political-news-img

ఒమన్ గల్ఫ్ నౌకపై దాడి... విశాఖ వాసి మృతి

పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. సముద్ర భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తూ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే భారతీయ నావికా సిబ్బంది ఉన్న మూడు వేర్వేరు వాణిజ్య నౌకలపై దాడులు, ప్రమాదాలు జరగడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వరుస నౌకా ప్రమాదాల ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో మరణించిన ముగ్గురు భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి చెందిన ఒక ప్రతిభావంతుడైన మెరైన్ ఇంజినీర్ కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించడంతో తెలుగు రాష్ట్రంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఒమన్ గల్ఫ్ చమురు ట్యాంకర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆ విశాఖ వాసిని 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాలగా గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా సముద్ర ప్రయాణాల్లో అనుభవం గడించి, ఉన్నత హోదాలో పనిచేస్తున్న సురేష్ పట్నాల మరణవార్త వినగానే ఆయన కుటుంబ సభ్యులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. అన్నింటికంటే గుండెల్ని పిండేసే విషయం ఏమిటంటే, సరిగ్గా మరో కొన్ని రోజుల్లో అంటే జూన్ 24వ తేదీన ఆయన 15వ వివాహ వార్షికోత్సవం జరగాల్సి ఉంది. ఈ మధురమైన వేడుకను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన తరుణంలోనే, అంతలోనే కాలం ఈ రూపంలో ఘోరమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. సురేష్ పట్నాలకు భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. తండ్రి ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆయన మరణంతో విశాఖలోని వారి నివాస ప్రాంతంలో బంధువులు, స్థానికులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ అంతర్జాతీయ సముద్ర సంక్షోభం తాలూకు వివరాలను పరిశీలిస్తే, జూన్ 8వ తేదీన ఒమన్ ఆగ్నేయ తీర ప్రాంతంలో మొదట 'మారివెక్స్' అనే భారీ ట్యాంకర్‌కు సంబంధించిన భద్రతా సంఘటన చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న ఈ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది. అదృష్టవశాత్తూ, ఈ 'మారివెక్స్' నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నప్పటికీ, వారందరూ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందింది. అయితే, ఆ తర్వాతి రోజే అసలైన ఘోరం వెలుగుచూసింది. జూన్ 9, ஜున్ 10 తేదీల మధ్య అర్ధరాత్రి ఒమన్ తీర ప్రాంతంలో 'ఎంటీ సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకలో మొత్తం 24 మంది భారతీయ నావికా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంతర్జాతీయ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి అత్యంత సాహసోపేతంగా 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. కానీ, దురదృష్టవశాత్తూ సముద్రపు తీవ్రతకు లోనై ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, వారిలో విశాఖకు చెందిన సురేష్ పట్నాల ఒకరు. ఈ విషాదాన్ని భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ఉద్రిక్తతలు అక్కడితో ఆగకుండా జూన్ 11వ తేదీన 'ఎంటీ జల్వీర్ అనే మరో వాణిజ్య నౌకకు సంబంధించిన సముద్ర భద్రతా ఉల్లంఘన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ మూడో నౌకలోనూ 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో నౌకలోని సిబ్బంది అందరినీ అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే సంరక్షణ చర్యలు చేపట్టాయి. ఈ 'ఎంటీ జల్వీర్' ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. పశ్చిమ ఆసియా సముద్ర జలాల్లో వరుసగా జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నావికుల భద్రతను తీవ్ర ప్రశ్నార్థకంగా మార్చాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న మిగిలిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని, మరణించిన సురేష్ పట్నాల భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నం తరలించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Publish Date: Jun 11, 2026 7:31PM

political-news-img

దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది : సీఎం రేవంత్ రెడ్డి

దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగ‌ణ‌న త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్ లో ఆయ‌న వివ‌రించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవ‌స‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలన్నా, దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని గుర్తు చేశారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైస‌లు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలింద‌ని చెప్పారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా-నైపుణ్యాభివృద్ధి విప్లవం విద్యాశాఖను త‌న వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తన‌కు ఉన్న నమ్మకమేనని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. గడచిన 75 ఏండ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశామని, కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాలుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. తమ ప్ర‌భుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని ఆయ‌న అభిప్రాయపడ్డారు. కాగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా… అధికారులైనా తమ రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కూల్స్ చూడాలంటే తాము సంతోషంగా చూపిస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుంద‌న్నారు. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చే యడం తొలి విజయమని వివ‌రించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Publish Date: Jun 11, 2026 6:57PM

