Home » Articles » ఓ అమ్మా.. గిల్టీ ఫీలింగ్ నీకెందుకమ్మా?


ఓ అమ్మా.. గిల్టీ ఫీలింగ్ నీకెందుకమ్మా?

 

 

 

అమ్మ పాత్ర పరిధి విస్తృతం అయిపోయింది. ఒకప్పుడు ఇంటిపని చక్కబెట్టి, పిల్లలకి కావల్సినవి వండిపెడుతూ వాళ్ళకి దగ్గరగా మసలుకోగలిగిన ‘అమ్మ’ పాత్ర కాలంతోపాటు మారిపోయింది. ఇల్లు, పిల్లల బాధ్యతలతోపాటు కుటుంబ ఆర్థిక భారాన్ని కూడా తన భుజాలపై వేసుకున్న నేటి అమ్మ ఎన్నోవిధాల మానసిక వత్తిడులకు గురవుతోంది. అందులో ముఖ్యమైనది ‘‘పిల్లలపట్ల తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానేమో’’

ననే గిల్టీఫీలింగ్. ఉద్యోగినులలో వుండే ఈ గిల్టీ ఫీలింగ్‌కి కారణం ఎక్కువ సమయంలో పిల్లలతో గడపలేకపోవడం, అవసరమైన సమయాలలో పిల్లలకి అందుబాటులో వుండలేకపోవడం. ః

పిల్లల ప్రవర్తన అనుచితంగా వున్నా, మార్కులు తక్కువ వచ్చినా, వారి ఆరోగ్యం సరిగా లేకపోయినా అన్నిటికీ తనదే బాధ్యత అని తనని తాను నిందించుకునే ‘తల్లులు’ చాలామందే వున్నారు.


వాస్తవ దృక్పథం వుంటే...

ఇలాంటి గిల్టీ ఫీలింగ్ తల్లులను తీవ్ర వత్తిడికి గురిచేసి, మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. అందుకే మానసికవేత్తలు గట్టిగా ఒక విషయం చెబుతున్నారు. ‘‘వాస్తవ దృష్టితో పరిస్థితులను చూడటం, ఆ పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మలచుకోవటం తప్పనిసరి’’ అని. ఉద్యోగం చేయడం తప్పనిసరి అయినప్పుడు, ఇంట్లో తన పాత్ర పరిధి తగ్గక తప్పదు. అందుకు తను మానసికంగా సిద్ధం కావాలి. ‘నేను ఇంతవరకు నా బాధ్యతలని నిర్వహించగలను. ఇక మిగిలినవి నావల్ల కానివి’ అని  నిర్ణయించుకోగలిగితే గిల్టీఫీలింగ్ రాదు. అలాకాక అన్ని బాధ్యతలు నిర్వహించాలి అని అనుకుంటే ఏవీ సరిగ్గా నిర్వహించలేక బాధపడాల్సివస్తుంది.


పిల్లలతో మాట్లాడండి

పిల్లలతో మానసికంగా దగ్గరగా వుండటానికి ప్రయత్నించండి. రోజుకి ఒక గంటే పిల్లలతో గడిపే సమయం దొరికినా, ఆ గంటా వారితో కబుర్లు చెబుతూ, వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుంటూ మెల్లగా మీ ఆఫీస్ వర్క్, అక్కడి టెన్షన్లు, పరిస్థితులు, బస్సులతో మీరు పడే అవస్థలు, ఆలస్యమైతే మీ పిల్లల గురించి మీరు పడే తపన... వంటి విషయాలు బాధలని ఏకరువు పెడుతున్నట్టు కాక చాలా మామూలుగా వారికి చేరవేయండి. మీ పరిమితులు వాళ్ళకి అర్థమవుతాయి.

అవసరమైన సమయాలలో ఒకవేళ మీరు వారికి అందుబాటులో లేకపోయినా మీ పరిస్థితిని వారు అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలకి  మీ పరిస్థితి పట్ల అవగాహన వస్తే మీ గిల్టీ ఫిలింగ్ చాలావరకు పోతుంది. కాబట్టి వీలైనంత పారదర్శకంగా మీ బంధం వుండేలా చూసుకోండి.


