Top Stories

political-news-img

జగన్‌కు దమ్ముంటే కాపు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి : కిరణ్ రాయల్

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. అలా ప్రకటిస్తే తాను స్వయంగా వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం 25 నుంచి 27 శాతం వరకు ఓటు బ్యాంక్ కలిగి ఉందని, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు కీలకమని అన్నారు. కాపు సామాజిక వర్గం మద్దతుతోనే కూటమి ప్రభుత్వం 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అయితే, కాపు వర్గాన్ని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బాధ్యుడిగా చూపించడం సరికాదని కిరణ్ రాయల్ అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ సమావేశం వెనుక జనసేన, కూటమిని బలహీనపరిచే రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపించారు. జగన్ నిజంగా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే ఆ ఐదుగురు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేదా ఐదుగురికి ఒక్కో ఏడాది చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచాలని సూచించారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి రాధాను రాజకీయంగా నయవంచన చేసి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని, అదే విధానాన్ని జగన్ కొనసాగిస్తూ కాపు సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై కూడా కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.300 చొప్పున చెల్లించి పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలు చేయించడం భూమనకు అలవాటైందని ఆరోపించారు. తిరుపతిలో భూమన కుటుంబం అనేక శాఖలకు మంత్రుల్లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అభినయ్ రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న చైతన్య యాదవ్ అరాచక శక్తిగా మారాడని, వడ్డీ వ్యాపారాలు నిర్వహించాడని ఆరోపించారు. కాపులంటే భూమనకు భయం ఉందని, చిన్న అంశాన్నైనా పెద్దదిగా చూపిస్తూ పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ డ్రామాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఓట్లు రాకపోవడంతో కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, దీనికి భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు.

Publish Date: Jun 23, 2026 9:26PM

political-news-img

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని గురువారం (జూన్ 25) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Publish Date: Jun 23, 2026 9:14PM

political-news-img

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ..క్యాబినెట్ మార్పులు తథ్యమేనా?

దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందనే ప్రచారం జోరందుకున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రిమండలిలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ ఈ ఇద్దరు అగ్రనేతల సమాలోచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్ట్రపతి అధికారిక కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పంచుకుంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి కేరళకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఆయన గతంలో మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కురియన్‌తో పాటు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ పదవీ కాలం కూడా జూన్ 21తో ముగిసింది. ఈ ఇద్దరు నేతలను బీజేపీ అధిష్ఠానం మళ్లీ పెద్దల సభకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. దీనితో వీరి స్థానంలో కొత్తవారికి కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు, కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు బీజేపీ జాతీయ నాయకత్వం కీలకమైన సంస్థాగత బాధ్యతలను అప్పగిస్తోంది. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ పార్టీ బాధ్యుడిగా నియమించడం ఈ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. పార్టీ బాధ్యతలు చేపట్టిన వారిని మంత్రి పదవుల నుంచి తప్పించి, పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే దానిపై రాజకీయ నిపుణులు విశ్లేషణలు మొదలుపెట్టారు. మరికొద్ది నెలల్లో జరగబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి భేటీ ముగియడంతో త్వరలోనే క్యాబినెట్ విస్తరణపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Publish Date: Jun 23, 2026 8:59PM

political-news-img

సీఎం విజయ్‌కు త్రిష సర్‌ప్రైజ్ బర్త్‌డే విషెస్...రూమర్లకు చెక్!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడం, పైగా ఆయన తన 52వ వసంతంలోకి అడుగుపెట్టడంతో ఈ బర్త్‌డే వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, ఈ వేడుకల వేళ త్రిష చేసిన ఒక పని అభిమానులను తీవ్రమైన గందరగోళానికి, ఆ తర్వాత అంతే ఆనందానికి గురిచేసింది. అసలు ఏం జరిగిందంటే, జూన్ 22వ తేదీన సీఎం విజయ్ పుట్టినరోజు కాగా, సరిగ్గా అదే రోజు త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే వార్త నెట్టింట దావానలంలా వ్యాపించింది. వీరిద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చాయంటూ రూమర్స్ గట్టిగా వినిపించాయి. తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నుండి ఇతర ముఖ్య రాజకీయ నేతల వరకు అందరూ విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే, త్రిష నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ, కథలో అసలైన ట్విస్ట్ ఒక రోజు ఆలస్యంగా జూన్ 23న ఊహించని విధంగా వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, త్రిష తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సీఎం విజయ్‌తో కలిసి ఉన్న ఒక అద్భుతమైన ఫొటోను షేర్ చేసింది. ఒక వైపు పెద్ద ఎత్తున కేకులు అమర్చి ఉండగా, విజయ్ పక్కన కూర్చుని త్రిష సంతోషంగా నవ్వుతున్న దృశ్యం ఆ ఫొటోలో కనిపించింది. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా "ఇవన్నీ విలువైనవిగా చేసే ఆ ప్రత్యేకమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు (Happy Birthday to the person who makes it all worth it)" అంటూ చాలా ఎమోషనల్ లైన్ రాసుకొచ్చింది. ఒకరోజు ఆలస్యంగా విష్ చేసినప్పటికీ, ఆమె పెట్టిన పోస్ట్ మరియు క్యాప్షన్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విజయ్, త్రిషల కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వీరు కలిసి నటించిన గిల్లి (2004), తిరుపాచ్చి (2005), కురువి (2008) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘లియో’ సినిమాతో ఈ జంట మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. ఆ తర్వాత 2024లో వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) చిత్రంలోనూ త్రిష ఒక క్యామియో రోల్‌లో మెరిసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి స్నేహంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి త్రిష ఒకవైపు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో పాటు, సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో లాయర్ పాత్రలో బిజీగా ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లోనూ సీఎం విజయ్ 52వ బర్త్‌డే కోసం ఆమె ప్రత్యేకంగా విషెస్ చెప్పడం, ఆ ఫొటో క్షణాల్లో వైరల్ కావడం వీరిద్దరి బాండింగ్ ఎంత స్ట్రాంగో మరోసారి నిరూపించింది. రూమర్లకు తన స్టైల్లో చెక్ పెట్టిన త్రిషపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Publish Date: Jun 23, 2026 8:46PM

