political-news-img

గెట్-టుగెదర్ పార్టీలో విషాదం

ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని నిర్వహించిన గెట్-టుగెదర్ పార్టీ విషాదాంతంగా మారింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలిసి ఫామ్‌ హౌస్‌లో గెట్-టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాము కూడా హాజరయ్యారు.అర్థరాత్రి వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. అయితే రాము అకస్మాత్తుగా కుప్ప కూలి కింద పడిపోయాడు. అందరూ రాము వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెందాడు. రాము మృతి చెందడంతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం ప్రభు త్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో ఫామ్‌ హౌస్‌లో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి మరణానికి అసలు కారణం ఏమిటి? ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న విషయాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే యువకుడి మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలి పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Publish Date: Jun 14, 2026 3:17PM

political-news-img

రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ : కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సినిమా పరిభాషను వాడుతూ రేవంత్ రెడ్డి పాలనను అత్యంత ఘాటుగా విమర్శించారు. సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే అది హిట్టా లేదా ఫట్టా అని ప్రేక్షకులు ఎలా అంచనా వేస్తారో, అదే విధంగా తెలంగాణ ప్రజలు కేవలం కొన్ని నెలల కాంగ్రెస్ పాలనను చూసి ఒక స్పష్టమైన తీర్పుకు వచ్చేసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటర్వెల్ పడిపోయిందని, వారి పాలనలో మొదటి సగం అంటే 'ఫస్ట్ హాఫ్' పూర్తిగా డిజాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, నిరాశతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. కొత్తగా ఇళ్ళు కట్టడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని మండిపడ్డారు. పేదలకు అందించాల్సిన వివిధ సంక్షేమ పథకాల ఆర్థిక సహాయాల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలను పెంచుకుంటూ పోతోందని, లబ్ధిదారులకు పైసలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను రాజకీయంగా పక్కన పెట్టాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలు చేసిందని, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 2,00000 (రెండు లక్షల) ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతకు తప్పుడు హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. గద్దెనెక్కిన తర్వాత ఆ 2 లక్షల ఉద్యోగాల హామీని అటకెక్కించి, నిరుద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. కేవలం ప్రజలనే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులను, నమ్ముకున్న వాళ్ళను కూడా ఘోరంగా మోసం చేశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాల వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఒక సమగ్రమైన నివేదికను సమర్పించారని కేటీఆర్ వెల్లడించారు. ఆ నివేదిక ఇచ్చిన కారణంగానే మీనాక్షి నటరాజన్‌పై తీవ్ర కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి, ఆమెపై దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టించి వేధించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమెకు దక్కాల్సిన రాజ్యసభ అవకాశాలను కూడా రేవంత్ రెడ్డి రాజకీయంగా అడ్డుకుని తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలు, పేరు మార్పిడి సంస్కృతిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఆకలి తీర్చడం కోసం కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించే అద్భుతమైన పథకాన్ని ప్రారంభించి, దానికి 'అన్నపూర్ణ' అని దైవచింతనతో కూడిన పేరు పెట్టారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పేరులో ఉన్న అమ్మవారి పేరును తొలగించి, దానికి 'ఇందిరమ్మ' భోజన పథకంగా మార్చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి కలిగిన కాంగ్రెస్ నాయకులకు అవకాశం దొరికితే జూబ్లీహిల్స్‌లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి పేరును కూడా మార్చేయడానికి వెనుకాడరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా విశ్రమించకుండా, ప్రతి ఒక్కరూ తమ సొంత డివిజన్‌ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో అంకితభావంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పక్క డివిజన్ల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి, తమ పరిధిలోని ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో, పట్టుదలతో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం, బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Publish Date: Jun 14, 2026 3:07PM

