political-news-img

టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

తెలంగాణలో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ 20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. నటుడు విజయ్ దేవరకొండ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిథి యూనివర్సిటీ ఎంపికైంది. లీగ్ ఆరంభానికి సమయం దగ్గర పడుతుండటంతో అభిమానులను ఆకర్షించడానికి హెచ్‌సీఏ, ప్రాంచైజీ యాజమాన్యాలులు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. బుధవారం (జూన్ 17) ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరించనున్నారు. ఇటీవల నెక్లెస్ రోడ్‌లో హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన డ్రోన్ డిస్‌ప్లే షోలో జట్ల లోగోలను నిర్వాహకులు ప్రదర్శించారు. 8 జట్లు తలపడనున్న టోర్నీలో టికెట్ ధరలు రూ.50, రూ.100గా నిర్ణయించారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. కోటి, రన్నరప్ జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు ముందు జరిగే వేడుకల్లో సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉంటాయి.

Publish Date: Jun 16, 2026 6:58PM

political-news-img

భారత్‌కు ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు

భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్టనర్షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలున్నాయి. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం. 3 దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్ షిప్‌నే నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించి అందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతం అని స్పష్టం చేస్తున్నా. సింగపూర్ పారిశ్రామిక వేత్తలు అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను రెండో నివాసంగా ఎంచుకోవాలి.’ అని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ‘ఏపీలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్‌కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ కూడా ఏర్పాటు అవుతోంది. ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించాం. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం. గూగుల్‌తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా రూ.7 వేల కోట్లతో శ్రీసిటీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగింది. దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలను తీసుకుని పౌరసేవల్ని అందిస్తున్నాం ప్రపంచ ఆర్ధిక శక్తిగా భారత్ వికసిత్ భారత్ 2047 విజన్‌లాగే స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు రూపకల్పన చేశాం. త్వరలోనే భారత ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. సుదీర్ఘమైన తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రంగా ఉంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా వివిధ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. పూర్తి స్థాయి సన్నద్ధతతో ఈ సంక్షోభాన్ని కూడా భారత్ సమర్ధంగా ఎదుర్కోగలిగింది. ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్ధిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నాం. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పాలసీలు అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి లభ్యత, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. గ్లోబల్ నగరాలకు ఏపీ కనెక్టివిటీ ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చాం. అలాగే ఎంఎస్ఎంఈ సహా వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై కూడా దృష్టి పెట్టాం. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎక్కడా జాప్యం లేకుండా అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తున్నాం. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశీ పోర్టులకు కనెక్టు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఏపీలో ఉన్నాయి. భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో ఫంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఉన్న పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలు అనుసంధానించేలా రహదారి, రైల్ నెట్వర్క్‌ను కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లతో పాటు రాష్ట్రంలోని 175 చోట్ల నియోజకవర్గ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక పార్కులకు నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. రాయలసీమలోని పుట్టపర్తి వద్ద 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కూడా వస్తోంది. ఈవీల వినియోగం పెంచటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. నాలెడ్జ్ హబ్‌గా అమరావతి ‘అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయటంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాం. హైస్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా అమరావతిని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను కనెక్టు చేస్తుంది. బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించటం తోపాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అమరావతిలోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా క్వాంటం అమరావతిలో కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. ప్రాజెక్టులు పెట్టే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. త్వరలోనే విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు, పర్యాటక, బుద్దిస్ట్ సర్క్యూట్‌లు ఉన్నాయి. అక్వా, వ్యవసాయం, హార్టికల్చర్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశం ఉంది. పెద్దఎత్తున ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను పండిస్తున్నాం. ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పరీక్షించి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణ అవకాశం. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా స్టార్టప్‌లదే ‘భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. ఇందులో 25 శాతం మేర ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. భారత్‌లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కునేలా కొన్ని దేశాలు సొంతంగా నిధిని ఏర్పాటు చేశాయి. సింగపూర్ కూడా సావరిన్ ఫండ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. సమీప భవిష్యత్ అంతా స్టార్టప్ లదే. వాటిని ప్రోత్సహిస్తే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టడం విజయవంతమైన మార్గంగా చూస్తున్నాయి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌ను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఈ ఆర్ధిక నగరంలో ఉంటాయి’ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jun 16, 2026 6:21PM

political-news-img

మందులు లేకుండానే నరాల బలహీనతను నయం చేయవచ్చు.. ఇంట్లోనే చేసుకునే ఈ 2 చిట్కాలు మీకోసమే!

ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి. ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

Publish Date: Jun 16, 2026 6:21PM

political-news-img

విత్తనాల నుంచి పంట కొనుగోళ్ల వరకు ప్రత్యేక ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట సాగు ప్రారంభమైనప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల రికార్డుల నిర్వహణ, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశపై వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలు, రైతులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, రైతు కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిపుణులు ఇచ్చిన సూచనలను సమావేశంలో చర్చించారు. వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఉన్నతాధికారుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రణాళిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలను ఈ కమిటీ నిరంతరం పరిశీలిస్తుంది. ప్రతి గ్రామంలో రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలను క్షేత్రస్థాయి పరిశీలనతో ఖచ్చితంగా నమోదు చేయాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాల మేరకు పంటల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ అందిస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు వేదికల ద్వారానే ఈ విత్తనాల పంపిణీ జరగాలని పేర్కొన్నారు. సన్న వడ్లు సాగు చేసే రైతుల పూర్తి డేటాను సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సమగ్ర సమాచారం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రైతు వేదికలను రైతులకు ఉపయోగపడే సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని, వాటి పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతికతను అనుసంధానం చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి, రైతులకు ప్రయోజనకరంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని, ఈ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో అత్యధిక వాటా తెలంగాణకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరాలని సూచించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టాలను తగ్గించగలిగామని తెలిపారు. గతంలో టన్ను మొక్కజొన్నను రూ.13 వేలకే విక్రయించాల్సి వచ్చేదని, ఈసారి టెండర్లలో టన్నుకు రూ.21 వేలకుపైగా ధర లభించిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల బాటలో నడిపించాలని, ప్రభుత్వ డెయిరీ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలని సూచించారు. పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Publish Date: Jun 16, 2026 5:35PM

political-news-img

వైసీపీకి మెటా షాక్.. వెనుక నిజాలివే!

తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం, మెటా యాజమాన్యానికి ఆయన 'ఎక్స్' వేదికగా ట్యాగ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులలో అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలపై తాము సాక్ష్యాలతో నిలదీస్తుంటే తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. అయితే.. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రంగా ఖండించారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు. ఈ పరీక్షల కోసం టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నలతో కూడిన భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ఆన్‌లైన్ విధానంలో ఉపయోగించారని, దీనివల్ల పేపర్ లీక్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా విపక్షం తప్పుడు ప్రచారం ఆపలేదన్నారు. అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య అనే వ్యక్తి ద్వారా ఒక నకిలీ ఆడియో క్లిప్‌ను సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని టీడీపీ ఆధారాలతో సహా మెటా సంస్థకు ఫిర్యాదు చేసింది. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తులను సైతం దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర వారిదని, అందుకే అప్పట్లో హైకోర్టు ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించిందని అప్పసాని రాజేష్ గుర్తుచేశారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రులపై మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకరంగా ప్రచారం చేస్తూ, దానిని భావప్రకటన స్వేచ్ఛగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ ఇదే ధోరణి సాగితే అబద్ధాలను ప్రచారం చేసే సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ను కూడా నియంత్రించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ బ్లాక్ అనేది ప్రజాస్వామ్య అణచివేత కాదని, ఫేక్ న్యూస్ నెట్‌వర్క్‌పై మెటా తీసుకున్న చట్టపరమైన చర్య మాత్రమేనని ఆయన చెప్పారు. అయినా మెటా ఫిర్యాదు చేయగానే బ్లాక్ చేయదనీ, నిజానిజాలను నిర్ధారించుకుని వైసీపీకి నోటీసులు పంపించిన తరువాత కూడా అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం వల్లే మెటా చర్య తీసుకుందన్నారు.

Publish Date: Jun 16, 2026 5:33PM

political-news-img

సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు షెడ్యూల్ ఖరారు

సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అందజేసి, జాతర నిర్వహణ ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రజల విశ్వాసం, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన జాతరలలో ఒకటిగా పరిగణించబడతాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలివస్తారు. 2026 షెడ్యూల్ ప్రకారం జూలై 19న అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని సంప్రదాయంగా ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు, శాంతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహిళా భక్తులు సంప్రదాయంగా బోనం (అమ్మవారికి నైవేద్యం) తీసుకుని ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఆలయం మొత్తం భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది. తరువాత ఆగస్టు 3న రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమం బోనాల జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావించబడుతుంది. ఇందులో భవిష్యవాణి చెప్పే ఆచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదే రోజు ఉదయం 10.30 గంటలకు అమ్మవారి గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆలయ వీధుల్లో ఘనంగా సాగే ఈ ఊరేగింపును చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రితో కలిసి అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రవాణా, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద 2026 సికింద్రాబాద్ మహంకాళి బోనాలు మరోసారి భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.

Publish Date: Jun 16, 2026 5:15PM

MOVIE NEWS