Home » Articles » భువిపైన అమృతం అమ్మ

భువిపైన అమృతం అమ్మ

 

 


అమ్మంటే ఏమిటని అడిగితే ఎంతటి వాళ్ళయినా మాటల కోసం తడుముకుంటారు. ఎలా చెప్పాలి
అని బేలముఖం పెడతారు. ఎందుకంటే.. అమ్మ అమ్మే. అమ్మకి పోలిక లేదు. పోటీ వచ్చేది లేదు.

అమ్మ ప్రేమకుండే బలానికి సాటి లేనే లేదు. అందుకే ఛత్రపతి శివాజీ అంతటి వాడు తల్లిప్రేమకు తార్కాణంలా నిలిచిన మహిళ హీరాకాని కాళ్ళపై పడి నమస్కరించాడు.


శివాజీ కోట శత్రుదుర్భేద్యంగా, కట్టుదిట్టమైన భద్రతతో, అంతెత్తు కోట గోడలతో వుండేది. రోజూ రాత్రి తొమ్మిది గంటలకల్లా ఆ కోట తలుపులు మూసేసి తిరిగి ఉదయం ఆరు గంటలకి తెరుస్తారు.ఇది రాజశాసనం. కాబట్టి ఎంత అవసరమైనా రాజుగారి ఆజ్ఞ లేనిదే రాత్రిపూట కోట తలుపులు తీయరు. రోజూ ఆ కోటలో నివాసం వుండే సైనికుల ఇళ్ళకి పాలు పోయడానికి వచ్చేది హీరాకాని.
 

 

అలా ఒకరోజు సాయంత్రం కోట లోపలకి పాలు పోయడానికి వచ్చిన హీరాకాని ఓ సైనికుడి భార్య పురిటినెప్పులు పడుతుంటే ఆమెకి పురుడు పోయడానికి ఆగిపోతుంది. పురుడుపోసి, తల్లీ, పిల్లా  క్షేమం అని తెలిశాక ఇక బయల్దేరుదాం అనుకుంటూ గబగబా కోట ద్వారం దగ్గరకి వెళుతుంది.

కానీ, అప్పటికే రాత్రి తొమ్మది  దాటడంతో కోట ద్వారాలు మూసేశారు. అయ్యో అనుకున్న  హీరాకాని అక్కడి కాపలాదారుల కాళ్ళావేళ్ళా పడుతుంది. ‘‘ఇంటి దగ్గర చంటిపాప వుంది. పాలకి ఏడుస్తుంది. ఆకలికి తట్టుకోలేదు’’ అని బతిమాలుతుంది. కానీ, రాజాజ్ఞ ధిక్కరించలేం అని ఆ సైనికులు కోట ద్వారాలు తీయరు.

 




చేసేది లేక వెనక్కి సైనికుడి ఇంటికి వచ్చేస్తుంది హీరాకాని. తెల్లారగానే ద్వారాలు తెరిచారు. ఇక  వెళ్ళమ్మా అని చెప్పడానికి వచ్చిన కాపలాదారులకి ఆ ఇంట్లో హీరాకాని కనిపించలేదు. ఆ  ఇంటివాళ్ళని అడిగితే వాళ్ళూ తెలియదంటారు. కాపలాదారులు కోటంతా వెతికినా హీరాకాని  కనిపించదు. తీరా ఓచోట అంతెత్తు కోట గోడకి ఓ చీర వేలాడుతూ కనిపిస్తుంది. శివాజీకి  కబురంది వస్తాడు. విచారణ చేస్తాడు. హీరాకానిని పిలవమని ఆదేశిస్తాడు.




ఆమె వచ్చాక ఇంతెత్తు కోట గోడ ఎలా ఎక్కావు? ఎవరు నీకు సాయం చేశారు? అని గద్ధిస్తాడు.  అందుకు హీరాకాని ఎవరూ సహాయం చేయలేదు. నేనే ఆ కోట గోడ దూకి వెళ్ళాను అంటుంది.  ఎలా ఎక్కావో చూపించు అంటే...

‘‘మహారాజా క్షమించండి. ఎలా ఎక్కానో, ఎలా దాటానో నాకూ తెలియదు. ఆ క్షణంలో ఆకలికి  అలమటిస్తూ ఏడ్చే నా పాప ముఖం తప్ప నాకింకేం కనిపించలేదు. ఎలా అయినా పాపకి పాలు  ఇవ్వాలి, ఆకలి తీర్చాలి అన్న ధ్యాసలో ఈ కోట గోడని దాటాను. ఎలా సాధ్యమైందో నాకే తెలియదు’’ అంటుంది.

 



వెంటనే ఛత్రపతి శివాజీ హీరాకాని పాదాలకి నమస్కరించి.. ‘‘అమ్మవి.. నీ బిడ్డ పట్ల నీకుండే ప్రేమ ముందు నా కోట గోడలు ఏపాటివి తల్లీ. అమ్మ ప్రేమకుండే శక్తే నిన్ను కోట గోడ దాటించింది. అమ్మకి సాటి అమ్మే. ఆ అమ్మ ప్రేమకి పోలిక లేదు’’ అంటాడు. ఆ తర్వాత హీరాకాని అమ్మ ప్రేమకి గుర్తుగా తన కోటలో ‘హీరాకాని బురుజు’ పేరుతో ఒక బురుజుని కట్టించాడు.అలా అమ్మ ప్రేమకి చిరునామాగా చరిత్రలో నిలిచిపోయింది హీరాకాని.

 

అమ్మలందరూ హీరాకానిలే. పిల్లలకోసం అసాధ్యాలని సుసాధ్యాలుగా మార్చేస్తారు. ప్రపంచాన్ని సైతం ఎదిరించి నిలుస్తారు. గెలుస్తారు. అనంతమైన ప్రేమని పిల్లలకి అందిస్తారు. అందుకే  భువిపైన అమృతం అమ్మ.



-రమ ఇరగవరపు