political-news-img

బంగీ జంప్ సరదా ప్రాణం తీసింది

అడ్వెంచర్ గేమ్స్ అంటే ఈ రోజుల్లో యువతకు ఎంతో క్రేజ్. థ్రిల్ కోసం, కాసేపు గాల్లో తేలిపోవాలనే సరదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి ఆటలపై మక్కువ చూపిస్తుంటారు. అయితే, ఒక్కోసారి ఈ సరదానే శాపంగా మారుతుంది. పర్యవేక్షించే సిబ్బంది చేసే చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పడానికి బ్రెజిల్‌లో జరిగిన ఈ తాజా ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. ఒక యువతి తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా వీకెండ్ గడపడానికి వెళ్లి, చివరకు తిరిగిరాని లోకాలకు చేరుకుంది. కేవలం నిర్వాహకుల ఘోర తప్పిదం వల్లే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బ్రెజిల్‌లోని లైమీరా నగరంలో శనివారం, అంటే జూన్ 13వ తేదీన ఒక అత్యంత ఒళ్లుగగుర్పొడిచే విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రేటర్ సావో పాలో ప్రాంతానికి చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ అనే 21 ఏళ్ల యువతి అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టపడేది. ఆ రోజూ కూడా ఆమె తన స్నేహితుల బృందంతో కలిసి లైమీరాలోని ప్రసిద్ధ 'స్కెలిటన్ బ్రిడ్జ్' (Skeleton Bridge) వద్దకు వెళ్ళింది. అక్కడ నిర్వహించే స్వింగ్ జంప్ లేదా బంగీ జంప్ (Bungee Jumping) చేసి సరికొత్త అనుభూతిని పొందాలని ఆమె ఎంతో ఆశపడింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఆటలో పాల్గొనడానికి అవసరమైన అన్ని అధికారిక ఫార్మాలిటీస్, పేపర్‌వర్క్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమెను బంగీ జంప్ చేయించడానికి వంతెన పైకి తీసుకువెళ్లారు. అక్కడ ప్లాట్‌ఫామ్ పై నిలబడి కిందకు దూకడానికి ఆమె సిద్ధంగా ఉంది. అయితే, అక్కడి సిబ్బంది అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అసలు ఆటలో అత్యంత కీలకమైన భద్రతా నియమాన్ని పూర్తిగా మర్చిపోయారు. మరియాను కిందకు వదిలేయడానికి ముందు, ఆమె కాళ్లకు కట్టాల్సిన అత్యంత ముఖ్యమైన రక్షణ తాడును (Safety Rope) కట్టడమే మర్చిపోయారు. ఆ ఘోరమైన పొరపాటును గమనించకుండానే, సిబ్బంది ఆమెను చేతులతో పైకి ఎత్తి ఏకంగా 40 మీటర్ల ఎత్తు నుంచి కిందకు తోసేశారు. సాధారణంగా బంగీ జంప్ చేసినప్పుడు రక్షణ తాడు సహాయంతో గాల్లో అటు ఇటు ఊగుతూ ఎంజాయ్ చేయాలి. కానీ, ఇక్కడ రక్షణ తాడు లేకపోవడంతో మరియా నేరుగా 40 మీటర్ల ఎత్తు నుండి అత్యంత వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టింది. ఆమె పైనుంచి కిందకు పడే సమయంలో పెట్టిన చావు కేకలు విన్న తర్వాతే అక్కడి సిబ్బందికి అసలు విషయం అర్థమైంది. తాము ఆమెకు సేఫ్టీ రోప్ కట్టలేదనే నిజాన్ని గ్రహించేసరికే అంతా జరిగిపోయింది. తీవ్రమైన గాయాల కారణంగా ఆ 21 ఏళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. భద్రతా తాడును కట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన, అక్కడ విధుల్లో ఉన్న ఆరుగురు సిబ్బందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలను చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. 'అడ్వెంచర్ గేమ్స్ నిర్వాహకులను నమ్మితే ఇలాగే ప్రాణాలు పోతాయి' అని కొందరు, 'పాపం ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేద్దామని వెళ్లిన యువతి ఇలా శవమైపోవడం దారుణం' అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించే సంస్థలు కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Publish Date: Jun 14, 2026 2:34PM

political-news-img

బర్త్ డే పేరుతో పోకిరీల హల్‌చల్

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో కాలనీల్లో గుమిగూడి టపాకులు కాలుస్తూ, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై గుంపులుగా చేరుతున్న యువకులు అతివేగంగా బైక్‌లు, కార్లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అర్ధరాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడటమే కాకుండా, వృద్ధులు, చిన్నారులు భయభ్రాంతు లకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. టపాకుల శబ్దాలు, బైక్‌ల రేసింగ్, పెద్దగా అరుపులు, కేకలతో కాలనీల ప్రశాంతతకు భంగం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపిం చడం లేదని వాపోతు న్నారు. అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ఈ పోకిరీ చేష్టలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు రాత్రి పూట పోలీసు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టిన రోజు సంబరాలు ఆనందంగా జరుపుకోవాలి.. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా కాదు" అని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.

