political-news-img

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పరిపాలనా దక్షతతో, సత్వర నిర్ణయాలతో చెక్ పెట్టారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈ సున్నితమైన ఉదంతంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా బాధితుడి నివాసానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిబిఐకు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఈ వివాదానికి కుల రంగు అద్దే ప్రయత్నం చేస్తూ సామాజిక వర్గాల నేతలను కూడా రంగంలోకి దించారు. సాధారణంగా ఇలాంటి విషాద సమయాల్లో బాధితులకు మానవత్వంతో అండగా నిలవాలి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా, రాజకీయ మైలేజీ కోసం కులం కార్డును తెరపైకి తీసుకువచ్చింది. అంబటిరాంబాబు, తోట త్రిమూర్తులు, కొరసాల కన్నబాబు వంటి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలను సాయికృష్ణ విషయానికి కులం రంగు అద్ధి విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం పరిణామాలు చోటుచేసుకునే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌లో ఉన్నారు. అయినప్పటికీ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, . ప్రతిపక్షాలు ఈ కేసును సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు. వెంటనే.. ఎక్కడా రాజకీయ లేదా విమర్శలకు పోకుండా.. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పరస్పరం సంప్రదించుకుని బాధిత కుటుంబంలో నమ్మకాన్ని నింపేలా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ముందుగా స్థానిక కూటమి శాసనసభ్యుడిని సాయికృష్ణ ఇంటికి పంపారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తక్షణ స్పందన బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. జగన్ పరామర్శ ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే అంటే శుక్రవారం (జూన్ 19) దర్యాప్తు అధికారి దైవప్రసాద్ స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర చర్యల పట్ల సాయికృష్ణ కుటుంబ సభ్యులు పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సాయికృష్ణ వ్యవహారంలో పొలిటికల్ మైలేజీ పొందాలన్న వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ వివాదాన్ని చక్కదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి శాంతిభద్రతల విభాగంపై, ముఖ్యంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం అందాలన్న స్పష్టమైన సంకేతాలను పంపారు.

Publish Date: Jun 19, 2026 5:03PM

political-news-img

హైదరాబాద్‌లో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు! తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో సరికొత్త అధ్యాయానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. భాగ్యనగరంలో పార్టీ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ నూతన ఆఫీస్ కేంద్రంగానే ఇకపై తెలంగాణలో జనసేన తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ తన చేతుల మీదుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, అక్కడ కూడిన భారీ జనసందోహానికి, అభిమానులకు రెండు చేతులు జోడించి అభివాదం చేశారు. నూతన కార్యాలయ భవనంలో శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, వాస్తు పూజలు పూర్తి చేసిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కల్యాణ్ గృహప్రవేశం చేశారు. ఈ వేడుకలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, ముఖ్య నేతలు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసైనికుల రాకతో మణికొండ పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన.. ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా త్వరలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి, ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం చేయడానికి ఈ కార్యాలయం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. గతంలో కంటే భిన్నంగా, ఈ సారి తెలంగాణ రాజకీయాల్లో జనసేన చురుకైన పాత్ర పోషించబోతోందని ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. పవన్ కల్యాణ్ రాకతో తెలంగాణ జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో చేరికలు భారీగా పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

Publish Date: Jun 19, 2026 4:56PM

political-news-img

మల్కాజ్‌గిరి రౌడీలకు భయపడొద్దు.. మీ వెంటే ఉంటాం : కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. స్థానికంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ శ్రేణుల దూకుడుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అత్యంత ఘాటుగా స్పందించారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడుతున్న నాయకులకు ఆయన ముక్కుతాడు వేసేలా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మల్కాజ్‌గిరిలో కొందరు నాయకులు తామేదో పెద్ద గూండాలమని, రౌడీలమని విర్రవీగుతున్నారని, అలాంటి వారి ఆటలు సాగనివ్వబోమని కేటీఆర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గులాబీ సైనికులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత భావోద్వేగంగా భరోసా ఇచ్చారు. మల్కాజ్‌గిరి గడ్డపై రౌడీయిజం ప్రదర్శిస్తున్న నాయకుడికి గట్టి కౌంటర్ ఇస్తూ, నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా వందల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏ రౌడీ వచ్చినా కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తానే స్వయంగా మల్కాజ్‌గిరికి వస్తానని హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న అక్రమ కేసు పెట్టినా, తానే స్వయంగా ముందుండి వారిని విడిపించుకుంటానని క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అధికార బలంతో వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. ఈ పోరాటంలో పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క కార్యకర్తకు కొండంత అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇదే వేదికపై నుంచి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు. అడ్డగోలు మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. కేవలం 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మకమైన 420 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం దక్కించుకుని నేటికి ఏకంగా 900 రోజులు దాటిపోయిందని కీలక గణాంకాలను బయటపెట్టారు. 100 రోజుల గడువు కాస్తా 900 రోజులు దాటినా, ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 420 గ్యారంటీల అమలు ఇంకెప్పుడు చేస్తారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రులను కేటీఆర్ నిలదీశారు. ఈ అన్యాయమైన పాలనపై కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Publish Date: Jun 19, 2026 4:42PM

political-news-img

సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం

సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు.. ఉన్నతస్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం.. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సాయికృష్ణ అదృశ్యమైన ఉదంతంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన స్థానిక కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యం కేసుపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణను మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించామని, బాధ్యులెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సాయికృష్ణ తల్లిని ఓదార్చారు. పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు ఇలాంటి ఘటనలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. నవీన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన పాత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ, అది సాయికృష్ణ మృతదేహమేనంటూ కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న కుట్రలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా సాయికృష్ణ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సస్పెండైన కృష్ణలంక పోలీస్ అధికారితో పాటు కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై సమగ్ర విచారణ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి భరోసా ఇవ్వడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. రాబోయే రోజుల్లో విచారణాధికారులు సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదించి, నిందితులను కఠినంగా శిక్షిస్తారని బాధితులు, ప్రజలు ఆశిస్తున్నారు.

Publish Date: Jun 19, 2026 4:25PM

political-news-img

రేపు అన్నదాతల ఖాతాల్లో సుఖీభవ నిధులు

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా... కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇలా... అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

Publish Date: Jun 19, 2026 4:05PM

political-news-img

కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి.. ఇక అరెస్టేనా?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం కూటమి సిద్ధమైందని అంటున్నారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంతో గుడివాడ రాజకీయాలతో పాటు ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. నిజానికి కొడాలి నానిపై కేవలం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు మాత్రమే కాదు.. ఆర్థిక, శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గుడివాడ పరిధిలోనే సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలించారని, జగనన్న కాలనీల భూములను లెవెల్ చేసే ప్రక్రియలో కొందరు స్థానిక యువకుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను వాడుకుని భారీగా నిధుల బదిలీ జరిగిందని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మట్టి కుంభకోణంలోనూ, అలాగే.. గతంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన దాడుల కేసుల్లోనూ కొడాలి నానికి నేరుగా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసుల్లో కొందరిని అరెస్టు కూడా అయ్యారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. దీనితో పాటు మట్టి తవ్వకాలు, గుడివాడ తెలుగుదేశం కార్యాలయం దగ్ధం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై దాడి కేసులలో కూడా నానిని విచారించి.. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాసిక్యూషన్ ప్రక్రియ ద్వారా ఆయనపై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Publish Date: Jun 19, 2026 4:02PM

MOVIE NEWS