Top Stories

dummy

political-news-img

పైలెట్ రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు విచారణపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగు తోంది. ఈ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలతో పాటు, తనిఖీ లకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా నమోదు కావడం కేసును మరింత తీవ్రతరం చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డిని ఈ కేసులో A2 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి బెయిల్ కోసం ఉప్పర్ పల్లి కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఉప్పర్‌పల్లి కోర్టు ఆయనకు బెయిల్‌ను తిరస్కరించింది. అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రారంభ విచారణ జరిపిన హైకోర్టు, కేసు వివరాలు మరియు దర్యాప్తు పురో గతిపై మరిన్ని సమాచారం అవసరమని భావించి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయని, తదుపరి విచారణలో కేసు కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నారు.ఈ కేసు రాజకీయ వర్గాల్లో కూడా ప్రాధాన్యత సంతరించు కుంది. హైకోర్టులో జరగ నున్న తదుపరి విచారణపై అందరి దృష్టి నిలిచింది.

Publish Date: Apr 16, 2026 6:47PM

political-news-img

ఎంతసేపైనా చర్చిద్దాం.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చారిత్రక చర్చ ప్రారంభమైంది. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లుపై సుమారు మారథాన్ చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. ఈ చర్చలో ప్రతి రాజకీయ పార్టీకి తమ వాదనను గట్టిగా వినిపించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు కీలక బిల్లులు దేశ రాజకీయ భవిష్యత్తును మార్చనున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మరియు లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచేందుకు ఈ బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రాజకీయ పక్షం తమ గళాన్ని వినిపించేందుకు వీలుగా చర్చా సమయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. కిరణ్ రిజుజు ఈ బిల్లులపై ఎంతసేపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో ప్రకటించారు. సమయా భావం సమస్య తలెత్తకుండా సమయం కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో సంఖ్యా బలంతో సంబంధం లేకుండా చిన్న పార్టీలకు కూడా చర్చలో ప్రసంగించేందుకు తగిన సమయం కేటాయించనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రతి పార్టీకి మూడు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ ఉంటుందని పేర్కొన్న ఆయన అవసరమైతే రాత్రి పొద్దుపోయినా సభ కొనసాగిస్తానని చెప్పారు. కాగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని గట్టిగా వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. అంతకు ముందు చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ రంగు పులమవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు అత్యంత అవసరమన్నారు.

Publish Date: Apr 16, 2026 6:46PM

political-news-img

లోకేశ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేశ్‌.. నూతన బాధ్యతల్లో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నారా లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శక్తిమంతంగా ముందుకు సాగాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారు. ఇప్పటికే తన శాఖల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన, పార్టీని కూడా అదే స్థాయిలో బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ తన సమర్థతను చాటుకుంటారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకూ పవన్‌ అభినందనలు తెలియజేశారు.

Publish Date: Apr 16, 2026 6:38PM

political-news-img

‘డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా బిల్లు ప్రతులను ఆయన బహిరంగంగా దహనం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్‌, గతంలో తమిళనాడులో హిందీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని గుర్తుచేశారు. ఆ ప్రతిఘటన జ్వాలలు ఢిల్లీని కుదిపేశాయని, ఇప్పుడు డీలిమిటేషన్‌ బిల్లును తగలబెట్టడం ద్వారా మరోసారి ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నామని తెలిపారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Publish Date: Apr 16, 2026 6:17PM

political-news-img

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం... తేజస్వీ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కమలం నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ…బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం కాషాయ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వీ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు కమలం పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.

Publish Date: Apr 16, 2026 6:03PM

political-news-img

విధ్వంసమే జగన్ నైజం...అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం : మంత్రి లోకేశ్

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని ఆయన విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన లోకేశ్, అమరావతి రాజధాని నిర్మాణం మరియు రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జగన్ వైఖరిని తప్పుబడుతూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత తల్లిని, చెల్లిని కూడా గౌరవించకుండా దూరం చేసుకున్న వ్యక్తికి రాష్ట్ర ప్రజల క్షేమం ఏం పడుతుందని ఆయన ప్రశ్నించారు. "దైవం అంటే భక్తి లేదు.. దేశం అంటే గౌరవం లేదు" అంటూ జగన్ వ్యక్తిత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి కొత్తగా కంపెనీలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటే, జగన్ మాత్రం అకారణంగా ఏడుస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో కీలకమైన బోట్ల తయారీ సంస్థ రాష్ట్రానికి రావడాన్ని వైసీపీ వ్యతిరేకించడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక మత్స్యకార యువతకు సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, అటువంటి మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని చూడటం జగన్ "సైకో" మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి నెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ.. "కట్టినవన్నీ కూల్చేస్తాం.. రప్పా రప్పా నరుకుతాం" అనే వినాశకర ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను చూసి తట్టుకోలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల వల్ల ఇప్పటికే రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలు కోల్పోయిందని, ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తోందని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమరావతి అభివృద్ధి ఆగదని, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధ్వంసకర రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అడ్డుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేశ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో అభివృద్ధి మరియు సంక్షేమం విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Publish Date: Apr 16, 2026 5:51PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img