Publish Date: Jun 14, 2026 2:12PM

political-news-img

హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్న : సోనమ్ వాంగ్‌చుక్

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా ఆదివారం ఒక భారీ శాంతియుత నిరసన ప్రదర్శన జరిగింది. ఇటీవల దేశ విద్యావ్యవస్థను కుదిపేసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, అలాగే సీబీఎస్ఈకి చెందిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన తీవ్రమైన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. దానికి తోడు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ కూడా తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో అత్యంత కీలకమైన మరియు ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. ప్రముఖ విద్యా సంస్కర్త, మెగసేసే అవార్డు గ్రహీత, పర్యావరణ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా భాగ్యనగరానికి విచ్చేసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. యువత ఆశయాలకు, ప్రజాస్వామ్యయుత పోరాటానికి ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో తనను తాను ఒక ‘గౌరవ బొద్దింక’గా అభివర్ణించుకున్న వాంగ్‌చుక్, విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే యువత ఆవేదనను ప్రభుత్వం అణిచివేయకుండా వినాలని హితవు పలికారు. భావప్రకటనా స్వేచ్ఛను నొక్కిపడితే నేపాల్‌లో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో భారత్‌లో కూడా అలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ వేదికగా లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనం తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు తెలంగాణ విద్యార్థి లోకం, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా, హైదరాబాద్ ఉద్యమ నిర్వాహకుడు రుచిత్ కమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొని తమ ఆవేదనను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేవలం 6 శాతం మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకే ప్రస్తుతం ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) ఉన్నాయని, మిగిలిన 94 శాతం విద్యార్థుల భవిష్యత్తును ఈ విద్యావ్యవస్థ అంధకారంలోకి నెట్టేస్తోందని తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా జరుగుతున్న పేపర్ లీకేజీలకు క్యాబినెట్ లంచగొండితనమే కారణమని, బాధ్యులైన వారిని కేవలం రాజీనామా చేయించడమే కాకుండా జైలుకు పంపాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) వంటి విద్యార్థి, యువజన సంఘాలతో పాటు స్థానిక డప్పు కళాకారులు, ప్రజా గాయకులు మద్దతుగా నిలిచారు. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పరీక్షల్లో జరుగుతున్న జాప్యం, భారీగా పెంచిన అప్లికేషన్ ఫీజులపై కూడా స్థానిక అభ్యర్థులు తమ గళాన్ని విప్పారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పుట్టి, ఢిల్లీలోని జంతర్ మంతర్, పుణే, లక్నోల మీదుగా ఇప్పుడు హైదరాబాద్ ఇందిరాపార్కును తాకిన ఈ ‘కాక్రోచ్’ విప్లవం.. దేశంలో విద్యా సంస్కరణలు వచ్చే వరకు, పరీక్షల పత్రాల లీకేజీలకు అడ్డుకట్ట పడే వరకు శాంతియుతంగా కొనసాగుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

