Top Stories

dummy

political-news-img

‘డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా బిల్లు ప్రతులను ఆయన బహిరంగంగా దహనం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్‌, గతంలో తమిళనాడులో హిందీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని గుర్తుచేశారు. ఆ ప్రతిఘటన జ్వాలలు ఢిల్లీని కుదిపేశాయని, ఇప్పుడు డీలిమిటేషన్‌ బిల్లును తగలబెట్టడం ద్వారా మరోసారి ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నామని తెలిపారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Publish Date: Apr 16, 2026 6:17PM

political-news-img

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం... తేజస్వీ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కమలం నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ…బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం కాషాయ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వీ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు కమలం పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.

Publish Date: Apr 16, 2026 6:03PM

political-news-img

విధ్వంసమే జగన్ నైజం...అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం : మంత్రి లోకేశ్

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని ఆయన విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన లోకేశ్, అమరావతి రాజధాని నిర్మాణం మరియు రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జగన్ వైఖరిని తప్పుబడుతూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత తల్లిని, చెల్లిని కూడా గౌరవించకుండా దూరం చేసుకున్న వ్యక్తికి రాష్ట్ర ప్రజల క్షేమం ఏం పడుతుందని ఆయన ప్రశ్నించారు. "దైవం అంటే భక్తి లేదు.. దేశం అంటే గౌరవం లేదు" అంటూ జగన్ వ్యక్తిత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి కొత్తగా కంపెనీలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటే, జగన్ మాత్రం అకారణంగా ఏడుస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో కీలకమైన బోట్ల తయారీ సంస్థ రాష్ట్రానికి రావడాన్ని వైసీపీ వ్యతిరేకించడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక మత్స్యకార యువతకు సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, అటువంటి మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని చూడటం జగన్ "సైకో" మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి నెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ.. "కట్టినవన్నీ కూల్చేస్తాం.. రప్పా రప్పా నరుకుతాం" అనే వినాశకర ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను చూసి తట్టుకోలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల వల్ల ఇప్పటికే రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలు కోల్పోయిందని, ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తోందని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమరావతి అభివృద్ధి ఆగదని, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధ్వంసకర రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అడ్డుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేశ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో అభివృద్ధి మరియు సంక్షేమం విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Publish Date: Apr 16, 2026 5:51PM

political-news-img

ఈ సన్నని సముద్ర మార్గాలు.. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాణవాయువు!

ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో సింహభాగం అంటే దాదాపు 80 శాతం పైగా సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. అయితే, భూగోళంపై ఉండే కొన్ని అత్యంత ఇరుకైన సముద్ర మార్గాలు.. వాటిలో చోక్ పాయింట్స్ అంటారు. ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రాబల్యం ఎక్కువగా ఉండే పానామా కాలువ ఆసియా, అమెరికా మధ్య వాణిజ్యానికి వెన్నెముక వంటిది. అయితే వాతావరణ మార్పుల వల్ల నీటి మట్టం తగ్గడం ఇక్కడ ప్రధాన సవాలుగా మారింది. మరోవైపు.. యూరోప్ మరియు ఆసియా ఖండాలను కలిపే సూయజ్ కాలువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతంలో జరిగిన ఎవర్ గివెన్ నౌక ప్రమాదం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. చైనాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధి ప్రస్తుతం అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక పోరాట కేంద్రంగా మారింది. తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడే చైనా, అక్కడ పట్టు సాధించేందుకు దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఇక ప్రపంచ చమురు సరఫరాను శాసించే హార్ముజ్ జలసంధి ఎప్పుడూ యుద్ధ మేఘాల మధ్యే ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇక్కడ ఇంధన ధరలను ప్రభావితం చేస్తున్నాయి.ఇటీవలి కాలంలో బాబ్ ఎల్-మందెబ్ మార్గంలో హౌతీ రెబల్స్ దాడుల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇ ది కేవలం ప్రాంతీయ పోరాటం మాత్రమే కాదు.. అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీసే చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో టర్కీ జలసంధులు బోస్పరస్, డార్డనెల్స్ ప్రపంచ ఆహార భద్రతలో.. ముఖ్యంగా గోధుమల రవాణాలో కీలక పాత్ర పోషి స్తున్నాయి.భవిష్యత్తులో ఈ 'చోక్ పాయింట్ల పై నియంత్రణ సాధించే దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం ఉంది. చమురు ధరల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు ప్రతిదీ ఈ మార్గాల భద్రతపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే అగ్రరాజ్యాలు తమ నౌకాదళాలను ఈ ప్రాంతాల్లో మోహరిస్తూ.. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ సన్నని సముద్ర మార్గాలే ఆధునిక ప్రపంచ ఆర్థిక యుద్ధరంగాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. - సీతారాం కంఠమనేని

