Top Stories

political-news-img

జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్..!

హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో జిమ్ ట్రైనర్లు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ప్రధాన నిందితులైన బట్టే శివ (32), మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ (28) లతో పాటు మహమ్మద్ సైఫ్ అలియాస్ మహమ్మద్ ఎహ్సాన్ ఉల్హక్ (20), ఫర్జాన్ ఖాన్ (20), మహమ్మద్ యూసుఫ్ (26), సోంభట్టిని అభిలాష్ (24) ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరంతా జిమ్‌కు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని "త్వరగా కండరాలు పెరుగుతాయి, బాడీ బిల్డింగ్ వేగంగా జరుగుతుంది" అంటూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ సప్లిమెంట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు బట్టే శివ గతంలో 'ఐరన్ హౌస్ జిమ్' యజమాని, ట్రైనర్‌గా పనిచేసినట్లు తేలింది. ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా ఉంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్ నిర్వహిస్తున్న 'మెడ్‌హౌస్ ఫార్మా' ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి మహమ్మద్ యూసుఫ్, సోంభట్టిని అభిలాష్‌లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్ పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ వేదిక ద్వారా స్టెరాయిడ్లు, బాడీ సప్లిమెంట్లు తెప్పించి మహమ్మద్ సైఫ్, ఫర్జాన్ ఖాన్‌లకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దాడుల్లో 440 టెర్మిన్ (నియాన్) వయల్స్, 336 మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు, సొమాట్రోపిన్, డ్రోస్టానోలోన్, ఇతర బాడీ సప్లిమెంట్లు, 336 టాబ్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు. ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా స్టెరాయిడ్లు సరఫరా అవుతున్నట్లు, అలాగే వైద్యుల ప్రిస్క్రిప్షన్లను కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీగా తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ జిమ్ యజమానులు, ట్రైనర్లు, యువతకు హెచ్చరిక జారీ చేశారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు, ఇతర బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లను వినియోగించవద్దని సూచించారు. తాత్కాలికంగా కండరాలు పెరిగినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలోని జిమ్‌లపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం వ్యక్తం చేశారు

Publish Date: Jul 4, 2026 7:55PM

political-news-img

అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు..! : సీఎం చంద్రబాబు

ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగుచేస్తున్న భూములకు అధికారిక హక్కు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 61 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా గ్రామస్థులను వేధిస్తున్న భూ సమస్యను సమగ్ర రికార్డుల పరిశీలన, వివిధ కోణాల్లో అధ్యయనం చేసి పరిష్కరించినట్లు తెలిపారు. అడవి పొరంబోకు భూమిని అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుని రైతులకు భూములు అందించినట్లు చెప్పారు. పేదలకు పట్టాల పంపిణీ సంతోషంగా ఉంది.. రైతుల పక్షాన న్యాయం ఉండటంతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగామని పేర్కొన్న సీఎం, 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిని పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ, భూ సమస్యలు ఉన్నాయని, ఇటీవల శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కూడా పరిష్కరించామని, ఇప్పుడు కంగుంది సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. గూండాయిజానికి తావులేదు.. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ వివాదాలు సృష్టించారని ఆరోపించిన సీఎం, ప్రజల పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫొటోలు ముద్రించారని విమర్శించారు. వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా కూడా అనేక భూములు వివాదాస్పదమవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, సోదరీమణుల హక్కులను గౌరవించాలని సూచించారు. రౌడీయిజం, గుండాయిజానికి రాష్ట్రంలో తావులేదని స్పష్టం చేసిన ఆయన, పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తీసుకొస్తున్నామని, కుప్పంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కుప్పాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని ఆపలేరు... అడ్డుకోలేరు.. ‘కుప్పం ప్రజలంతా సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్య మివ్వాలనీ సీఎం అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం బదులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ సైకిళ్లు, ఈ వెహికల్స్ వినియోగం పెంచాలనీ సూచించారు. నెట్ జీరో విధానంలో స్వచ్ఛ కుప్పం-స్వర్ణ కుప్పం సాధించాలనీ పిలుపు నిచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రొత్సహిస్తున్నామని.. ఇప్పటికే 1.50 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. డ్వాక్రా మహిళా ఉత్పత్తుల కోసం స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశామని..దీని ద్వారా అంతర్జాతీయ స్థాయికి డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ వచ్చేలా చేస్తామని తెలిపారు. కుప్పం పొగురుపల్లిలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. గత పాలనలో రాష్ట్రానికున్న బ్రాండ్ పొగొట్టారనీ.. పరిశ్రమలను వెళ్లగొట్టారు. కానీ ఈ రెండేళ్ల కాలంలో పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారనీ సీఎం ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jul 4, 2026 7:47PM

political-news-img

ప్రశ్న రావణ్‌కు బెయిల్.. న్యాయవాదితో కలిసి ఇంటికి..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్‌కు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి కోర్టు ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు జోసెఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే జోసెఫ్ తన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌తో కలిసి జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయప్రక్రియ పూర్తి కావడంతో ఆయన నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అనుచరులు కోర్టు ప్రాంగణం వెలుపల హర్షం వ్యక్తం చేశారు. అయితే జోసెఫ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వేర్వేరు జిల్లాల్లోని నాలుగు న్యాయస్థానాలు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. వరుస కేసుల నమోదుపై జోసెఫ్ తరఫు న్యాయ బృందం కోర్టుల్లో గట్టిగానే పోరాడుతోంది. ఈ అరెస్టుల పర్వం మరియు పోలీసుల తీరుపై జోసెఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదంటూ కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నేతల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు జోసెఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. తన అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణాలు, పోలీసుల విచారణ విధానం మరియు భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు జోసెఫ్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే పత్రికా విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) ఏర్పాటు చేసి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కోర్టుల ద్వారా బెయిల్ పొందినప్పటికీ, మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది మరియు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Jul 4, 2026 7:38PM

political-news-img

కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి..!

సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నాడు స్థానిక ప్రజలు నాటిన చిన్న మొక్కే, నేడు రాష్ట్రంలో ఒక మహా వృక్షంగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 2006 జూలై 4వ తేదీన మిడ్జిల్ ప్రాంత ప్రజలు అందించిన ఆశీస్సులే తనను ఈ స్థాయికి చేర్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటూ, నాటి పాలమూరు జిల్లా వెనుకబాటుతనాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతం తీవ్రమైన కరువుతో, 'డార్క్ మండలాలు'గా వర్గీకరించబడి ఉండేదని వివరించారు. తాను స్థానికేతరుడైనప్పటికీ కేవలం నమ్మకంతోనే నాటి ఎన్నికల్లో స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించి, తన ఎదుగుదలకు పునాది వేసిన మిడ్జిల్, కల్వకుర్తి ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. పాలమూరు మట్టి గొప్పతనాన్ని వివరిస్తూ నాటి హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి మహామహులు ఈ గడ్డపై నుంచే దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే వెనుకబడిన మిడ్జిల్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే ఈ మండలాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించాలని సభాముఖంగానే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సీఎం కోరారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో పేదలకు సొంత ఇళ్లు ఇవ్వకుండా గాలికొదిలేశారని, తమ పాలనలో ప్రతి గ్రామంలో 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించి పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని వివరించారు. గత పాలకుల హయాంలో జరిగిన దోపిడీ వల్లే రాష్ట్ర అప్పులు రూ. 70 వేల కోట్ల నుండి ఏకంగా రూ. 8.50 లక్షల కోట్లకు చేరాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులకు వేల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ వంటి ప్రజా గాయకుడిని సైతం నాటి దొరలు గడీల ముందు గంటల తరబడి నిలబెట్టి అవమానించారని మండిపడ్డారు. ఈ కృతజ్ఞత సభ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ స్వతంత్ర జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి కెరీర్ గ్రాఫ్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్వయంగా ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం, డిప్యూటీ సీఎం దత్తత అంశాన్ని ప్రస్తావించడంతో రాబోయే రోజుల్లో మిడ్జిల్ మండలానికి కొత్త నిధులు, మౌలిక వసతులు సమకూరుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Jul 4, 2026 7:26PM

political-news-img

టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!

చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..! మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఎంతో కాలంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌తో అతను భారత జట్టు తరఫున సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం భారత్‌కు మొదటి సానుకూల అంశంగా మారింది. రెండో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేతుల మీదుగా తన డెబ్యూ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ ఘనతతో కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై సెలెక్టర్లు చివరకు వేటు వేశారు. అతని పేలవ ఫామ్ కారణంగా జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. సంజు శాంసన్ స్థానంలోనే యువ రక్తం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం కల్పించారు. వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడంపై క్రీడా విశ్లేషకులు మరియు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడు, అంతర్జాతీయ వేదికపై కూడా అదే స్థాయి ప్రదర్శనను పునరావృతం చేస్తాడని మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంజు స్థానంలో వచ్చిన వైభవ్ తన అందివచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబె, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేరుస్తాడని, భవిష్యత్ టీమిండియా స్టార్‌గా ఎదుగుతాడని సగటు భారత క్రికెట్ అభిమాని బలంగా ఆకాంక్షిస్తున్నాడు.

Publish Date: Jul 4, 2026 7:09PM

political-news-img

తెలంగాణ అప్పులపై భట్టి విక్రమార్కవి పచ్చి అబద్ధాలు.. : హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఈ విధమైన అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త డ్రామాలకు తెరలేపారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు లేని అప్పులను కూడా ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పాలక పక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎంత కోపంతో ఊగిపోయినా వాస్తవాలను దాచలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసిన రూ.15 వేల కోట్ల అప్పును కూడా బీఆర్‌ఎస్‌ ఖాతాలో చూపారని హరీశ్ రావు విమర్శించారు . రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారిపోవంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.4.14 లక్షల కోట్లు మాత్రమే. కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను మాజీ సీఎం కేసీఆర్‌ అమలు చేశారని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందు ప్రజల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా గ్యారంటీ కార్డులను పంచారని హరీశ్ రావు గుర్తు చేశారు. తీరా అధికార పీఠం దక్కిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేసే సత్తా లేక ఇలాంటి కుంటిసాకులు వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పించుకోవడానికే రోజుకో అబద్ధం, పూటకో సాకు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, ఇచ్చిన గ్యారంటీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర అసంతృప్తిని, డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకే భట్టి విక్రమార్క ఇలాంటి గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ విధమైన రాజకీయ ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోలేరని హరీశ్ రావు పేర్కొన్నారు. తాము చేసిన వ్యూహాత్మక అప్పుల వల్ల రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందే తప్ప నష్టం జరగలేదని గులాబీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్పుల సాకుతో కాలం గడపడంపై ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని పక్కనబెట్టి, అసెంబ్లీ ఎన్నికల వేళ తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా ఎలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో హామీల అమలుపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ తాము ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్పుల సాకుతో రోజులు నెట్టుకొస్తున్న సర్కార్‌పై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Publish Date: Jul 4, 2026 6:59PM

MOVIE NEWS