Top Stories

political-news-img

నిరాహార దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.!

నీట్ పేపర్ లీక్ కు నిరసనగా గత 26 రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించారు. పరీక్షల వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన, జవాబుదారీతనం కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లిఖిత పూర్వక హామీలే కారణం. విద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది. గురుగ్రామ్‌ మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా కలిసి కేంద్ర ప్రభుత్వం తరఫున హామీల పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ.. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వాంగ్‌చుక్ బృందం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది. మౌఖిక ప్రకటనలు లేదా మాటలకు పరిమితం కాకుండా, స్పష్టమైన లిఖితపూర్వక భరోసా ఇస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ ఆ బృందానికి విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లిఖిత పూర్వకంగా రావడంతో దీక్ష విరమించినట్లు ఆయన తెలిపారు. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటంటే.. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఘటనతో పాటు దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, అక్రమాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యల అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చిచడం, పేపర్ లీక్ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం, ఉన్న కేసులను ఎత్తివేయడం. ఈ మూడు హామీలతో సోనమ్ వాంగ్చుక్ నిరశన దిక్ష విరమించారు. కేంద్ర హామీలకు తోడు.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరశన దీక్ష విరమించాలని చేసిన విజ్ణప్తులు కూడా తన దీక్ష విరమణకు కారణమని ఆయన తెలిపారు. తన పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అంతేకాకుండా, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, భవిష్యత్తులో దేశంలో ఎలాంటి పోటీ పరీక్షల్లోనూ ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మరోసారి దేశానికి భరోసా ఇచ్చారు. NEET UG 2026 paper leak, Central government assurances, JP Nadda Jitendra Singh Medanta

Publish Date: Jul 24, 2026 10:00AM

political-news-img

మోడీ హామీని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కాక్రోచ్ జనతా పార్టీ.!

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. దీంతో ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన ప్రధాని మోడీ.. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై సర్వత్రా చెదిరిపోయిన నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు, లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అయితే ప్రధాని హామీని, ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్న యువత నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది. విద్యార్థుల సమస్యలపై చర్చలు, ప్రభుత్వ అధికారిక భవనాలు లేదా ప్రదేశాల్లో కాకుండా, జంతర్ మంతర్ వేదికగా జరగాలని సీజేపీ స్పష్టం చేసింది. అలాగే శుక్రవారం (జులై 24) దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీజేపీ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా బలగాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామనీ ప్రభుత్వం హెచ్చరించింది. అదలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఆరోపణల నిజాయితీనే ప్రశ్నిస్తూ బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ.. నీట్ లీకేజీపై ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో ప్రకటన దయనీయంగా ఉందనీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రవెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, అలియా భట్, గ్లో పాప్ ఐకాన్ దిల్జీత్ దొసాంజ్, దక్షిణాది దిగ్గజ నటులు కమల్ హాసన్, ఆర్. మాధవన్, విజయ్ సేతుపతి వంటి వారు విద్యార్థులకు బాసటగా గళమెత్తారు. NEET paper leak controversy, CJP protest NEET, PM Modi fast track courts

Publish Date: Jul 24, 2026 9:21AM

political-news-img

వంద డాలర్లకు చేరువైన బ్యారల్ ముడి చమురు ధర.. చమురు మంటలు ఆగేదెన్నడు?

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ముడి చమురు ధరలకు మంట పెట్టాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతుండటం, చమురు ట్యాంకర్లపై దాడులు కారణంగా ముడి చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా ఇరాన్‌పై వరుసగా 13 రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది. హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది. ప్రపంచ సముద్ర రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా, ఇరాన్ ముఖాముఖి సైనిక ఘర్షణలకు తోడు మరో కీలకమైన సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ సమీపంలో హౌతీలువిరుచుకుపడుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను వెంటనే ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌతీలను ఇరాన్ ప్రాక్సీ గ్రూప్‌గా అభివర్ణించిన ఆయన.. హౌతీల విధ్వంసక చర్యలకు ఇరాన్‌నే బాధ్యులను చేస్తామని కుండబద్దలు కొట్టారు. దాడుల్లో దెబ్బతిన్న నౌకలకు, నష్టపోయిన సరుకులకు పరిహారంగా అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ సీజ్డ్ నిధులను ఉపయోగిస్తామని ప్రకటించారు. అదలా ఉంటే.. ఈ వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అత్యవసర శాంతి చర్చల ప్రయత్నాల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Strait of Hormuz tensions, Crude oil price near 100, US Iran conflict, Bab el Mandeb attack

Publish Date: Jul 24, 2026 9:05AM

political-news-img

బేబీ బాస్ వరల్డ్ రికార్డు.!

