Home » Articles » అమ్మకోసం ఏం చేయొచ్చంటే...

అమ్మకోసం ఏం చేయొచ్చంటే...

 

Mothers Day Special Ideas, Surprising Ideal For Mothers Day Special, How To Surprising Your Mother, Mothers Day Special Wishes, Special Ideas For Mothers Day

అమ్మని ఎలా సర్‌ప్రైజ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా? ఎలాంటి బహుమతులిస్తే అమ్మ ఆనందపడుతుందో తెలీటం లేదా? అందుకే ఇదిగో మీకోసం...


* అమ్మమ్మ ఫొటోని మంచి ఫొటో ఫ్రేమ్‌లో పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేసి విషెస్‌తోపాటు అమ్మకి అందించి చూడండి.


* అమ్మ పెళ్ళినాటి ఫొటో, అలానే తన చిన్నప్పటి ఫొటో, తన తోబుట్టువులతో వున్న ఫొటో.. ఇలా ఏదైనా ఒక అరుదైన ఫొటో సంపాదించి ఆ ఫొటోని మంచి ఫ్రేమ్‌లో పెట్టి అమ్మకి అందించి ఆవిడ కళ్ళలో వెలుగు చూడండి.


* అంతేకాదు. వీలైతే అలాంటి అరుదైన ఫొటోలన్నింటినీ ఒక ఆల్బమ్‌గా చేసి ఇవ్వండి. అరుదైన ఫొటోలన్నీ ఒక్కచోట చేరిస్తే తీపి జ్ఞాపకాలు అమ్మని మురిసేలా చేస్తాయి.

 


* అమ్మ చిన్నతనంలో మిమ్మల్ని అక్కున చేర్చుకుని తీయించుకున్న ఫొటో ఏదో ఒకటి వుండేవుంటుంది. ఆ ఫొటోని ఎన్‌లార్జ్ చేయించి, లామినేట్ చేసి అమ్మ నిద్ర లేచేసరికి హాల్‌లో తగిలించి వుంచండి. అమ్మ కళ్ళమూసి తీసుకువెళ్ళి ఫొటోముందు నిలబెట్టి కళ్ళు తెరిస్తే ఒక్కసారిగా మమతానురాగాల స్మృతులు అమ్మని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.


* అమ్మకి ఇష్టమైన స్వీట్స్, వంటలు స్వయంగా వండి వడ్డించండి.
* అమ్మ గురించి మన సినిమాల్లో చాలానే పాటలున్నాయి. కొన్ని మంచి పాటలని అమ్మ నిద్ర లేచేసరికి ప్లే చేయండి. మీరు మాటల్లో చెప్పలేనిది పాటగా అమ్మకి వినిపించవచ్చు.


* కొనిచ్చే బహుమతుల కన్నా అమ్మకోసం మీరు స్వయంగా తయారుచేసే బహుమతి విలువ ఎక్కువ కాబట్టి కాస్త కష్టపడి ఫొటో ఫ్రేమ్, ఆల్బమ్, గ్రీటింగ్ కార్డ్ వంటివీ మీరే తయారుచేసి అమ్మకి అందించండి.


* ‘ఐ లవ్ యూ మామ్’ అని చిన్న చిన్న కలర్‌ఫుల్ పేపర్స్ మీద రాసి అమ్మ చూడదగిన అన్నిచోట్ల అతికించండి. ఉదాహరణకి ఆఫీసులో పెన్నుకోసం బ్యాగ్‌లో చెయ్యి పెట్టగానే మీ కార్డ్ కనిపిస్తే అమ్మ ఎంత ఆనందపడుతుందో ఊహించండి.


* మీకు వెహికల్ వుందా? ఇంకేం? అమ్మని ఎక్కించుకుని ఓ మంచి ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళండి. ఐస్ క్రీమ్‌తోపాటు ఓ మంచి గ్రీటింగ్‌ని అందించండి. ఐస్ క్రీమ్ కన్నా త్వరగా కరిగిపోయే అమ్మ మనసుకు ఈ చిన్న చిన్న పనులు హాయినిస్తాయి.


* ఇక ఆఖరిగా ఆరోజంతా అమ్మతో కలసి వుండేలా చూసుకోండి. ఎప్పుడు ఇంటిపని, బయటి పనులతో అలసిపోయే అమ్మకి రిలాక్సేషన్ కలిగించేలా ఆరోజుని ప్లాన్ చేయండి. కబుర్లు చెప్పండి. తన చిన్ననాటి కబుర్లు చెప్పమనండి. వాళ్ళమ్మ గురించి అడగండి. ఇవన్నీ అమ్మని ఆనందపరుస్తాయి.


ఇవేవీ మనం చేయకపోయినా ప్రేమని పంచే అమ్మకి ఎన్ని విధాలుగా ఆనందాన్ని అందివ్వగలమో ఆలోచిస్తే మీకే బోల్డన్ని కొత్త ఆలోచనలు వస్తాయి.


అమ్మని అభినందించడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు కదా! కాబట్టి మదర్స్ డే రోజున అమ్మ కోసం ఏం చెయ్యచ్చో ఆలోచించండి.

 

-ఇరగవరపు రమ