Publish Date: Jun 14, 2026 1:24PM

political-news-img

న‌కిలీ హెచ్ 1బి కుంభకోణం.. ప్రమాదంలో పౌరసత్వం

అధ్యాయం 1.. ఒత్తిడిలో ఉన్న వ్య‌వ‌స్థ నకిలీ ఉద్యోగ ఆఫర్లు, ఫోర్జరీ పత్రాలు, నకిలీ అకడమిక్ డిగ్రీలకు సంబంధించిన మోసాలకు సంబంధించిన ఆధారాలు పెరుగుతున్న ప‌రిస్థితి. దీంతో, యునైటెడ్ స్టేట్స్‌లోని హెచ్ 1బి వీసా కార్యక్రమం గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పరిశీలనను ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు సాధారణ ఇమ్మిగ్రేషన్ జరిమానాలకు మించి, క్రిమినల్ విచారణ, దీర్ఘకాలిక నిషేధాలు, తీవ్రమైన కేసులలో యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వాన్ని రద్దు చేయడం వరకు విస్తరించాయి. ఇటీవలి పరిణామాలు, హెచ్ 1బి కార్యక్రమాన్ని మూడేళ్లపాటు తాత్కాలికంగా నిలిపివేయడాన్ని పరిశీలించాలని యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్‌లో నిరంతర రాజకీయ ఒత్తిడికి దారితీశాయి. ఈ వ్యవస్థను కొందరు మధ్యవర్తులు, దరఖాస్తుదారులు క్రమపద్ధతిలో దుర్వినియోగం చేశారనే అభిప్రాయాన్ని ఇది బలపరుస్తోంది. కఠినతరమవుతున్న ఈ వాతావరణం ఇమ్మిగ్రేషన్ మధ్యవర్తులు యజమానులపై మాత్రమే కాకుండా, చట్టబద్ధమైన ఉన్నత విద్య, ఉద్యోగ‌, ఉపాధి మార్గాలపై ఆధారపడే భారతదేశానికి చెందిన నిజమైన విద్యార్థులు, నైపుణ్యం గల కార్మికులపై కూడా ప్రభావం చూపుతోంది. ఇందులో దాగిన మూడు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన విష‌యాలు ఏంటంటే.. మోసపూరిత యజమాని ఒప్పందాల ద్వారా హెచ్ 1బి ఉద్యోగాలను సృష్టించడం. భారతదేశంలో నకిలీ డిగ్రీలు విపరీతంగా పెరిగి వలస మార్గాలకు దారితీయడం. హెచ్ 1బి సంబంధిత మోసం కారణంగా.. భారత సంతతికి చెందిన ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఒక చారిత్రాత్మక కేసు. ఈ అంశాలన్నీ కలిసి, వ్యవస్థాగత దుర్వినియోగాలు అమెరికా వలస విధాన‌ సమగ్రతను, చట్టబద్ధంగా జీవించే భారతీయ వలసదారుల ప్రతిష్టను, భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేస్తాయో వివరిస్తాయి. అధ్యాయం 2.. హెచ్ 1బి కార్మికులు ఎదుర్కునే ప్ర‌మాదం కఠినతరం అవుతున్న నిబంధనల అమలు, కాబోయే హెచ్ 1బి దరఖాస్తుదారులు, వారి కుటుంబాలపై, యజమానులు, మధ్యవర్తులను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యతల‌ను మోపుతుంది. ఉద్యోగ ప్రతిపాదన వచ్చి, అది హెచ్ 1బి వీసాకు, అమెరికాకు తరలింపునకు దారి తీసిన తర్వాత.. తమ స్థానం సురక్షితం అని కాబోయే వలసదారులు తరచుగా భావిస్తారు. అయితే.. మోసపూరిత స్పాన్సర్‌లతో సంబంధం పెట్టుకోవడం వల్ల.. కార్మికులు వలస సంబంధిత పరిణామాలు- ప్రతిష్టకు నష్టం వంటి శిక్షలకు గురికావచ్చని కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసులు రుజువు చేస్తున్నాయి. దీంతో దరఖాస్తు చేయాలనుకునేవారు తాము పనిచేయబోయే సంస్థల గురించి స్వతంత్రంగా పరిశోధన చేయడం చాలా అవసరం. కంపెనీ సమీక్షా వెబ్‌సైట్లు, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ పోర్టల్స్ వంటి ఉద్యోగుల సమీక్షలు, ఉద్యోగ చరిత్రలను సేకరించే బహిరంగ వేదికలు, ఒక సంస్థ విశ్వసనీయత, ఉద్యోగ పద్ధతుల గురించి ఉపయోగకరమైన సంకేతాలు అందిస్తాయి. ఆఫర్‌లోని ఏ అంశంపైనైనా ప్రాథమిక అనుమానం కలిగించినప్పుడు, దరఖాస్తుదారులు జాగ్రత్త వహించాలని, అలాంటి అవకాశాలను తిరస్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, జరిమానాలు విధించేటప్పుడు అమలు చేసే ఏజెన్సీలు, బాధ్యతగల యజమానులకు, తెలియని ఉద్యోగులకు మధ్య స్పష్టమైన తేడాను ఎప్పుడూ గుర్తించవు. అధ్యాయం 3.. కేస్ స్టడీ I- వీసా మార్గాలుగా కల్పిత విశ్వవిద్యాలయ ఉద్యోగాలు ఒక ఉదాహరణ కేసులో.. సయీద్ రజావీ, షరారత్ మదానీ. వీరు హెచ్ 1బి ప్రోగ్రామ్‌కు సంబంధించిన వీసా మోసానికి పాల్పడినట్లు అంగీకరించారు. విదేశీ కార్మికులకు హెచ్ 1బి వీసాలను ఇప్పించడం కోసం, వారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌లో ఉన్నట్లుగా నకిలీ ఉద్యోగ స్థానాలను సృష్టించారు. వాస్తవానికి, ఆ స్థానాలు ఉనికిలో లేవు, కానీ పిటిషన్లలో విశ్వవిద్యాలయాన్ని స్పాన్సరింగ్ యజమానిగా.. పేర్కొన్నారు. వీసాలు ఆమోదించిన తర్వాత.. ఈ కార్మికులను ఇతర సంస్థలకు సమర్థవంతంగా అమ్మేశారు, లేకుంటే మళ్లించారు. దీని ద్వారా, విశ్వవిద్యాలయ స్థానాలుగా ఉన్న‌వి ఒక‌ విస్తృత ప్లేస్‌మెంట్ పథకంలో కేవలం గేట్ వేగా మాత్రమే పనిచేస్తాయని నిర్ధారించారు. ఈ నిర్మాణం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పద్ధతులకు అనుగుణంగా ఉంది, ఇందులో మధ్యవర్తులు చట్టబద్ధమైన యజమానులుగా లేదా విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థలుగా నటిస్తూ, తరచుగా వలసదారులకు భారీ నష్టాన్ని కలిగిస్తూ కార్మికులను యు.ఎస్. లేబ‌ర్ మార్కెట్‌లోకి పంపిస్తారు. న్యాయ శాఖ నిర్ధారణలు, పరిణామాలు ఎలాంటివో చూస్తే.. ఇద్దరు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారని, వారిలో ఒకరు కార్మికులు, ఒక విశ్వవిద్యాలయ ప్రాజెక్టులో ఉన్నారని తప్పుగా పేర్కొనడానికి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌కు సంబంధించిన అధికారిక హోదాను దుర్వినియోగం చేశారని యునైటెడ్ స్టేట్స్ న్యాయ శాఖ ధృవీకరించింది. తద్వారా, తప్పుడు సాకులతో వీసాలు పొందారు. ఆ తర్వాత కార్మికులను వేరే చోటికి మళ్లించారు. ఇది, హెచ్ 1బి లబ్ధిదారులు తమ పిటిషన్లలో పేర్కొన్న నిర్దిష్ట ప్రత్యేక వృత్తులు, ప్రదేశాలలో పనిచేయాలనే ప్రధాన నిబంధనను దెబ్బతీసింది. ఈ కేసులో శిక్ష ఖరారు జూలై చివరిలో జరగాల్సి ఉంది, ఇలాంటి పథకాలపై భవిష్యత్తులో జరిగే విచారణలకు ఈ కేసు ఒక నమూనాగా నిలుస్తుందని భావిస్తున్నారు పరిశీలకులు. నైపుణ్యం గల వలసదారులపై ఈ ప్రభావం ఎంతుంటుందంటే.. ఈ కేసు ఒక ఆందోళనకరమైన వైరుధ్యాన్ని ఎత్తి చూపుతుంది. ప్రభావితమైన కార్మికులలో చాలామంది ఉన్నత డిగ్రీలు, సాంకేతిక అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌లో ఏదో ఒక చోట స్థిరపడాలనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా కొందరు ప్రాథమిక తగిన శ్రద్ధను విస్మరిస్తున్నారు. వలస, దీర్ఘకాలిక స్థిరనివాసం కోసం ఉన్న ఆకాంక్షలను ఆసరాగా చేసుకుని, చట్టబద్ధమైన విద్యా అర్హతలను వక్రీకరించే మధ్యవర్తుల వల్ల ఈ బలహీనత మరింత తీవ్రమవుతోంది. వృత్తిపరమైన ఆశయాలను మోసానికి సాధనాలుగా మారుస్తున్నాయి. అధ్యాయం 4.. కేస్ స్టడీ నెం.2- నకిలీ డిగ్రీలు, భారత ఉన్నత విద్యా సంక్షోభం వీసా మోసానికి సమాంతరంగా, భారతదేశంలోని ఒక భారీ నకిలీ డిగ్రీల పరిశ్రమ నేరుగా అంతర్జాతీయ వలస మార్గాలకు ఆజ్యం పోస్తోంది. కేరళలోని చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త నెట్‌వర్క్ నుంచి సుమారు ల‌క్ష‌ నకిలీ అకడమిక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇది కేవలం అక్కడక్కడా జరిగే దురాచారం కాకుండా, ఒక పారిశ్రామిక స్థాయి కార్యకలాపాన్ని సూచిస్తోంది. ఈ వ్యవస్థలో, మానవ్ భారతి విశ్వవిద్యాలయంగా గుర్తించబడిన ఒకే సంస్థ, వివిధ విభాగాలలో సుమారు 36వేల‌ నకిలీ డిగ్రీలను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఏర్పాట్లలో, డిగ్రీలు వాస్తవంగా అంగ‌డి సరుకులుగా మారిపోతాయి. సాధారణంగా అవసరమయ్యే విద్యా ప్రక్రియలకు లోనుకాకుండా, కంప్యూటర్ సైన్స్ వంటి ఎక్కువ‌ డిమాండ్ గ‌ల‌ రంగాలలో సర్టిఫికెట్లు పొందడానికి వ్యక్తులు ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తారు. దీని