పొంగలి
కావలసిన పదార్థములు
పొట్టు పెసరపప్పు - 1 గ్లాసు
బియ్యం - 3 గ్లాసులు
మంచినీరు - 10 గ్లాసులు
పసుపు - తగినంత
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం
మొదట సరిపడా బియ్యం తీసుకుని రాళ్ళులేకుండా చెరిగేసి, బాగా శుభ్రంగా కడిగి, మునిగే వరకు నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానపెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే అంత మృదువుగా వస్తుంది పులగం..... తర్వాత పైన తీసుకున్న బియ్యంలో మూడొంతులు పెసరపప్పు తీసుకోవాలి. అంటే గ్లాసు పెసరపప్పుకి మూడుగ్లాసుల బియ్యమన్నమాట! ఇవి కూడా బాగా కడిగి నానపెట్టుకోవాలి. అవి బాగా నానాక సరిపడా గిన్నె పెట్టి దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఏ వంటకానికైనా తాలింపే ముఖ్యం. ఎలా పెట్టాలో చూద్దాం. గిన్నెలో బాగా మరింత నెయ్యి వేసి కాగనివ్వాలి. నెయ్యి వేస్తేనే రుచి. లేకపోతే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. కాగిన నేతిలో సరిపడా జీలకఱ్ఱ వెయ్యాలి. ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంక ఏ తాలింపుగింజలూ వాడొద్దు...ఇంగువకూడా వెయ్యాలి... మిరియాలు తగినన్ని ఈ తాలింపులో వేసుకోవాలి...(లేకపోతే అన్నం ఉడికేప్పుడు కూడా వేసుకోవచ్చు. మిరియాలపొడి వాడేట్టైతే అన్నం ఉడికేప్పుడే కలపాలి....) మిరియాలు వేసిన వెంటనే ఎసరు పొయ్యాలి. ఎంత పొయ్యాలి? మామూలుగా అన్నం వండేప్పుడు గ్లాసు బియ్యానికి, రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాం కదా! ఇక్కడ మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. రుచికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు. ఎసరు బాగా తెర్లింతర్వాత, పైన నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. ఎంత బాగా తిప్పితే అంత రుచి... రెండూ బాగా దగ్గరకయ్యాయి అనుకోగానే రుచికి తగినంత ఉప్పు, కాసిన్ని అల్లం ముక్కలు(సన్నగా తరిగినవి) కలుపుకోవాలి. మరీ గట్టిపడనివ్వొద్దు...కొంచెం మెత్తగా, లేహ్యంలా ఉంటేనే రుచి. చివర్లో దించేప్పుడు మరికాస్త నెయ్యి వేసి కలిపి దించాలి..... దించాక నేతిలో వేయించిన జీడిపప్పు కలుపుకోవచ్చు......అంతే! ఘుమఘుమలాడే "పులగం" తయారన్నమాట!