political-news-img

మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపిన భర్త అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, అరుణ్ కుమార్ బీహార్ నుంచి అక్రమంగా తుపాకీని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేయాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది నెలలుగా ప్రణాళిక రచించినట్లు విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం అరుణ్ కుమార్ పరారైనప్పటికీ, ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. కాగా, మూడు నెలల క్రితం కూడా తుపాకీతో హల్చల్ చేయడంతో అరుణ్ కుమార్‌ను అంబర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీ, హత్యకు దారితీసిన కారణాలు, ముందస్తు కుట్రకు సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నారు. మృతురాలు నిషారాణిని ఆమె భర్త అరుణ్ కుమారే అనుమానంతో కాల్చి చంపినట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు. భర్తతో పాటు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి, పిస్టల్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Publish Date: Jun 11, 2026 6:47PM

political-news-img

లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు...వాసుదేవ రెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు, కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లిక్కర్ రవాణా, సరఫరా వ్యవహారాల్లో భారీ స్థాయిలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దర్యాప్తులో భాగంగా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించిన అధికారులు, హవాలా మరియు మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా నిధుల బదిలీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆర్థిక మార్గాలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది వ్యక్తుల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై తుది నిజానిజాలు కోర్టు విచారణ పూర్తయ్యాక, దర్యాప్తు తుది నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.

Publish Date: Jun 11, 2026 6:35PM

political-news-img

బీజేపీ బిగ్ గేమ్...2028 టార్గెట్‌గా కమలనాథులు వేస్తున్న ప్లాన్ ఇదేనా!

దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 2028 లక్ష్యంగా బీజేపీ వేస్తున్న అడుగులు, వ్యూహాలు భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయి. మీడియాలో వినిపిస్తున్న లీకులు, గాసిప్స్ నిజమైతే, దేశ రాజకీయాల్లో అతిపెద్ద మార్పు తథ్యం. ముఖ్యంగా మమతా బెనర్జీ పార్టీకి చెందిన సుమారు 62 నుండి 64 మంది రెబల్స్ బీజేపీలో విలీనం కావడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం వీరు వేరే మార్గం లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి ఇప్పటికే నలుగురు రాజీనామా చేయగా, మరో ఏడుగురు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. సువేందు అధికారి, అమిత్ షా వంటి కీలక నేతల నేతృత్వంలో ఈ ‘బిగ్ గేమ్’ కొనసాగుతోంది. ఇక మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహాలు కూడా పదునుగా ఉన్నాయి. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలను కలిపి మొత్తం 9 లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శరద్ పవార్ రిటైర్మెంట్, అజిత్ పవార్ కన్నుమూత నేపథ్యంలో అక్కడ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, శివసేనలోనూ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 7 గురు ఎంపీలు షిండే మరియు ఫడ్నవీస్‌తో టచ్‌లోకి రావడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. సంజయ్ రౌత్ వ్యూహాలు ఏ మేరకు ఉద్ధవ్ వర్గానికి మేలు చేస్తాయో వేచి చూడాల్సిందే. ప్రధానమంత్రి స్వయంగా సీఎంలతో జరిపిన చర్చల్లో 2029 కంటే ముందుగానే అంటే 2028లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలివ్వడం, ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే, డీఎంకే వంటి పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. డీఎంకేకు లోక్‌సభలో 22, రాజ్యసభలో 10 సీట్లు ఉండటం వల్ల పార్లమెంటులో వారి పాత్ర కీలకం కానుంది. ఏపీలోని వైసీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ప్రస్తుతానికి స్వతంత్రంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను బట్టి ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ తన అంతర్గత లోపాలను సరిదిద్దుకుంటూ, జనాదరణ తక్కువగా ఉన్న నేతలను తొలగించి దూకుడుగా ఉన్న నాయకులను రంగంలోకి దింపే కసరత్తు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఆపదను గుర్తించి అప్రమత్తమవుతోంది. మొత్తం మీద, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.