ఫలితంగా, ఎలాంటి వాస్తవ శిక్షణ లేదా అధ్యయనానికి సంబంధం లేని ధృవపత్రాలు కలిగిన నామమాత్రపు పట్టభద్రుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ లేబ‌ర్ మార్కెట్లను వక్రీకరిస్తోంది. మానవ వ‌న‌రులు, సామాజిక నష్టాలు ఎలా వ‌స్తాయో చూస్తే.. ఈ నకిలీ డిగ్రీల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సామాజిక పరిణామాలను కలిగి ఉంది. తమ పిల్లల భవిష్యత్ శ్రేయస్సుకు దోహదం చేసే చట్టబద్ధమైన విద్యా అవకాశాలని తాము విశ్వసించే వాటికి నిధులు సమకూర్చడానికి, కుటుంబాలు తరచుగా బంగారం, వెండితో సహా తమ ఆస్తులను అమ్మివేస్తాయి. కానీ, దానికి బదులుగా, వారు విలువలేని ధృవపత్రాలను పొందవచ్చు. ఇవి వారి పిల్లల వృత్తిపరమైన అవకాశాలను ప్రమాదంలో పడేస్తాయి మరియు వీసా లేదా ఉద్యోగ దరఖాస్తులలో అటువంటి పత్రాలను ఉపయోగించినట్లయితే వారిని చట్టపరమైన చిక్కుల్లో పడేస్తాయి. వ్యవస్థలో సుమారు ల‌క్ష ఫేక్ డిగ్రీలు చలామణిలో ఉన్నాయని అందుబాటులో ఉన్న డేటా నిర్ధారిస్తోంది. అయినప్పటికీ, రాజకీయ చర్చలలో కొన్నిసార్లు ఉదహరించే అత్యంత నిర్దిష్టమైన గణాంకాలను.. ఉదాహరణకు, కొంతమంది దరఖాస్తుదారులకు 90 శాతం తిరస్కరణ రేటు వంటివి జాగ్రత్తగా పరిగణించాలి. ఎందుకంటే, అవి స్వతంత్రంగా ధృవీకరించబడిన గణాంకాలపై కాకుండా పక్షపాత అంచనాలపై ఆధారపడి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, కనీస అంచనాలు కూడా ఈ సమస్య భారతీయ ఉన్నత విద్యపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, నిజమైన విద్యార్థులకు హాని చేస్తుందని, భారతీయ ధృవపత్రాలపై అంతర్జాతీయ పరిశీలనకు నేరుగా ఆజ్యం పోస్తుందని స్పష్టం చేస్తున్నాయి. సంస్థాగత నియంత్రణ సంస్కరణల ఆవశ్యకత ఎలాంటిదంటే, విద్యాపరమైన అవకతవకలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సంస్థలపై కఠినమైన విచారణ జరపాల్సిన అవసరాన్ని మానవ్ భారతి కేసు నొక్కి చెబుతోంది. మోసపూరిత కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టేలా విద్యార్థుల తర్వాతి గ్రూపులు మోసపోకుండా చూసేందుకు, మెరుగైన పర్యవేక్షణ, పారదర్శక గుర్తింపు, పటిష్టమైన అమలు యంత్రాంగాలు అత్యంత కీలకం. ఇటువంటి సంస్కరణలు లేకుండా, ప్రతిష్టకు కలిగే నష్టం కేవలం వ్యక్తిగత విశ్వవిద్యాలయాలకే పరిమితం కాకుండా, విస్తృత భారతీయ విద్యా వ్యవస్థకు విదేశాలలో ఉన్న భారతీయ నిపుణులకు కూడా విస్తరిస్తుంది. అధ్యాయం 5.. కేస్ స్టడీ నెం.3.. భారత సంతతికి చెందిన ఒక సీఈవో పౌరసత్వ రద్దు ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే, న్యూజెర్సీకి చెందిన భారత సంతతికి చెందిన ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌పై జరుగుతున్న పౌరసత్వ రద్దు విచారణ. అధికారిక పత్రాలలో ఇతనిని నీరజ్ శర్మగా గుర్తించారు. ఒక స్టాఫింగ్ కంపెనీ అధిపతిగా.. ఇతను నకిలీ బ్యాంకు పత్రాలు, తప్పుడు ఎగ్జిక్యూటివ్ సంతకంతో పదకొండు మోసపూరిత హెచ్ 1బి పిటిషన్లను దాఖలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆధారంగా, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అతని అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి విచారణను ప్రారంభించింది. ఈ మోసపూరిత హెచ్ 1బి ఫైలింగ్‌లలో తన పాత్రను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, ఆ వ్యక్తి పౌరసత్వం పొందారన్నదే ప్రధాన ఆరోపణ. పౌరసత్వం పొందాలంటే, దరఖాస్తుదారులు మంచి నైతిక ప్రవర్తనను సంబంధిత వివరాలను నిజాయితీగా వెల్లడించడాన్ని నిరూపించాల్సి ఉంటుంది. కాబట్టి, ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ నేరాలను దాచిపెట్టినట్లు రుజువైతే, అసలు పౌరసత్వ మంజూరు చెల్లనిదిగా