RELATED KIDS TALENT
KIDS TALENT
అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '

 

 

ఫిబ్రవరి 21, 2016 (శాన్ ఫ్రాన్సిస్కో): భాషా సేవయే భావి తరాల సేవ అనే నినాదంతో గత 8 సంవత్సరాలుగా అమెరికాతో పాటు, పలు దేశాలలో తెలుగు భాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి లో  ఈ సంవత్సరం 6000 మంది విద్యార్ధులు చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మనబడి విద్యార్ధులంతా కలిసి అమెరికా వ్యాప్తంగా కాలిఫోర్నియా లో సన్నివేల్, డబ్లిన్, సాండియాగో, ఉత్తర లాస్ ఏంజిల్స్ మరియు దక్షిణ లాస్ ఏంజిల్స్, మిచిగన్, అట్లాంటా, నార్త్ కెరొలీనా, టెక్సాస్ లోని హ్యూస్టన్, మరియు ఆస్టిన్  తదితర ప్రాంతాలలో ఒకే సారి 'మనబడి పిల్లల పండగ జరుపుకున్నారు.

 ఈ సందర్భంగా చిన్నారులు  తెలుగు పద్యాలు, పౌరాణిక ఘట్టాలు, తెలుగు సంస్కృతిని చాటే బుర్రకధలు, నాటకాలు, నాటికలు, నృత్యాలు, లలిత గీతాలు, వంటి అనేక కళలను ప్రదర్శించి ప్రేక్షకులని అబ్బురపరిచారు. మనబడి లో తెలుగు నేర్చుకోవడమే కాకుండా ఇటువంటి సంస్కృతి, సంప్రదాయ, సాహిత్య విలువలను తెలుసుకోవడానికి మనబడి పిల్లల పండుగ ఒక గొప్ప వేదిక అని, ఈ విధంగా వారికి మన భారతీయ కళల పట్ల అవగాహన, అభిరుచి కలుగ జేస్తున్నామని, మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు.

 మనబడి పాఠ్య ప్రణాళికకు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు తో పాటు,  అమెరికాలోని పలు స్కూల్ డిస్ట్రిక్ట్లలోనూ  గుర్తింపు లభించిందని,   త్వరలో మరిన్ని స్కూల్ డిస్ట్రిక్ట్లగుర్తింపు సాధించేలా కృషి చేస్తున్నామని,  శరత్ వేట తెలిపారు.  ఈ సందర్భంగా పిల్లల పండుగ సమన్వయకర్త స్నేహ వేదుల, మాట్లాడుతూ, అమెరికా దేశ వ్యాప్తంగా పలు పట్టణాలలో దాదాపు 2000 మంది మనబడి విద్యార్ధులు 'తెలుగు భాషా జ్యోతి ' తో కవాతు నిర్వహించి, తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేస్తామని ప్రతిన పూనినట్టు, తెలుగు పిల్లలు తెలుగు లో మాట్లాడాలి, మన తెలుగు కళల గురించి తెలుసుకోవాలని ఈ మనబడి పిల్లల పండగ నిర్వహిస్తున్నాం. మరిన్ని ప్రాంతాలలో రాబోయే ఏప్రియల్ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు..


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున  ప్రవాస భారతీయుల ప్రతినిధి గా నియమించబడిన జయరాం కోమటి  గారు  పిల్లల పండగకు, ముఖ్య అతిధి గా విచ్చేసి  తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక  సంప్రదాయ స్ఫూర్తిని పెంపొందించే సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ,  మనబడి ద్వారా అమెరికా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో  తెలుగు పిల్లలకి తెలుగు భాష  నేర్పించడం లో  మనబడి సాధించిన విజయాలను కొనియాడారు. ఈ సందర్భం గా జయరాం కోమటిని వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, నేతృత్వంలో సిలికానాంధ్ర ప్రతినిధులు సత్కరించారు. సిలికానాంధ్ర అద్యక్షుడు సంజీవ్ తనుగుల మరియు కార్యనిర్వాహక బృందం 'www.siliconandhra.org '  నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.  మనబడి ఉపాద్యక్షులు డాంజి తోటపల్లి మాట్లాడుతూ,  మనబడి లో తెలుగు నేర్చుకునే పిల్లలకు తెలుగు మాట్లాడడంపై మరింత పట్టు సాధించడానికి ' పలుకు బడి ' అనే మరో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, రాబోయే వేసవి సెలవల్లో ఈ 'పలుకుబడి ' ద్వారా సంభాషణ పై ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్న మనబడి విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులు, సహకరిస్తున్న ప్రాంతీయ తెలుగు సంస్థలు, మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు, అమెరికా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో  జరుగుతున్న ఈ కార్యక్రమ నిర్వహణలో   జయంతి కోట్ని, భాస్కర్ రాయవరం, శాంతి కూచిభొట్ల, శిరీషా చమర్తి, శ్రీవల్లి, శ్రీదేవి గంటి,శ్రీని తొంట, అమర్ సొలస, మాధవి కడియాల, వేణుగోపాల్ బుర్ల, గోపాల్ గుడిపాటి,కిరణ్ సింహాద్రి, శ్రీధర్ శ్రీగిరిరాజు, మహేష్ కోయ,  జగన్ రాయవరపు, మోహన్ కాట్రగడ్డ,  మహి మద్దాలి,  అనితా గుళ్ళపల్లి, ఫణి మాధవ్ కస్తూరి  తదితరులు వివిధ ప్రాంతాలనుండి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మనబడి సేవలను అమెరికాలోని ప్రతి తెలుగువారికీ మరింత  అందుబాటులోకి తీసుకురావడం  కోసం,  మనబడి సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్  1800-626-2234(BADI) ని ఆవిష్కరించడం జరిగింది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;