political-news-img

బెయిల్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఎస్సై

హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే అదే చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వి. నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆ కేసు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానంటూ ఎస్సై నరసింహులు ఫిర్యాదిదారుడి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అంత మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదిదారుడు చెప్పడంతో ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి. చివరకు తొలి విడతగా రూ.50 వేల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. అయితే ఎస్సై అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, మంగళవారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోనే డబ్బులు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదిదారుడి నుంచి ఎస్సై నరసింహులు రూ.50 వేల లంచం తీసుకుంటుండగానే హైదరాబాద్ సిటీ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఆయన సూచించిన ప్రదేశం నుంచి కలుషితమైన రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుంది. తర్వాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్సై కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి సంబంధిత పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిజాయితీ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి, అక్రమ ప్రయోజనం కోసం లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఎస్సై నరసింహులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 94404 46106 వాట్సాప్ నంబర్ ద్వారా లేదా ఏసీబీ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Publish Date: Jun 23, 2026 8:26PM

political-news-img

సీఎం విజయ్‌ వ్యక్తిగత జీవితంపై ఉదయనిధి షాకింగ్ కామెంట్స్

తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ, గత డీఎంకే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. పరిపాలనా దక్షత అంటే ఒకదాని తర్వాత ఒకటి అవినీతికి పాల్పడి, ఆ తర్వాత జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడం కాదంటూ సీఎం విజయ్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో టాస్మాక్ (TASMAC) మద్యం విక్రయాల ద్వారా 'పార్టీ నిధుల' పేరిట భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఆ విధంగా దోచుకున్న ప్రతి పైసాను తాము తిరిగి ప్రభుత్వ ఖజానాకు మళ్ళిస్తున్నామని విజయ్ సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వం తమిళనాడును ఏకంగా రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని, ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఆయన లెక్కలతో సహా ధ్వజమెత్తారు. సీఎం విజయ్ చేసిన ఈ 'పార్టీ ఫండ్స్' లూటీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరియు డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరపెడుతూ, ధైర్యముంటే ఆ పార్టీ పేరును స్పష్టంగా చెప్పాలని, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఉదయనిధి డిమాండ్ చేయగా, సభాపతి జె.సి.డి. ప్రభాకర్ ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాతే అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో సీఎం విజయ్ తన దూకుడును మరింత పెంచారు. కేవలం టాస్మాక్ మాత్రమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో పార్టీ నిధుల పేరిట దోచుకున్న సొమ్మును ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ ఖజానాకు రాబడతామని ఉద్ఘాటించారు. ప్రజల సొమ్ము నుండి ఒక్క పైసా కూడా తాము తాకబోమని, వేరే ఎవరినీ తాకనివ్వబోమని, ఒకవేళ గతంలో ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటే వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయ్ గట్టిగా హెచ్చరించారు. డీఎంకే నేతలు తమపై విమర్శలు చేయడానికి ఒక కొత్త అస్త్రాన్ని వాడుతున్నారని, తమ పూర్వ మిత్రపక్షాల దయ వల్లే ఈ ప్రభుత్వం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారని విజయ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రజల బలమైన తీర్పు (మాండేట్) మరియు మనస్సాక్షి ప్రకారం పనిచేసే మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తోందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు తమకు స్వతంత్రంగానే మద్దతు ప్రకటించాయని, అలాంటప్పుడు డీఎంకే నేతలకు ఎందుకు అంత కోపం, ఆవేదన అని విజయ్ ప్రశ్నించారు. ఈ విధంగా తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్ మరియు ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన ఈ పోరు రాబోయే రోజుల్లో తమిళ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Publish Date: Jun 23, 2026 8:14PM

MOVIE NEWS