మారవచ్చు. పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చట్టపరమైన పరిమితి ఎలా ఉంటుందంటే, పౌరసత్వ రద్దు అనేది అమెరికా చట్టంలో ఒక అసాధారణమైన చర్య. పౌరసత్వాన్ని చట్టవిరుద్ధంగా లేదా ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం ద్వారా పొందారని నిరూపించడానికి, ప్రభుత్వం సాధారణంగా ఒక ఫెడరల్ న్యాయమూర్తి ముందు బలమైన సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంటుంది. సాధారణ పౌరసత్వ మార్గాలలో తరచుగా సంవత్సరాల తరబడి చట్టబద్ధమైన శాశ్వత నివాసం, ఆ తర్వాత దరఖాస్తు, వ్యక్తిగత ఇంటర్వ్యూ లు ఉంటాయి. ఇది తుది నిర్ణయం అనే బలమైన భావనను కలిగిస్తాయి. ఆ హోదాను రద్దు చేయాలంటే, దరఖాస్తుదారుడి ప్రాథమిక అర్హత తీవ్రంగా దెబ్బతిన్నదని స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. పౌరసత్వ రద్దు అనేది వ్యక్తి యొక్క జాతీయత గురించి సంక్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా మంది వలసదారులు అమెరికా పౌరసత్వం పొందే ప్రక్రియలో భాగంగా, తాము పుట్టిన దేశంలోని పౌరసత్వ హోదాను వదులుకుంటారు. లేదా, సవరించుకుంటారు. పర్యవసానంగా, అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ చర్యకైనా, నిస్సహాయ స్థితిని నివారించడానికి, దేశ బహిష్కరణను ఎదుర్కోవడానికి ఆ వ్యక్తి యొక్క స్వదేశంతో సమన్వయం అవసరం కావచ్చు. అందువల్ల, శర్మ కేసు కేవలం వ్యక్తిగత పరిణామాలనే కాకుండా.. పౌరసత్వ ప్రక్రియలో మోసపూరిత ప్రవర్తన వల్ల ఉత్పన్నమయ్యే దౌత్యపరమైన, చట్టపరమైన సంక్లిష్టతను కూడా వివరిస్తుంది. 6వ అధ్యాయం.. వ్యవస్థాగత పరిణామాలు, విధాన వ్యతిరేకత, హెచ్ 1బి భవిష్యత్తు ఇలాంటి మోసపూరిత కేసుల పెరుగుదల హెచ్ 1బి కార్యక్రమం నిర్మాణాత్మకంగా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందనే విస్తృత రాజకీయ కథనానికి దోహదపడింది. ఈ కథనంలో భాగంగా, కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి, సమీక్షించడానికి అవసరమైన విరామంగా చెబుతూ, కొత్త హెచ్ 1బి జారీలను మూడేళ్లపాటు నిలిపివేయాలని యు.ఎస్. కాంగ్రెస్‌లో పిలుపులు విన‌ వ‌చ్చాయి. అలాంటి తాత్కాలిక నిషేధం ఇంకా చట్టంగా మారనప్పటికీ, ఈ ప్రతిపాదన ప్రస్తుత అమలు, సమ్మతి యంత్రాంగాలపై విశ్వాసం గణనీయంగా సన్నగిల్లిందని సూచిస్తోంది. తక్షణమే.. అందుబాటులో ఉన్న స్లాట్‌లు దాదాపుగా అయిపోయాయని సూచనలు ఉండటంతో, హెచ్ 1బి వీసాల సంఖ్య అత్యంత పరిమితమైంది. కొన్ని సందర్భాల్లో ప్రతిపాదించిన సుమారు ల‌క్ష డాల‌ర్ల‌ అదనపు ఫీజును ఒక న్యాయ నిర్ణయం తిరస్కరించినప్పటికీ, విధానం మొత్తం దిశ కఠినమైన పరిశీలన, మరింత దూకుడుగా అమలు చేయడం, నిర్మాణాత్మక సంస్కరణ, లేదా తాత్కాలిక నిలిపివేత అవకాశాల వైపు ఉంది. యజమానులు, మధ్యవర్తులు ఇద్దరికీ చేరాల్సిన‌ సందేశం ఎంతో స్పష్టంగా ఉంది. హెచ్ 1బి కాంట్రాక్టర్లను నియమించడానికి మోసపూరిత, లేదా సరిహద్దు పద్ధతులను ఉపయోగించుకునే శకం ముగింపు దశకు చేరుకుంటోంది. నేర విచారణలు, పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రయత్నాలు, శాసనపరమైన సంస్కరణల కలయిక.. వీసా వ్యవస్థను నిజమైన నిపుణుల కోసం ఉద్దేశించిన ఒక నియంత్రిత మార్గంగా కాకుండా, ఆదాయాన్ని ఆర్జించే ఒక దందాగా పరిగణించే ఏ ప్రయత్నంతోనైనా ముడిపడి ఉన్న ప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అదే సమయంలో, బాధ్యతాయుతమైన దరఖాస్తుదారులు, చట్టబద్ధమైన యజమానులు, సాపేక్షంగా కొద్దిమంది వ్యక్తుల దుష్ప్రవర్తన కారణంగా పరువుకు భంగం క‌ల‌గ‌డం, విధానపరమైన వ్యతిరేకత వంటి పరోక్ష నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆదర్శ అల్పసంఖ్యాక వర్గంగా విస్తృతంగా పరిగణించిన భారతీయ విద్యార్థులు, నిపుణులు, ఇప్పుడు ఉన్నత