ అని చెబుతాను. నా సంతోషాన్ని, బాధని పంచుకునే ఏకైక వ్యక్తి మా అమ్మ. నేను ఎప్పుడైనా డిప్రెస్ అయినట్టు మా అమ్మకి కనిపిస్తే, తన మాటలతో  రెండంటే రెండే నిమిషాల్లో నా మూడ్ మార్చేస్తుంది. అంత గొప్ప శక్తి మా అమ్మ మాటల్లో వుంది. నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. దానికి కారణం అమ్మే. నేను చదువుకునే రోజుల నుంచీ నన్ను మోడ్రన్‌గా, అందరితో కలిసిపోయేలా పెంచింది. ఐ లవ్ మై మామ్.



మా అమ్మ నాకంటే అందగత్తె: స్నేహ

 


నాకు అన్నీ మా అమ్మే. నేను మా అమ్మ మీద పూర్తిగా డిపెండెంట్‌‌ని ఏదైనా పని నా సొంతగా చేసుకునేది అయినా దాన్ని అమ్మ చేస్తేనే నాకు సంతోషంగా వుంటుంది. అమ్మ నాకోసం ఏమి చేసినా నాకు అందులో ఒక్క లోపం కూడా కనిపించదు. నాకు ఏం కావాలో వాటిని నాకు అందించడంలో అమ్మ ఎంతో ఆలోచిస్తుంది. నా మనసులో అనుకుంటున్నవి కూడా భలే కనిపెట్టేస్తుంది. అందరూ నేను చాలా అందంగా వున్నానని అంటూ వుంటారు.. కానీ మా అమ్మ నాకంటే  అందగత్తె అని నా అభిప్రాయం.



నన్ను ముందుకు నడిపింది అమ్మే: ఇలియానా

 


వ్యక్తిగా, సినిమా హీరోయిన్‌గా నన్ను ముందుకు నడిపింది మా అమ్మే. ఈరోజు ఈస్థాయిలో వున్నానంటే ఇదంతా మా అమ్మ చలవే. సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో చాలా బోర్‌గా ఫీలయ్యేదాన్ని. మొదటి సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టేద్దామనుకున్నా. ఎందుకంటే సక్సెస్ రాక. కానీ మా అమ్మ పట్టుబట్టి నన్ను సినిమాల్లో కొనసాగేలా చేసింది. ఆ తర్వాత నాకు మంచి విజయాలు వచ్చేవి. ఆరోజు మా అమ్మ నన్ను ప్రోత్సహించకుండా వుంటే ఒక సినిమాతోనే నా కెరీర్ ముగిసేది. నన్ను ముందుకు నడిపే అమ్మ నా దృష్టిలో దేవత.