|
Andhra pradesh, AP formation day, November 1, andhra pradesh formation day, celebrations, political, minister, congress, potti sri ramulu, burugula ramakrishna, neelam sanjeeva reddy, nehru, gandhiji, mahatma gandhi, india, british
| తెలుగు పలుకును మరువకన్నా! తెలుగు సంస్కృతీ విడువకన్నా!!యాభై ఏళ్ళలో అమ్మ .... |
| |
 |
మమ్మీగా మారి ... మామ్ ... అయింది.
తండ్రి ... డాడీ అయి డమ్మీగా మారాడు.
ఇప్పుడు పిల్లలకింక రెండే తెగలు ....
మగాళ్ళంతా అంకుల్స్! ఆడాళ్ళంతా ఆంటీస్!!అంటూ మారుతున్న తెలుగు సంస్కృతీని విశ్లేషిస్తున్నారు ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి. రాష్ట్ర స్వర్ణోత్సవాలసందర్భంగా ప్రత్యెక వ్యాసం |
పొద్దున్నే రిక్షా అంకులో - ఆటో అంకులో తీసికెళ్ళి బస్సుదగ్గర దింపుతారు - అక్కడ్నించి స్కూల్ దగ్గర దింపుతాడు ... అక్కడ ప్యూన్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్తే ... ఇది అనంతరం! పూర్వం ఎవరినైనా ఆహార్యం ద్వారా గుర్తుపట్టే వాళ్ళం ... ఓహో వీళ్ళు ఆంధ్రులు, వీళ్ళు తమిళులు .... వీళ్ళు మలయాళీలు ... వీళ్ళు ఔత్తరాహులు .... ఇప్పుడు ఫేసు బట్టిగానీ, భాషబట్టిగానీ గుర్తుపట్టలేం ... ఎందుకంటే ఎవడి భాష వాళ్ళు మాట్లాడారు - ఎవడి దుస్తులు వాళ్ళు ధరించరు.
ఈ విషయంలో ఆంధ్రమాతలు మాత్రం ఆదర్శనీయురాళ్ళు. ఎందుకంటే ఎన్నోవేల ఏళ్ళ నుంచీ కట్టూబొట్టూలతో సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మా అమ్మమ్మ ఏం కట్టిందో ... మా అమ్మదీ అదే కట్టు .... మా ఆవిడదీ అదే కట్టు ... మా అమ్మాయిది డౌటు ... ఏదో పాపం ఇన్నేళ్ళ నుంచీ కాపాడుకుంటూ వచ్చారు మహాతల్లులు ....
ఎప్పుడో ఎందుకూ నా చిన్నతనంలో పండుగ వచ్చిందంటే తెల్లారగట్లలేచి వొంటికి సున్నిపిండి పెట్టి నల్చుకుని (సున్నిపిండి మీకు చటుక్కున గుర్తుకు రావాలంటే మనకి హోటళ్ళలో వేసే వైట్ చట్నీ వంటిది), తర్వాత కుంకుడుకాయతో తలంటుకోవాల్సొస్తుందని పారిపోవటం ... నాన్నో, అన్నయ్యో పట్టుకుని రెండు బాదటం, ఓ వైపు కుంకుడు రసంతోటి మరోవైపు దెబ్బలతోటి ఎర్రబడ్డ కళ్ళమీదా నడివర్ధనం పువ్వు పెట్టుకుని ... చింతపండూ, జీలకర్ర ఉప్పు కలిపి ముద్ద చేసీ దానికో చీపురుపుల్ల గుచ్చి నోట్లో ఐస్ ఫ్రూట్ లాగా చీకుతుంటే పగటిపండుగ మజా....
అదే దీపావళి అయితే గంథకం, సూరేకారం, ఆముదం కలిపి మతాబులూ, చిచ్చుబుడ్లూ ... ఆకుపచ్చటి మామిడి తోరణాలు ... వంటింట్లోంచి గారెలు, బూరెలు, పాయసాల ఘుమఘుమలు, ఆడవాళ్ళ పటుచీరెల రెపరెపలు, కన్నెపిల్లల పరికిణీలు .... వెండి పట్టాల గలగలలు ... జడగంటలు సుతారంగా ఊగుతుంటే .... వాటికి వేలాడిపోయే కుర్రగుండెలు ...
అపరాహ్ణం వేళ, కుటుంబాన్ అంతా వరుసగా కూర్చుంటే ... సహపంక్తి భోజనాలు- హస్తాలు- పక్క విస్తళ్ళలోంచి దొంగిలించడాలు .. చేతులడ్డం పెట్టినా ... సందుల్లోంచి వడ్డించేయటం ... మధ్యలో పెద్దాయన ఏదో పద్యం పాడటం ... తర్వాత భుక్తాయాసంతో ... పడక్కుర్చీలో పెద్దలు కబుర్లు చెప్పుకుంటుంటే ఆడంగులు చుట్టిఇచ్చిన తాంబూలాలు వేసుకుని లోకాభిరామాయణం .. పనివాళ్ళకి పప్పన్నాలు .... వాళ్ళకళ్ళల్లో యజమాని పట్ల కృతజ్ఞతా భావన, ఇలా పచ్చగా ఉన్న ఊరిని గుల్లోంచి చూస్తూ దేవుడూ మురిసిపోవడం ... ఏమైపోయాయి ఆనందాలు?