స్థాయి మోసాల కేసులు.. విస్తృత ప్రవాస భారతీయులందరిపై నీందను వేస్తున్న ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి పారదర్శకమైన నిబంధనల పాటింపు, స్వీకరించే దేశాలు రెండింటిలోనూ సంస్థాగత సంస్కరణలు, విజయానికి సత్వర మార్గాలను సమష్టిగా తిరస్కరించడం అవసరం. అధ్యాయం7.. ప్రామాణికప్రతిబింబాలు, విధాన సిఫార్సులు.. వలసదారులు, కుటుంబాల నైతిక బాధ్యత చర్చించిన కేసులు, చట్టపరమైన, నైతిక రాజీకి బదులుగా వేగవంతమైన విజయాన్ని వాగ్దానం చేసే పథకాలను ప్రతిఘటించాల్సిన కాబోయే వలసదారులు, వారి కుటుంబాల నైతిక బాధ్యతను నొక్కి చెబుతున్నాయి. మోసానికి వ్యక్తులు ప్రధాన సూత్రధారులు కానప్పటికీ, అనుమానాస్పద ఉద్యోగ ప్రతిపాదనలను అంగీకరించడం లేదా సందేహాస్పద డిగ్రీలను కొనుగోలు చేయడం వంటి అనుమానాస్పదంగా కనిపించే ఏర్పాట్లలో పాల్గొనడం, వలస వ్యవస్థలు- విద్యా అర్హతలపై నమ్మకం త‌గ్గ‌డానికి దోహదపడుతుంది. అందువల్ల.. కుటుంబాలు విద్య, వలస నిర్ణయాలను దీర్ఘకాలిక పెట్టుబడులుగా పరిగణించాల‌ని చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం సంస్థలు, మధ్యవర్తులు, యజమానుల గురించి క్షుణ్ణంగా విచారణ జరపాలి. కేవలం మాటల హామీలు, అధిక ఒత్తిడి కలిగించే ఏజెంట్లపై ఆధారపడకుండా, గుర్తింపును ధృవీకరించడం, ప్రభుత్వ రికార్డులను పరిశీలించడం, స్వతంత్ర సమీక్షలను సంప్రదించడం, విశ్వసనీయ నిపుణుల నుంచి సలహా తీసుకోవడం ఇందులో భాగంగా ఉంటుంది. విధానపరంగా, మోసానికి ఆస్కారం కల్పించే వ్యవస్థను పరిష్కరించే బాధ్యతను అమెరికా, భారత అధికారులు ఇద్దరూ పంచుకుంటారు. అమెరికాకు సంబంధించి, దీని అర్థం ఉద్యోగ నియామకాల పరిశీలనను మెరుగుపరచడం, హెచ్-1బి లాటరీ, తీర్పు ప్రక్రియలలో పారదర్శకతను పెంచడం, వలస, క్రిమినల్ న్యాయ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం. భారతదేశానికి, నకిలీ డిగ్రీల నెట్‌వర్క్‌లను నిర్మూలించడం, గుర్తింపు ప్రమాణాలను అమలు చేయడం- అర్హతలను వ్యాపార వస్తువులుగా మార్చే సంస్థలపై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంది. విశ్వవిద్యాలయాలు, సిబ్బందిని అందించే సంస్థలు, వృత్తిపరమైన సంఘాలు కూడా కనీస చట్టపరమైన అవసరాలకు మించి అంతర్గత నియమపాలన, నైతిక నియమాలను అవలంబించాలి. అనుబంధాల గురించి బహిరంగంగా వెల్లడించడం, నియామక పద్ధతులను ఆడిట్ చేయడం, ఇంట‌ర్న‌ల్ బ్యాడ్ బిహేవియ‌ర్ పై స్పష్టమైన ఆంక్షలు విధించడం వంటివి విదేశీ నియంత్రణ సంస్థలు, ఆతిథ్య సమాజాలలో విశ్వాసాన్ని తిరిగి పెంపొందించడానికి సహాయపడతాయి. 8వ అధ్యాయం.. మోబిలిటీ మార్గాలకు సమగ్రతను పునరుద్ధరించడం మోసపూరిత హెచ్ 1బి పథకాలు, నకిలీ డిగ్రీ నెట్‌వర్క్‌ల బండారం బయటపడటం, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రపంచవ్యాప్త మొబిలిటీకి కీలకమైన మలుపు. వీటిని పరిష్కరించకుండా వదిలేస్తే.. ఈ పద్ధతులు చట్టబద్ధమైన మార్గాలను అప్రతిష్టపాలు చేసేందుకు, నిజమైన ప్రతిభను అణగదొక్కడానికి, ఈ కార్యక్రమాలు సహాయం చేయడానికి రూపొందించిన వర్గాలకే హాని కలిగించే కఠినమైన విధానపరమైన చర్యలను ప్రేరేపించేందుకు దారితీస్తాయి. సుస్థిరమైన భవిష్యత్ మార్గానికి రెండు రకాల నిబద్ధత అవసరం. మోసానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవడం, పారదర్శకమైన, ప్రతిభ ఆధారిత వలస, విద్యా వ్యవస్థలకు పునరుద్ధరించిన మద్దతు ఇవ్వడం. ఆమోదయోగ్యమైన సత్వర మార్గాలు ఏవీ లేవని దృఢంగా చెప్పడం ద్వారా మాత్రమే, భాగస్వాములు హెచ్ 1బి కార్యక్రమం యొక్క సమగ్రతను, నైపుణ్యం, నిజాయితీ, పరస్పర విశ్వాసంపై ఆధారపడిన చలనశీలత అనే విస్తృత ఆదర్శాన్ని కాపాడగలరు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 14, 2026 1:13PM

MOVIE NEWS