political-news-img

రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాహుల్ ప్రసంగాన్ని వినడం తనకు పెద్ద తలనొప్పిగా మారిందని, ఆయన పార్లమెంటును ఒక పరిహాసంగా మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, డీలిమిటేషన్ వంటి అంశాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ‘మెజీషియన్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. రాహుల్ ప్రసంగంపై సభ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కంగనా, తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇంకా తన బాల్యపు జ్ఞాపకాలు, చిన్నప్పుడు చూసిన మ్యాజిక్ షోల ప్రభావం నుంచే బయటకు రావడం లేదని కంగనా ఎద్దేవా చేశారు. "ఆయన ప్రసంగం వినడం ఒక పెద్ద తలనొప్పి. పార్లమెంటులో ఆయన ప్రవర్తన ఒక న్యూసెన్స్ లా ఉంది. స్పీకర్ ఎన్నిసార్లు వారించినా వినకుండా సభ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తున్నారు" అని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కుల గణన, ఓబీసీల ప్రాతినిధ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే, కంగనా ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. రాహుల్ ప్రసంగంలో పస లేదని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విడగొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో కూడా రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి లోక్‌సభ వేదికగా ఇద్దరి మధ్య ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం మొదలైంది. రాహుల్ వ్యాఖ్యలను అన్ పార్లమెంటరీగా భావిస్తున్న అధికార పార్టీ నేతలు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై హేమమాలిని వంటి ఇతర బీజేపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. వినోదం కోసం పార్లమెంటును వేదికగా చేసుకోవడం సరికాదని వారు హితవు పలికారు. ప్రస్తుతానికి ఈ వివాదం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

Publish Date: Apr 17, 2026 10:42PM

political-news-img

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం...సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విపక్షాల ఐక్యత ముందు కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఈ రోజును భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ దినంగా పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సమర్థ నాయకత్వం వల్లే దేశానికి రాబోయే ఒక పెద్ద విపత్తు తప్పిందని రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ అగ్రనేతలు పోషించిన పాత్ర అద్వితీయమని ఆయన ప్రశంసించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడం శుభపరిణామమని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ సవరణలను రేవంత్ రెడ్డి 'నల్ల బిల్లులు'గా అభివర్ణించారు. ఈ బిల్లులు గనుక చట్టరూపం దాల్చి ఉంటే దేశ సమాఖ్య వ్యవస్థకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన విపక్షాలు లోక్‌సభలో గట్టిగా పోరాడి బిల్లును వీగిపోయేలా చేశాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్‌తో కలిసి నడిచిన ప్రాంతీయ పార్టీల నేతలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే వంటి హేమాహేమీలకు ధన్యవాదాలు తెలియజేశారు. వీరితో పాటు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, నవీన్ పట్నాయక్ వంటి నేతల మద్దతును ఆయన అభినందించారు. దేశ ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీలు, ఇతర విపక్షాలన్నీ ఒకే మాటపై నిలబడటం ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోసిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ విలువల రక్షణ కోసం ఇవే శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిణామం కేంద్రంలోని అధికార పక్షానికి ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, విపక్షాల బలం పుంజుకోవడంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి అంత సులభం కాదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ దిశగా ఈ బిల్లు వీగిపోవడం ఒక కీలక విజయంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Publish Date: Apr 17, 2026 10:28PM

political-news-img

హర్మూజ్ జలసంధి ఓపెన్.. ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

హర్మూజ్ జలసంధిని ప్రపంచ వాణిజ్యానికి ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిని మూసివేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ గడువు ముగిసేంత వరకూ హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉంటుందని, నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవనీ స్పష్టం చేసింది. కాగా ఇరాన్ నిర్ణయంపై స్పందిచిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ధ్యాంక్స్ చెప్పారు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ధ్రువీకరించారు. గతంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమైంది. అయితే.. ట్రంప్ బృందం జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టడం వల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ రకమైన సానుకూల ధోరణిని కొనసాగిస్తే, భవిష్యత్తులో ఆ దేశంపై ఉన్న మరిన్ని ఆంక్షలను అమెరికా సడలించే అవకాశం ఉందన్న భావన అంతర్జాతీయంగా వ్యక్తం అవుతోంది.

Publish Date: Apr 17, 2026 10:21PM

political-news-img

సజ్జల భార్గవ్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. సజ్జల బార్గవ్ రెడ్డి , ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తనపై జారీ చేసిన ఎల్‌ఓసీని .. అంటే నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి జారీ చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం (17-4-26) విచారణ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు ఎలా పెడతారని న్యాయస్థానం ప్రశ్నించింది. వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును సక్రమంగా చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోరినప్పుడు విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్ వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎల్ఓసీని రీ కాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్దన వచ్చిన వెంటనే ఎల్ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులకు ఏపీ హై కోర్టు ఆదేశించింది.

Publish Date: Apr 17, 2026 10:07PM

political-news-img

మహిళలను బీజేపీ మోసం చేసింది : కవిత

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఆమె భారతీయ జనతా పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం వల్లే లోక్‌సభలో బిల్లు వీగిపోయిందని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారని కవిత ఆరోపించారు. ఈ చర్యతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని ఆమె అన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి, దానిని జనగణన (సెన్సెస్)కు అనుసంధానించారని గుర్తుచేశారు. ఇప్పుడు 2011 జనగణన ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం ద్వారా మరోసారి మహిళలను వంచించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మహిళలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని తమ స్నేహితులకు చెప్పాలని కవిత సూచించారు.

Publish Date: Apr 17, 2026 9:54PM

political-news-img

రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం...ఇది మహిళా బిల్లు కాదు : రాహుల్

పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చి, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ మండిపడ్డారు. "ప్రభుత్వం ప్రవేశపెట్టింది నిజమైన మహిళా బిల్లు కాదు, అది కేవలం డీలిమిటేషన్ బిల్లు మాత్రమే" అని రాహుల్ ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యను పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే కేంద్రం అసలు లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టే తాము ఐక్యంగా పోరాడి బిల్లును అడ్డుకున్నామని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2023లో ఆమోదం పొందిన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. దానికి డీలిమిటేషన్, జనగణన వంటి నిబంధనలను ముడిపెట్టి కాలయాపన చేయవద్దని సూచించారు. మహిళా కోటాకు, నియోజకవర్గాల పునర్విభజనకు ఎటువంటి సంబంధం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం 'ఇండియా' కూటమి ఐక్యతను చాటిచెప్పిందని రాహుల్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కేంద్రం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి, దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో అటు విపక్షాల్లో హర్షం వ్యక్తమవుతుండగా, పార్లమెంట్ పరిసరాల్లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం దేశ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Publish Date: Apr 17, 2026 9:32PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img