|
Andhra pradesh, AP formation day, November 1, andhra pradesh formation day, celebrations, political, minister, congress, potti sri ramulu, burugula ramakrishna, neelam sanjeeva reddy, nehru, gandhiji, mahatma gandhi, india, british
| నిండు వెలుగులు - 1 నిండుగ వెలుగు జాతి మనది |
| |
 |
'తెలుగువారికి రెండువేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. శాతవాహనుల ఏలుబడిలో ఘనకీర్తి పొందిన దేశమిది. ఏనాడో ఐతరేయ బ్రాహ్మణుల కాలంలోనే' ఆంద్ర శబ్ద ప్రస్తావన ఉంది. ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి.
తెలుగువారు తమ గురించి, తమ భాష గురించి ఆలోచించేటప్పుడు తమకు మనోవీధిలో మెదిలే భావాల్లో ఇవి కొన్ని చారిత్రకంగా చూసినా, సాహితీ సంస్కృతిపరంగా చూసినా, ఆర్ధిక రాజకీయ నేపథ్యాల్లోంచి చూసినా, తెలుగువారు ఎవరికీ తీసిపోనివారు అనే మాట వాస్తవమే అయినప్పటికీ - తమ అస్తిత్వాన్ని రుజువుచేసుకునేందుకు |
వారు సుదీర్ఘ కాలం పోరాటం చెయ్యవలసి వచ్చింది. ఈ పోరాటంలో మనకు తెలుగు తేజాన్ని కమ్మిన కారుమేఘాలు మాత్రమే కాదు - ఆకాశమేఘాల్ని చీల్చుకుని విరజిమ్మిన కాంతి కిరణాలు కూడా దర్శనమిస్తాయి.
శాతవాహన, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహీ ప్రభువుల పాలనలో ఒక పెద్ద దేశంగా గుర్తింపు పొందిన తెలుగునాడు గోల్కొండ సామ్రాజ్య పతనానంతరం కంపెనీవారి పరిపాలన కాలంలో ముక్కలుగా విడిపోయింది. మద్రాస్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు - దత్త మండలాలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనికి వస్తే - తెలంగాణ జిల్లాలు, మరట్వాడ, కర్ణాటక ప్రాంతాలు కలిసి నిజం పరిపాలనలోనికి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ తెలుగు మాట్లాడే వారిసంఖ్య అధికం అయినప్పటికీ తెలుగు సంస్కృతికి తగిన ఆదరణ ఆనాడు లభించలేదు. ఇక- రాజకీయంగా, ఆర్థికంగా, వారి వారి ఎదుగుదలకు అప్పట్లో ఉన్న ఆటంకాల సంగతి సరేసరి. ఇలాంటి నేపథ్యంలో - ఆంధ్రుల గుండెల్లో రగులుకొన్నఆవేదన ఫలితంగా ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల్లో 'ఆంధ్రోద్యమం' అనేది తలెత్తింది. ఆంధ్రుల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకుని వచ్చింది.
ఆంధ్రోద్యమ ఆవిర్భావానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ,మొదటికి - ఆంధ్రులు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకొనేందుకు లోనయిన తపనకు చెందినది అయితే, రెండోది- 1905 నాటి 'వందేమాతరం' ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి, పరిపాలన సౌలభ్యం పేరుతొ కుటిల రాజకీయాన్ని ప్రయోగించి లార్డ్ కర్టన్ బెంగాలును రెండు ముక్కలు చేద్దామనుకుంటే వంగదేశీయులు చరిత్రాత్మకమైన పోరాటాన్ని చేసి తమ ఐక్యతా స్ఫూర్తిని నిలబెట్టుకున్నారు. ఆ రోజుల్లో ఇది దేశం మొత్తం మీద జాతీయతా భావాన్ని రగిలించి స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. ఈ ఉద్యమ ప్రభావం తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించడం మాత్రమే కాదు, తెలుగువారందరూ ఒక్కటే అనే భావానికి కూడా అంకురార్పణ చేసింది. |
నిండు వెలుగులు - 2
1947 లో మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక నెహ్రూజీ భాషా ప్రయుక్త రాస్త్రాలకు సుముఖత చూపి, థార్ కమిషన్ ను నియమించారు. నాయకుల మధ్య మళ్ళీ పొడచూపిన విభేదాల కారణంగా అడుగు త్వరగా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో థార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం ద్వారా వివిధ ప్రాంతాల మధ్య అనైక్యత ఏర్పడవచ్చుననే సందేహాన్ని వెలిబుచ్చింది. దీనిని సాకుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం విషయాన్ని ఎటూ తేల్చకుండా - 'జె.వి.పి.కమిటీ' (జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య), 'పార్టిషన్ కమిటీ (ఆంద్ర రాష్ట్రం ఏర్పడే పక్షంలో ఆంద్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య ఆస్తి అప్పుల పంపకం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని సూచించే సంఘం) వంటి కమిటీలను వేస్తూ మరింత తాత్సరం చేస్తూ వచ్చింది. ఈ ఆలస్యాన్ని భరించలేని స్వామి సీతారాం 35 రోజులు నిరాహార దీక్ష చేసినా సత్వరం పరిశీలిస్తామనే శుష్క వాగ్దానాలు మినహా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఆ దశలో 1952 అక్టోబరు 19వ తేదీన మద్రాసులో బులుసు సాంబమూర్తి గృహంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు పాటు కఠోర నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేశారు. ఫలితంగా ముక్కోటి ఆంధ్రులు ఉప్పెనలా విరుచుకు పడడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. చివరకు - 1953లో కైలాసనాథ్ వాంఛూ కమిటీ నివేదిక వెలువడ్డాక - ఆంద్ర, రాయలసీమ జిల్లాలకు, బళ్ళారి జిల్లాలోని ఆలూరు, ఆదోని, రాయదుర్గ్ తాలూకాలను కలిపి ఆంద్ర రాష్ట్ర అవతరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. 1953 అక్టోబరు 1వ తేదీన కర్నూలు రాజధానికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రాన్ని నెహ్రూజీ ప్రారంభం చేశారు.
ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 'విశాలాంధ్ర' ఏర్పడాలనే చిరకాల వాంఛ మాత్రం నెరవేరలేదు. ఈ విషయమై రామానందతీర్థ, పండిత నరేంద్ర జీ, ముందుముల నరసింగరావు, మెహబ్జీ నవాజ్ జంగ్, ముఖ్దుం మొహియుద్దీన్ వంటి ప్రముఖులు చేసిన కృషి మరి కొంతకాలానికి గాని కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన 'ఫజల్ ఆలీ కమిషన్' (రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం) 1954 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో ఆంద్ర, తెలంగాణ నాయకుల మధ్య కుదిరిన 'పెద్దమనుషుల ఒప్పందం' కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం మీద ఆనాటి నాయకులు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి ప్రభ్రుతులు సంతకాలు చేశారు. చివరకు - నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగువారు కన్నా కలలను వాస్తవం చేస్తూ 1956 నవంబరు 1వ తేదీన - నేటికి అర్థశతాబ్ది క్రితం ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 'నాగార్జున సాగర్' ఆనకట్ట నిర్మాణం జరిగేందుకు వీలుకలిగింది. |
సమగ్రాభివృద్ధే లక్ష్యం ....
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలూ ఓకే విధంగా అభివృద్ధి చెందకపోవటం, రాష్ట్ర నాయకత్వం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండటం ... ఇలాంటి అనేకనేక కారణాలతో ఒకనాటి తెలుగువారి కలలను కల్లలుగా చేసే వేర్పాటు ఉద్యమాలు మళ్ళీ తలెత్తుతూనే వచ్చాయి. 1969 నాటి ప్రత్యెక తెలంగాణా ఉద్యమం, 1972నాటి 'జై ఆంద్ర' ఉద్యమాన్ని కూడా ప్రస్తావించుకొనవలసి ఉంది. ప్రతి ఉద్యమం వెనుకా ఏదో ఒక 'ఆవేదన' ఉంటుంది. ఆ ఆవేదనకు కారణాలు ఉంటాయి. ఇదంతా విస్మరించరాని విషయమే అయినప్పటికీ - భాష, సంస్కృతి పరంగా తెలుగువారందరూ నాడూ, ఏనాడూ ఒక్కటే. దీనిని ఎవరూ కాదనలేరు. ఒక్కసారి తెలుగువారి కథను సింహావలోకనం చేసుకుంటే - ఎందరో కవులు, కళాకారులు, మేధావులు, స్వాతంత్ర్య సమరవీరులు, పరిపాలనాదక్షులు ... ఎందరో మన మనోవీధిలో మెదులుతారు.
తెలుగు వారిని ఉద్దీపింపజేసిన ఎన్నో మహూత్తర సంఘటనలు, ఉద్యమాలు, సంస్థలు, గ్రంథాలు స్ఫురణకు వస్తాయి. తెలుగు భాషలోని తియ్యదనం జ్ఞప్తికి వస్తుంది. అంతేకాదు కాలగమనంలో ఆంధ్రదేశం ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా లోనయిన మార్పులు వాటి ప్రభావాలు గుర్తుకువస్తాయి. ఎలాంటి హద్దులు, అడ్డంకులు లేని జ్ఞాపకాలను మననం చేసుకోవడం ఒక మధురానుభూతి. ఈ అనుభూతిని అందించే ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించడమే తెలుగు తల్లికి మనం అడివ్వగలిగే నిజమైన నివాళి. మనం ఆమెకు అర్పించగల మల్లెల మాల ఇదే. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి తెలుగు వారందరి కర్తవ్యం.!! |
| |
|
|
|
|
| |
|
|
|