ఈ తరంలో చాలామందికి పోతన తెలీదు ... వేమన తెలీదు ... రేలంగి - సూర్యకాంతాలు కూడా తెలీదు ... నిజంగా జరిగిన ఓ సంఘటన చెప్తా! కోటీ ఉమెన్స్ కాలేజీలో ఏదో షూటింగ్ లో నేనూ, జూనియర్ రేలంగీ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే కొంతమంది అమ్మాయిలూ జూనియర్ రేలంగి దగ్గరకొచ్చి ''ఏమండీ మీరు ఓల్డ్ సినిమాలు చాలా చేశారు కదా! ఈ మధ్య కనిపించట్లేదేమిటండీ?'' అన్నారు. నేనన్నా కదా, ''అమ్మా ఆయన రేలంగి, మహానటుడు, పోయాడు. ఈయనింకా పోలేదు'' . పైగా ఈ మధ్య సంవత్సరాదీ ... సంక్రాంతీ ... దసరా ... ఇవి చప్పబడ్డాయి. 'డే'లు మొదలయ్యాయి 'డే'లంటే దినములు - వేలంటైన్స్ డే, టీచర్స్ డే .... ఫాదర్స్ డే .... మదర్స్ డే ....బర్త్ డే ... డెత్ డే ... మొన్నటికి మొన్న దీపావళినాడు ఆంధ్రరాష్ట్ర అవతరణం కూడా అని ఎంతమందికి తెలుసు ...? ఆగస్టు పదిహేను గానీ ... జనవరి 26 గానీ మొక్కుబడిగా చేయట్లేదూ ... చిన్నపిల్లలచేత బలవంతంగా చేయించాట్లేదూ ....
జాతీయగీతం వినబడుతుంటే అసహనంగా కదిలే జాతి ప్రపంచం మొత్తం మీదా మనదోక్కటేననుకుంటా ....
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పుడు పుట్టాడో చెప్పలేరు గానీ, ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్ ఎప్పుడు అయిందో కంఠతా వచ్చు .... జనగణమన పూర్తీ పాఠం నోటికి రాదు ... వందేమాతరం ... పల్లవి తప్ప రాదు ... సరే, 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అన్న పాట రాసింది శంకరంబాడి సుందరాచారి అయితే సుందరంబాడి శంకరాసారి (ఈయనో పీఠాధిపతి అనుకునే ప్రమాదం ఉంది) అనే వాళ్ళు బోల్డుమంది.
మనకి సంగీతం మీదా గౌరవం లేదు ... సాహిత్యం మీదా అవగాహన లేదు ... కళల పట్ల ఆదరణ లేదు ... ఇంత దుంప నాశనం అయిపోవాలా ... సంస్కృతి ....?
ప్రతిరోజూ తెలుగులో మాట్లాడండోవై అని ఏడవాలా ...? ఈ విషయంలో మనకన్నా తమిళ సోదరులు వెయ్యిరెట్లు గొప్పవాళ్ళు ... ఏ దేశమేగినా ఎందుకాలిడినా ....
తమిళ గూడకట్టు ... నుదుట విభూదిబొట్టు ... నోట్లో అయితే కిళ్ళీ ... లేదా తమిళం .... వాళ్ళది ఫెనటిజమ్ అంటారు గానీ ... నేనొప్పుకోను. అంత ఇష్టం ఉండబట్టే ఆ భాష యావత్ప్రపంచంలోనూ చెలామణీ అవుతోంది. ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరంగారు చిద్విలాసంగా పార్లమెంటులో కూడా లుంగీతోనే వెళతారు- ఈ విషయంలో మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి జోహార్లు- అచ్చం తెలుగు ముఖ్యమంత్రిలా వెలిగిపోతుంటారు .. చెప్పొచ్చేదేమిటంటే ... అన్ని భాషలూ నేర్చుకోండి. అందులోనూ ఇంగ్లీషు గట్టిగా నేర్చుకోండి (ఎంచేతంటే ... అది ప్రస్తుతపు దేవ భాష ... అది లేందే ఫుడ్డు లేదు) కానీ మన జాతీయతను కాపాడుకోండి!!
మల్లెచెట్టుకి మందార పూలో ... గులాబీలో పూస్తే తమాశాగానే ఉంటాయి, కానీ మల్లెపూలు పూయటం ధర్మం ... అంత మరీ .... ఆత్మని తాకట్టు పెట్టేలా ... అంటు కట్టకండి!!
తెలుగు పిల్లలకి కనీసం పది వేమన పద్యాలు .. పది సుమతీ శతకం పద్యాలు నేర్పండి!!
లేకపోతె నాలుగైదేళ్ళలో తెలుగు గూడా డైనోసార్ గుడ్డులాగ... అంతరించి పోతుంది.
నా మట్టుకు నేను గత పాతికేళ్ళ నుంచీ తెలుగులో సంతకం పెడ్తున్నా..... |
భవదీయ
తనికెళ్ళ భరణి |
|
|
|
|
| |
|
|
|