Publish Date: Apr 16, 2026 5:38PM

political-news-img

ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన పోరాట ఫలితమని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సాధారణ ప్రజలు చేసిన త్యాగాల పునాది మీదే ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి గొప్ప ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే కాకుండా అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపడమేనని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, దీనిని జీర్ణించుకోలేకపోవడమే బీజేపీ నేతల వ్యాఖ్యల్లో ప్రతిఫలిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తమ అధికారిక వైఖరిని స్పష్టం చేయాలని, లేకపోతే ఇది పార్టీ ధోరణిగానే ప్రజలు భావిస్తారని హెచ్చరించారు.

Publish Date: Apr 16, 2026 5:28PM

political-news-img

ప్రపంచ శక్తుల మధ్య నిశబ్ద యుద్ధ కేంద్రాలు ఈ సముద్ర మార్గాలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సన్నని సముద్ర మార్గాలు. వీటిలో ఏర్పడిన ఒక చిన్న అడ్డంకి కూడా మహాశక్తుల సమతుల్యాన్ని కదిలించేస్తుంది. ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ చోక్ పాయింట్స్ కేవలం భౌగోళిక మార్గాలు కాదు, ఇవి ప్రపంచ శక్తుల మధ్య జరిగే వ్యూహాత్మక పోరాటాల కేంద్రాలు. ఎందుకు ఇవి జియోపాలిటికల్ హాట్ స్పాట్స్ అయ్యాయంటే.. ? - చమురు ధరలు ఇక్కడే నిర్ణయించబడతాయి - ప్రపంచ సరఫరా గొలుసులు ఇక్కడే నిలిచిపోతాయి - మహాశక్తుల నౌకాదళాలు ఇక్కడే ఢీకొంటాయి - యుద్ధాలు, ఆంక్షలు, తిరుగుబాట్లు మొదట ఇక్కడే ప్రభావం చూపుతాయి ఒక చోక్ పాయింట్ మూసుకుపోతే, అది కేవలం ఒక దేశాన్ని కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. 1. పానామా కాలువ.. అమెరికా ప్రభావం తగ్గితే మొదట దెబ్బ తినేది ఇదే. పానామా కాలువ అమెరికా వ్యూహాత్మక ఆధిపత్యానికి ప్రతీక. అమెరికా–ఆసియా వాణిజ్యానికి కీలకం. చైనా, జపాన్, కొరియా సరుకులకు ప్రధాన రవాణా మార్గం. వాతావరణ మార్పులకు అత్యంత సున్నితమైనది. ఇటీవలి సంవత్సరాల్లో ఎండలు, నీటి కొరత కారణంగా నౌకల సంఖ్య తగ్గడం, వాతావరణ మార్పు కూడా జియోపాలిటికల్ ఆయుధంగా మారుతోందని సూచిస్తోంది. 2. సూయజ్ కాలువ యూరప్ కు ఆసియా ప్రాణవాయువు. ఈ సూయజ్ కాలువ మూసుకుపోతే.. యూరప్ కు ఇంధనం, ఆసియాకు మార్కెట్లు, ఆఫ్రికాకు సరఫరాలు అన్నీ నిలిచిపోతాయి. 2021 ఎవర్ గివెన్ ఘటన ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒకే ఒక్క నౌక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలిపివేయగలదు. ఈ మార్గం మీద నియంత్రణ ఎవరిదో… యూరప్, ఆసియా వాణిజ్యంపై వారి ప్రభావం అంత ఎక్కువ. 3. మలక్కా జలసంధి.. చైనా యొక్క గొంతు పట్టే మార్గం. చైనా ఇంధన దిగుమతుల్లో 80శాతం ఈ మార్గం మీద ఆధారపడి ఉంది. అందుకే చైనా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మిస్తోంది. నౌకాదళాన్ని విస్తరిస్తోంది. మలక్కా డైలెమా నుంచి బయటపడేందుకు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులు వేగవంతం చేస్తోంది. మలక్కా జలసంధి మూసుకుపోతే.. చైనా ఆర్థిక వ్యవస్థకు నేరుగా దెబ్బ. అందుకే ఈ జలసంధి అమెరికా–చైనా వ్యూహాత్మక పోరాటంలో కీలకం. 