political-news-img

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన.. విచారణ ఆలస్యంపై టీడీపీ ఆందోళన.. !

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌పై ఉన్న దాదాపు 31 తీవ్రమైన క్రిమినల్ మరియు సీబీఐ కేసుల్లో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు దాటినా ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేకపోవడంపై ఎంపీ విజయ్ సభలో తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. సీబీఐ ప్రత్యేక కోర్టులలో కేసుల పురోగతి నెమ్మదించడం వల్ల వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, నిందితులు కోర్టుల్లో వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను సుదీర్ఘ కాలం పాటు పొడిగిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే సమయానికి న్యాయమూర్తులు బదిలీ కావడం, మరొకవైపు జడ్జీల కొరత వల్ల ఈ కేసులు దశాబ్దానికి పైగా మూలనపడిపోతున్నాయని వివరించారు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్లను పరిష్కరించడానికే 13 ఏళ్ల సమయం పడితే, ఇక అసలు కేసుకు సంబంధించిన ప్రధాన ట్రయల్ ఎప్పుడు పూర్తవుతుంది? తుది తీర్పు ఇంకెప్పుడు వస్తుందని ఎంపీ విజయ్ ఘాటుగా ప్రశ్నించారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత అంశం మాత్రమే కాదని ఆయన ఉద్ఘాటించారు. న్యాయం జరగడంలో ఇటువంటి అపరిమిత జాప్యం చోటుచేసుకుంటే చట్టపరిపాలన, సీబీఐ మరియు సమగ్ర న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉండే విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుల పనితీరును వేగవంతం చేయడానికి, కావలసిన నియామకాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, రాజ్యసభలో టీడీపీ ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించగానే ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలోనే విజయ్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ పెద్దెత్తున నిరసనకు దిగడంతో సభలో కాసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన రాజకీయ నాయకుల కేసుల్లో జరుగుతున్న ఈ జాప్యంపై న్యాయ కోవిదులు, సామాన్య ప్రజలు కూడా సుదీర్ఘ కాలంగా చర్చించుకుంటున్నారు. అత్యున్నత చట్టసభ వేదికగా లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రత్యేక కోర్టుల్లో విచారణ స్పీడప్ అవుతుందో లేదో వేచి చూడాలి. Chintakayala Vijay, YS Jagan CBI Cases, Rajya Sabha TDP MP, Supreme Court Judges Bill, AP Politics Telugu News

Publish Date: Aug 5, 2026 9:49PM

political-news-img

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చించారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ కు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. H-1B వీసా ప్రాసెసింగ్‌, రెన్యువల్‌, వీసా స్టాంపింగ్‌ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు. CM Revanth Reddy meets Sergio Gore, H-1B Visa Processing, Telangana Goverment, American Ambassador

Publish Date: Aug 5, 2026 9:32PM

political-news-img

నన్ను చంపినా సరే బంగ్లాదేశ్‌కు వెళ్తా..షేక్ హసీనా సంచలన ప్రకటన..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. తనను చంపినా లేదా జైల్లో పెట్టినా బంగ్లాదేశ్ ప్రజల కోసం తిరిగొస్తానని ఆమె పేర్కొనడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా ఆమె ఈ ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని అక్రమ కేసులు బనాయించినప్పటికీ, అవేవీ తన నిర్ణయాన్ని మార్చలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశ సరిహద్దులు దాటి దూరంగా ఉన్నప్పటికీ, తన ఆలోచనలన్నీ బంగ్లాదేశ్ సంక్షేమం చుట్టూనే తిరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హసీనా.. తాము మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించాలనే స్వార్థంతో తిరిగి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కేవలం దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడం మరియు పౌరులకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఆమె ప్రకటించారు. తమ కుటుంబ సభ్యుల త్యాగాలను, గతంలో చోటుచేసుకున్న తీవ్ర హింసాత్మక ఘటనలను గుర్తుచేసుకుంటూ హసీనా అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. బంగ్లాదేశ్ పౌరులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, కష్టకాలంలో వారికి అండగా నిలవడమే ఒక నాయకురాలిగా తన ప్రధాన బాధ్యతని ఆమె వ్యాఖ్యానించారు. 2024లో తీవ్రస్థాయిలో చెలరేగిన విద్యార్థుల ఉద్యమం, రాజకీయ అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై అనేక కేసులు నమోదు చేయడంతో పాటు ఆమెను విచారణ కోసం బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను కోరుతోంది. ఈ క్రమంలో హసీనా విడుదల చేసిన తాజా ఆడియో సందేశం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించింది. హసీనా రీఎంట్రీ ప్రకటనను అవామీ లీగ్ శ్రేణులు స్వాగతిస్తుండగా, వర్తమాన పాలకులు మాత్రం ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రానున్న రోజుల్లో హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే ప్రక్రియ ఎంతవరకు సాఫీగా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలతో పాటు దక్షిణ ఆసియా రాజకీయాల్లోనూ ఈ పరిణామాలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. Sheikh Hasina, Bangladesh Politics, Sheikh Hasina Return, Awami League, Telugu News

Publish Date: Aug 5, 2026 9:20PM

political-news-img

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచడంతో పాటు పర్యాటకం, పెట్టుబ డులను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. గతంలో గుజరాత్ పర్యా టక రంగానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆ రాష్ట్ర ప్రచారానికి విశేషంగా తోడ్పడిన నేపథ్యంలో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డింగ్ కోసం చిరంజీవిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్న ట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు, సంబంధిత ప్రతినిధుల మధ్య ఇప్పటికే ప్రాథమిక స్థాయి సంప్రదింపులు పూర్తైనట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువను పెంచడం వంటి అంశాల్లో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలు వడలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ నియామకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. Megastar as AP brand ambassador, Chiranjeevi, CM Chandrababu, Pavan kalyan, Naralokesh, AP Goverment

Publish Date: Aug 5, 2026 8:57PM

political-news-img

ఎయిరిండియాకు కొత్త సీఈఓ..ఎవరంటే..!

భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తేవోల్డే గెబ్రెమరియామ్‌ను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో పదవికి రాజీనామా చేసిన క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఆయన ఎయిర్ ఇండియా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో ఎంతో అనుభవం, దిగ్గజ వ్యూహకర్తగా పేరుగాంచిన లీడర్ కోసం ఎయిర్ ఇండియా బోర్డు ప్రత్యేక కమిటీ ద్వారా విస్తృతమైన శోధన చేపట్టింది. స్వదేశీ, విదేశీ స్థాయిలలోని ఎంతోమంది దిగ్గజాల ప్రొఫైళ్లను నిశితంగా పరిశీలించిన తర్వాత, తేవోల్డే గెబ్రెమరియామ్ ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దడానికి అత్యంత సమర్థుడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తేవోల్డే గెబ్రెమరియామ్ సాధారణ వ్యక్తి కాదు.. ఏవియేషన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన గ్లోబల్ లీడర్. ఆయన గతంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు 10 సంవత్సరాలకు పైగా సీఈఓగా సేవలు అందించారు. ఆ పదేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలు ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. తేవోల్డే నేతృత్వంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఒక చిన్న ప్రాంతీయ ఎయిర్‌లైన్ స్థాయి నుండి ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏవియేషన్ గ్రూప్‌గా రూపాంతరం చెందింది. ఆయన హయాంలో బహుళ బిలియన్ డాలర్ల విస్తరణ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. కేవలం పదేళ్ల వ్యవధిలోనే కంపెనీ వార్షిక రెవెన్యూ లేదా ఆదాయం 4 రెట్లకు పైగా పెరిగింది. అంతేకాకుండా, విమానాల సంఖ్య (ఫ్లీట్ సైజ్) కూడా దాదాపు 3 రెట్లు పెరిగి ఊహించని రీతిలో రికార్డు సృష్టించింది. టాటా సన్స్ ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ నియామకంపై ఆనందం వ్యక్తం చేస్తూ, తేవోల్డే గెబ్రెమరియామ్‌కు బోర్డు తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. క్యాంప్‌బెల్ విల్సన్ మార్గదర్శకత్వంలో ఎయిర్ ఇండియా ప్రాథమిక స్థిరీకరణ, విలీన ప్రక్రియలు మరియు కొత్త ఫ్లీట్ ఆర్డర్ల ఒప్పందాల దశను విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా తన ప్రయాణంలో అత్యంత కీలకమైన రెండవ దశలోకి అడుగుపెడుతోందని, ఇది కార్యరూపణ మరియు విస్తరణ దశ అని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన, లాభదాయకమైన ఎయిర్‌లైన్లను నిర్మించిన అనుభవం తేవోల్డే సొంతమని, ఆయన కార్యాచరణ నైపుణ్యం, విమాన భద్రత పట్ల అంకితభావం, గ్లోబల్ హబ్ డెవలప్‌మెంట్ విజన్ ఎయిర్ ఇండియాను అంతర్జాతీయ స్థాయి ప్రీమియర్ క్యారియర్‌గా నిలబెట్టడానికి ఎంతో తోడ్పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కొత్త బాధ్యతలపై తేవోల్డే గెబ్రెమరియామ్ స్పందిస్తూ, ఇది తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం యొక్క అద్భుతమైన ఆర్థిక సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఎయిర్ ఇండియాను ప్రపంచస్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దే అవకాశం రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఛైర్మన్ చంద్రశేఖరన్, బోర్డు సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ భాగస్వాములతో కలిసి పని చేస్తూ అత్యుత్తమ సేవా ప్రమాణాలు, భారతీయ ఆతిథ్యం, స్థిరమైన సుదీర్ఘ వృద్ధిని అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియాను ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక సంస్థగా మార్చడానికి మరియు భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా నిలబెట్టడానికి తేవోల్డే నాయకత్వం ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. Air India New CEO, Tewolde Gebremariam, Tata Sons Air India, Air India MD appointment, Ethiopian Airlines former CEO, Indian Aviation News

Publish Date: Aug 5, 2026 8:49PM

political-news-img

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ : సీఎం రేవంత్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆ మహనీయులు తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని సీఎం అన్నారు. తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే లక్ష్యంగా ఆ మహనీయుడు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ప్రజలు ఎదుర్కొన్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. Jayashankar the inspiration Telangana, CM Revanth reddy, Telangana Movement, Professor Jayashankar

Publish Date: Aug 5, 2026 8:31PM

MOVIE NEWS