క్రికెట్ లో బేబీ బాస్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు. పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికట్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలోనూ సిక్సర్లు బాదినా భారీ స్కోరు చేయడంలో విఫలమై నిరాశ పరిచిన ఈ కుర్రోడు.. జింబాబ్వేపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తిరగరాసిన వరల్డ్ రికార్డులు ఏమిటంటే.. టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్.. ఇంతకు ముందు ఈ రికార్డు లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. అయితే పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు ఆఫ్ఘ‌నిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్‌లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. Vaibhav Suryavamshi world record, Zimbabwe, t20match, Halfcentury

Publish Date: Jul 24, 2026 8:45AM

political-news-img

2027 WTC ఫైనల్ తేదీలు వచ్చేసాయి లార్డ్స్‌కు ఐసీసీ షాక్.. కొత్త వెన్యూ ఏదంటే?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక భారీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. టెస్ట్ క్రికెట్ విభాగంలో శ్రేష్ఠమైన జట్టును తేల్చే ఈ మహా సంగ్రామం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2027 WTC ఫైనల్ పోరు తేదీలు మరియు మైదానం వివరాలను ఐసీసీ అధికారికంగా ధ్రువీకరించింది. 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు ఈ ప్రతిష్టాత్మక తుది పోరు జరగనుండగా, వరుసగా నాలుగోసారి కూడా ఈ గ్రాండ్ ఫైనల్‌కు ఇంగ్లాండే వేదికగా నిలవడం గమనార్హం. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2027 ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, అలాగే ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రసిద్ధ యాషెస్ సిరీస్ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు ఈ బిగ్ ఫైనల్ నిర్వహించబోతున్నారు. అయితే, ఈ సారి ఐసీసీ తీసుకున్న నిర్ణయంలో ఒక ఊహించని సంచలన మలుపు చోటుచేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో 'మక్కా'గా ఎంతో పేరుగాంచిన లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ (Lord's) మైదానానికి ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆతిథ్య హక్కులు దక్కలేదు. గతంలో లార్డ్స్ పిచ్‌పై వచ్చిన అనేక రకాల విమర్శలు, సాంకేతికపరమైన ఆందోళనల దృష్ట్యా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని లార్డ్స్‌ను పక్కనబెట్టింది. లార్డ్స్ స్థానంలో లండన్‌లోని మరొక ప్రసిద్ధ స్టేడియం అయిన 'ది ఓవల్' (The Oval) మైదానాన్ని ఈ బిగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఈ నిర్ణయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను రెండుసార్లు నిర్వహించిన ప్రపంచంలోనే మొదటి మైదానంగా ది ఓవల్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. గతంలో 2023 WTC ఫైనల్ కూడా ఇదే ది ఓవల్ మైదానంలో జరగ్గా, ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన WTC ఫైనల్స్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి ప్రథమ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2023లో ది ఓవల్‌లో జరిగిన రెండో ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఇక 2025లో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో ఫైనల్ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా జట్టు సంచలన రీతిలో విజేతగా నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న డబ్ల్యూటీసీ 2025–27 పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లే మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, టీమిండియా ఫైనల్ రేసులో నిలవడం కాస్త కష్టతరంగా కనిపించినప్పటికీ, రాబోయే 9 నెలల్లో జరగబోయే పలు టెస్ట్ సిరీస్‌ల ఫలితాలతో పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. icc shifts 2027 wtc final from lords to oval,wtc final 2027 england oval schedule,wtc 2027 final match dates icc update

Publish Date: Jul 24, 2026 8:38AM

MOVIE NEWS