Publish Date: Jun 11, 2026 6:17PM

political-news-img

తృణమూల్ లో తిరుగుబాటు.. మమతపై ఒత్తిడి

తాజా నివేదికల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ లో నిజంగానే పెద్ద స్థాయి తిరుగుబాటు కనిపిస్తోంది. 19 నుంచి 20 మంది ఎంపీలు ప్రత్యేక బ్లాక్ గా ఏర్పడి ఎన్డీయేకి మద్దతు ఇస్తారనే వార్తలు వచ్చాయి, అలాగే సాయోనీ ఘోష్ పేరు కూడా ఆ జాబితాల్లో ప్రస్తావించబడింది. అయితే ఈ చీలిక రాజకీయంగా ఎంత బలంగా కనిపించినా.. న్యాయపరంగా అది అంత సులభం కాదు యాంటీ డిఫెక్షన్ లా కింద ఇలాంటి ఎత్తుగడలు అనర్హత ప్రమాదాన్ని పూర్తిగా తొలగించవు. తృణమూల్ కాంగ్రెస్ ఒక వ్యక్తి ఆధారిత పార్టీగా ఎదిగింది. మమతా బెనర్జీ వ్యక్తిగత చరిష్మా, ఆందోళన రాజకీయాలు, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలపై ప్రతిఘటన ఆధారంగా ఆ పార్టీ నిలబడింది. అదే కారణంగా, పార్టీ అంతర్గత బలహీనత బయటపడినప్పుడు, ఆ ప్రభావం సాధారణ పార్టీలపై కంటీ కంటే ఎక్కువగా ఉంటుంది. బీబీసీ నివేదిక ప్రకారం.. ఇటీవల టీఎంసీ నాయకత్వంపై పెరుగుతున్న అనుమానాలు, అసంతృప్తి, శాసనసభ, పార్లమెంటరీ స్థాయిలో వర్గీకరణతో ప్రస్ఫుటంగా బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యం మరింత ప్రాధాన్యం పొందేది ఎందుకంటే టీఎంసీలో అసమ్మతి ఒక్కసారిగా పుట్టినది కాదు, అది ఎన్నికల పరాజయం, అభ్యంతరకరమైన నాయకత్వ నిర్వహణ, ఎవరు నిజమైన కేంద్ర శక్తి? అనే ప్రశ్నల నుండి ముదురుతూ వచ్చింది. పార్టీ రాజకీయ సంస్కృతి, అధినాయకత్వ శైలి, స్థానిక స్థాయిలో ఎదురయ్యే అసంతృప్తి.. మొత్తం ఇవన్నీ కలిసే.. ఈ సంక్షోభానికి దారి తీశాయి. తాజా రిపోర్టుల ప్రకారం, 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం టీఎంసీలో మొదట ఎమ్మెల్యే స్థాయిలో, ఆ తర్వాత ఎంపీ స్థాయిలో అసంతృప్తి పెరిగింది. ఆ క్రమంలో కకోలి ఘోష్ దస్తిదార్ నాయకత్వంలో 19 నుంచి 20 మంది లోక్సభ ఎంపీలు విడి బ్లాక్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారన్న కథనం వెలువడింది. అదే సమయంలో, 2026 జూన్ 9, 10 తేదీల్లో సోనియా గాంధీ మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి, అభిషేక్ బెనర్జీకి కీలక జాతీయ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మమతా బెనర్జీ ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించలేదనీ, ఆలోచించేందుకు సమయం కోరినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక్కడ అసలు విషయముంటంటు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. ది ప్రింట్ విశ్లేషణ ప్రకారం.. 20 మంది ఎంపీలు మాకు టూ ధర్డ్స్ మెజారిటీ ఉంది అని చెప్పడం మాత్రమే చట్టపరంగా రక్షణ కాదు. పార్టీకి అధికారిక విలీనం లేకుండా, కేవలం సెపరేట్ బ్లాక్ గా నిలబడడం అనర్హత వేటు ప్రమాదాన్ని తొలగించదు. అదే నివేదికలో లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి, , సీనియర్ అడ్వకేట్ సౌరభ్ క్రిపాల్ అభిప్రాయాల ద్వారా ఒక ముఖ్యమైన పాయింట్ ను బలంగా ముందుకు తీసుకువచ్చింది. చీలిక అనే కాన్సెప్ట్ ను యాంటీ డిఫెక్షన్ లా నుంచి డెలిబరేట్ గా తొలగించారు; మిగిలింది విలీనం మాత్రమే. అంటే.. ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు గుంపుగా మారడం వేరు.. పార్టీ సంస్థాగతంగా మరో పార్టీలో కలవడం వేరు. ఇదే ఈ వ్యవహారంలో చట్టం వర్సెస్ రాజకీయ బలం మధ్య ఉన్న అసలు యుద్ధం. ఇక రాజకీయంగా చూస్తే.. ఈ పరిణామం మమతా బెనర్జీకి రెండు వైపుల నుంచి సంక్షోభం తెస్తోంది. ఒకవైపు పార్టీల క్రమశిక్షణ క్షీణించడం.. మరోవైపు ప్రతిపక్ష శిబిరంలో ఆమెకు ప్రత్యామ్నాయంగా పెద్ద నాయకురాలు అనే స్థానం కోసం పునఃచర్చ మొదలవడం. టీఎంసీలోని కొందరు ఎంపీలు ఎన్డీయే కి మద్దతు ఇస్తారన్న వార్తలు.. కాంగ్రెస్ తో మమతా బెనర్జీ సంబంధాల గురించి వస్తున్న గుసగుసలు ఇవన్నీ ఆమెను వ్యూహాత్మకంగా ఒంటరిని చేసే ప్రమాదం ముంచుకువస్తోందన్న భావన కలిగిస్తున్నాయి. సాయోనీ ఘోష్ పేరు ఈ కథనాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడటం గమనార్హం. ఆమె పార్టీకి అత్యంత శబ్దాత్మక, ఫైర్ బ్రాండ్ గా కనిపించిన యువ ముఖాల్లో సాయోనీ ఘోష్ఒకరు. అలాంటి నాయకురాలు అసంతృప్తి వర్గంలో చేరితే.. అది పోస్టర్ రాజకీయాలు కాదు, బలపడిన అంతర్గత విభేదాల సంకేతం. పార్టీ తమను కాపాడలేదన్న భావన, ప్రచార సమయంలో ఒంటరిగా మిగిలిపోయానన్న ఆరోపణలు, రాజకీయ గాయాల్ని మరింత లోతు చేస్తున్నాయి. మీడియా ఈ పరిణామాన్ని సహజంగానే మమతా యుగానికి అంతం? అన్నట్లుగా చూపిస్తోంది, కానీ.. అసలు విషయం అంతకంటే సంక్లిష్టం. ఒక వైపు, బలమైన నాయకురాలిపై తిరుగుబాటు అన్న కథనం ప్రజల ఆసక్తిని ఆకర్షిస్తోంది. మరోవైపు, వార్తాకథనాల్లో ఉపయోగించిన అభిజ్ణ వర్గాల సమాచారం, విశ్వసనీయంగా తెలుస్తోంది, వంటి పదాలు అనేక అంశాలు ఇంకా ధృవీకరణ దశలోనే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. సామాజికంగా ఇది బెంగాల్ రాజకీయాల్లో పాత వర్గాల పునరుజ్జీవనాన్ని సూచిస్తున్నది. నాయకుని చుట్టూ పార్టీ, పార్టీ చుట్టూ ప్రయోజనం, ప్రయోజనం చుట్టూ వర్గం. ప్రజలకు ఇది అసలు కొత్త కథ కాదు.. కానీ టీఎంసీ లాంటి వ్యక్తి కేంద్రీకృత పార్టీలో ఇది బయటపడినప్పుడు ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఈ పరిణామం తక్షణం మూడు ప్రభావాలు చూపే అవకాశం ఉంది. మొదట, పార్లమెంటులో టీఎంసీ అంతర్గత క్రమశిక్షణ బలహీనమైతే.. పార్టీ జాతీయ ప్రతిపక్ష పాత్ర దెబ్బతింటుంది. రెండోది.. సోనియా గాంధీ ఆఫర్ నిజమైతే, కాంగ్రెస్, టీఎంసీ మధ్య భవిష్యత్ వ్యూహాత్మక అవగాహనకు ఇది సిగ్నల్ కావచ్చు. మూడోది యాంటీ డిఫెక్షన్ లా చుట్టూ మరోసారి దేశవ్యాప్త చట్టపరమైన చర్చ మొదలయ్యే అవకాశం. అయితే 20 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి టీఎంసీ చీలిపోయినట్లు.. అన్న వాదన సరిపోదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, సంఖ్యలపై కూడా స్పష్టత లేదు. కొందరు 16 మంది అంటున్నారు, మరికొందరు 20 అంటున్నారు, పార్టీ వర్గాలు మాత్రం ఈ సంఖ్యను తిరస్కరిస్తున్నాయి. అందువల్ల ఈ వ్యవహారాన్ని తుది తీర్పు లాగా కాదు, కొనసాగుతున్న రాజకీయ, చట్టపరమైన క్రీడగా చూడాలి. నిజాన్ని నేరుగా చెప్పాలంటే, మమతా బెనర్జీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిన్న కుదుపు కాదు.. ఇది ఆమె రాజకీయ నిర్మాణం లోపలినుంచి పగలుతున్న సంకేతం. అయితే అదే సమయంలో, ఈరెబలియన్ పూర్తిగా చట్టబద్ధమైన చీలికగా గా మారిందని ఇప్పటికీ చెప్పలేం. రాజకీయంగా ఇది బీభత్సం.. న్యాయంగా ఇది ఇంకా వివాదాస్పదం. కాంగ్రెస్ ఆఫర్ వార్తలు నిజమైతే.. అది మమతను తిప్పికొట్టే రాజకీయ బ్రీఫింగ్ కాదు, ప్రతిపక్షంలో కొత్త శక్తి కేంద్రీకరణకు ప్రయత్నం. కానీ మమతా బెనర్జీ లాంటి నాయకురాలు ఇలాంటి ఆఫర్లకు సులభంగా లోబడే వ్యక్తి కాదన్న చరిత్ర కూడా గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ వ్యవహారం “ఎవరు ఎవరిలో కలుస్తారు” అనే ప్రశ్న కన్నా, “ఎవరు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించరు” అనే ప్రశ్నగా చూడాలి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 11, 2026 5:48PM

MOVIE NEWS