4. హార్ముజ్ జలసంధి ఇది గల్ఫ్ చమురు ప్రపంచానికి చేరే మార్గం. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చోక్ పాయింట్. రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ జలసంధి గుండానే వెడుతుంది. ప్రపంచ సహజవాయువు రవాణాలో 20 శాతం ఈ మార్గంలోనే రవాణా అవుతుంది. అందుకే ఇది అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తానని పలుమార్లు హెచ్చరించింది. అమెరికా నౌకాదళం ఇక్కడే శాశ్వతంగా మోహరించింది. ఇది కేవలం వాణిజ్య మార్గం కాదు, ఇది కేవలం వాణిజ్య మార్గం కాదు.. మధ్యప్రాచ్య శక్తి సమతుల్యాన్ని నిర్ణయించే యుద్ధరంగం. 5. బాబ్ ఎల్-మందెబ్ — రెడ్ సీకి ప్రవేశ ద్వారం, ఇప్పుడు యుద్ధరంగం. 2023లో ఈ మార్గంగుండా 26,000 నౌకలు వెళ్లేవి. వాటి సంఖ్య హౌతీ దాడుల కారణంగా 2025లో 12,700 నౌకలకు పడిపోయింది. ఇది కేవలం యెమెన్ యుద్ధం కాదు.. ఇరాన్–సౌదీ–అమెరికా మధ్య జరుగుతున్న ప్రాక్సీ పోరాటం. ఈ మార్గం మూసుకుపోతే.. సూయజ్ కాలువ విలువ తగ్గుతుంది. యూరప్ కు సరఫరాలు నిలిచిపోతాయి. చమురు ధరలు పెరుగుతాయి అందుకే ఇది ప్రపంచ శక్తులన్నిటికీ అత్యంత సున్నితమైన ప్రాంతం. 6. టర్కిష్ స్ట్రైట్.. రష్యా, ఉక్రెయిన్, యూరప్ మధ్య వ్యూహాత్మక నాడి బోస్పరస్ అండ్ డార్డనెల్స్.. ప్రపంచ గోధుమ రవాణాలో పాతిక శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేరుగా ఇక్కడే కనిపిస్తుంది. టర్కీ ఈ మార్గాన్ని నియంత్రించడం వల్ల..రష్యాపై ఒత్తిడి, యూరప్ పై ప్రభావం పడుతుంది. నాటోలో తన ప్రాధాన్యం పెరగడం అన్నీ సాధ్యమవుతున్నాయి. మహాశక్తుల వ్యూహం: చోక్ పాయింట్లను నియంత్రిస్తే ప్రపంచాన్ని నియంత్రించినట్టే. ఈ మార్గాలపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో .. వారి చేతుల్లోనే.. చమురు ధరలు, గ్లోబల్ సరఫరా చెయిన్లు, స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, యుద్ధాలు, శాంతి ఒప్పందాలు ఉంటాయి. అందుకే.. అమెరికా హార్ముజ్, బాబ్ ఎల్-మందెబ్ వద్ద నౌకాదళాన్ని ఉంచుతోంది. చైనా మలక్కా జలసంధికి ప్రత్యామ్నాయాలు నిర్మిస్తోంది. రష్యా టర్కిష్ జలసంధులపై ప్రభావం పెంచడానికి ప్రయత్నిస్తోంది. యూరప్ సూయజ్ కాలువ భద్రతపై ఆధారపడుతోంది. ప్రపంచ శక్తులన్నీ ఈ సన్నని మార్గాల చుట్టూ తమ వ్యూహాలను నిర్మిస్తున్నాయి. చివరిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ సన్నని సముద్ర మార్గాల మీదే ఆధారపడి ఉంది. ఈ చోక్ పాయింట్లలో ఏ ఒక్కదానిలోనైనా యుద్ధం, దాడి ప్రమాదం, ఆంక్షలు, వాతావరణ మార్పు జరిగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెంటనే కుదేలవుతుంది. ఇవి కేవలం సముద్ర మార్గాలు కాదు.. ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధాల కేంద్రాలు. సేకరణ, సంకలనం : సీతారాం కంఠమనేని

Publish Date: Apr 16, 2026 5:23PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img