RELATED EVENTS
EVENTS
ఒహాయో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ డల్లాస్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి

డల్లాస్, టెక్సాస్ (ఆగష్టు 3): ఒహాయో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ మంగళవారం మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ -- ప్రపంచం మొత్తానికి గాంధీ మహాత్ముడు ఆదర్శమైన నాయకుడు అని, అయన చూపిన శాంతి బాట, సర్వమానవ శ్రేయస్సు ఎల్లవేళలా ఆచరణీయమని కొనియాడారు. కేవలం ప్రవాసభారతీయులనే గాక, స్థానిక అమెరికన్ ప్రజలతో మమేకమై అందరినీ ఒకే తాటి మీదకు తీసుకు వచ్చి, అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను డల్లాస్ నగరంలో (2014 లో) నిర్మించడంలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డా. ప్రసాద్ తోటకూర సల్పిన అవిరళ కృషి ఎంతో స్పూర్తిదాయకమని, దీని సాకారానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “భారత సంతతికి చెందిన రెండవ తరం వారు అమెరికా దేశ రాజకీయాలలో ముందంజలో ఉన్నారు అనడానికి ప్రతీక గుజరాత్ మూలాలున్న నీరజ్ అంటానీ అంటూ, 23 సంవత్సరాల వయస్సులోనే ఒహాయో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి, రిపబ్లిక్ పార్టీ తరపున మూడు సార్లు ఒహాయో రాష్ట్ర ప్రతినిధి గా ఎన్నికై, ఆరు సంవత్సరాల పాటు ఆ పదవిలో పనిచేసి, ఇటీవలే ఒహాయో సెనేట్ కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా నీరజ్ ఈ పదవిలో డిసెంబర్ 31, 2024 వరకు కొనసాగుతారు. అమెరికా రాజకీయాలలో రాణిస్తున్న ప్రవాస భారతీయులలో నీరజ్ అతి పిన్నవయస్కుడు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు.” ఈ కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వాల, బోర్డు అఫ్ డైరెక్టర్ రాంకీ చేబ్రోలు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;