పనులు పంచండి

ఉద్యోగిని అయిన తల్లిని ఒత్తిడికి గురిచేసే మరో విషయం.. పిల్లలకి అన్నీ తనే అమర్చాలి అనుకోవటం. నిజానికి అది ప్రాక్టికల్‌గా కుదరనిది. పిల్లలకి వారి పనులు వారు చేసుకునేలా అలవాటు చేయాలి. స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, వాటర్ బాటిల్‌లో నీళ్ళు నింపుకోవడం వంటివి మొదలుకుని వారి గది, వారి రైటింగ్ టేబుల్ అన్నీ శుభ్రంగా పెట్టుకోవడం వరకు  వారు బాధ్యతగా వుండేలా చేస్తే వర్కింగ్ మదర్‌పై పనిభారం తగ్గుతుంది. మీరు చేసే ఈ అలవాటు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటానికి కూడా దోహదం చేస్తుంది.

సెలవు రోజును ప్లాన్ చేయండి

సాధారణంగా సెలవురోజులు పెండింగ్ పనులతో గడిపేస్తారు అమ్మలు. పనులెన్ని వున్నా సెలవురోజులలో కొంత సమయం పిల్లలతో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే, పిల్లలకి, మీకు మధ్య అనుబంధం బలపడుతుంది. రొటీన్ జీవన విధానం మీకేకాదు పిల్లలకీ బోర్‌గా వుంటుంది. సాధ్యమైనంత క్వాలిటీ టైమ్ పిల్లలతో గడపగలిగితే మీలో గిల్టీ ఫీలింగ్ ఏ కోశానా మిగలదు.

పిల్లలకు అందుబాటులో వుండండి


ఇంట్లో వుండే ‘అమ్మలా’ అన్నివేళలా మీరు మీ పిల్లలకు అందుబాటులో వుండలేకపోవచ్చు. కానీ, టెక్నాలజీ పెరిగిపోయిన ఈ కాలంలో అది అసాధ్యం కాదు. పిల్లలకి ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని వెంటనే సంప్రదించమని నొక్కి చెప్పండి. మీకు ఫోన్ చేయమనండి. మీ సెల్ ఫోన్ నంబర్, మీ ఆఫీసు ఫోన్ నంబర్ పిల్లలకి అందుబాటులో వుంచండి.

అతి ప్రేమ వద్దు

ఉద్యోగిని అయిన తల్లులు పిల్లలకు దగ్గరగా వుండలేకపోతున్నాం అన్న గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి వారుఅడిగిందల్లా కొనిస్తూ వుంటారు. డబ్బుతో చూపించే మీ ప్రేమ వారిని పాడుచేస్తుందే కాని మీ ప్రేమ లోటుని భర్తీ చేయదు. కాబట్టి పిల్లలకి అవసరమైనదిగా భావించినవే కొనిస్తే వారికీ, మీకూ మంచిది.

బహుముఖమైపోయిన పాత్రతో ఇంటా, బయటా హైరానాపడిపోయే నేటి తరం ‘అమ్మ’లు తమ పాత్రని సక్రమంగానే కాదు.. సమర్థవంతంగా కూడా  నిర్వహించగలుగుతున్నారు. అయితే ఈ విషయం తాము అర్థం చేసుకోలేక ఇంకా మేమేదో చేయలేకపోతున్నామనే బాధ వారిని ఆవేదనికి గురిచేస్తుంది. ఇది ఆమెకూ, తన పిల్లలకూ మంచిది కాదు. తల్లి మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే.

కాబట్టి ‘అమ్మ అమ్మే’. ఏ కాలంలోనైనా, ఏ పాత్రలో వున్నా, ప్రతిక్షణం తన పిల్లలకై ఆరాటపడే అమ్మ తపనకి అంతమెక్కడ? పరిధులు, పరిమితులు మనమే నిర్ణయించుకోవాలి... కాలానుగుణంగా!

-ఇరగవరపు రమ